దేశంలోని ప్రధాన నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం ఊహించని మందగమనాన్ని ఎదుర్కొంటోంది. 2025 సంవత్సరం ముగింపు నాటికి భారతదేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. ప్రాప్‌ఈక్విటీ అనే రియల్టీ సంస్థ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025 నాలుగో త్రైమాసికంలో మొత్తం 98,019 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 16 శాతం క్షీణత నమోదైంది. ముఖ్యంగా 2021 మూడో త్రైమాసికం తర్వాత నమోదైన అత్యల్ప విక్రయాల వాల్యూమ్ ఇదే కావడం గమనార్హం.
నవీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల జోరు
మొత్తం మార్కెట్ డీలా పడినా నవీ ముంబై, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లు మాత్రం సానుకూల వృద్ధిని కనబరిచాయి. నవీ ముంబై అమ్మకాల్లో 13 శాతం వృద్ధిని నమోదు చేసి స్టార్ పర్ఫార్మర్‌గా నిలిచింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ 4 శాతం వృద్ధితో నిలకడను చాటుకుంది. అయితే, మిగిలిన ఏడు ప్రధాన నగరాల్లో అమ్మకాలు ఏకంగా 31 శాతం వరకు పడిపోయాయి.
ప్రధాన నగరాల్లో అమ్మకాల పరిస్థితి
బెంగళూరు: 15,603 యూనిట్ల విక్రయాలతో గతంతో పోలిస్తే 7 శాతం క్షీణతను చూసింది.
హైదరాబాద్: ఇక్కడ కూడా అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి.
పుణె: అత్యధికంగా 31 శాతం క్షీణతతో 15,788 యూనిట్లకు పడిపోయింది.
చెన్నై, కోల్‌కతా: వరుసగా 16 శాతం వార్షిక క్షీణతను నమోదు చేశాయి.
ప్రీమియం ఇళ్ల వైపు మొగ్గు
అమ్మకాలు తగ్గినప్పటికీ డెవలపర్ల ఆదాయం, ఇళ్ల విలువల విషయంలో ఆసక్తికర మార్పు కనిపిస్తోంది. 2023లో 4.81 లక్షల ఇళ్ల లాంచ్ విలువ రూ.6.3 లక్షల కోట్లుగా ఉంటే, 2024లో లాంచ్ అయిన ఇళ్ల సంఖ్య (4.11 లక్షలు) తగ్గినప్పటికీ, వాటి విలువ మాత్రం రూ.6.8 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొనుగోలుదారులు, డెవలపర్లు లగ్జరీ/ప్రీమియం విభాగం వైపు మళ్లుతున్నారని స్పష్టం చేస్తోంది.
తగ్గిన సరఫరా
కేవలం అమ్మకాలే కాకుండా కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కూడా ఈ త్రైమాసికంలో 10 శాతం తగ్గి 88,427 యూనిట్లకు చేరుకుంది. పెరిగిన నిర్మాణ వ్యయం, మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి వల్ల డెవలపర్లు ఆచితూచి అడుగులు వేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్‌లో కొత్త ప్రాజెక్ట్‌ల సరఫరాలో వరుసగా 16%, 7% మేర తగ్గుదల నమోదైంది.
ఇదీ చదవండి: ప్రయాణికులు గాల్లో తేలాల్సిందే!


