డిసెంబర్ త్రైమాసికంలో 19% తక్కువ
దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ఇదే పరిస్థితి
డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ వెల్లడి
న్యూఢిల్లీ: హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా టాప్–9 నగరాల్లో ఇళ్ల అమ్మకాలు ప్రస్తుత త్రైమాసికంలో (అక్టోబర్–డిసెంబర్) 98,019 యూనిట్లకు పరిమితం అవుతాయని రియల్ ఎస్టేట్ డేటా అనలైటిక్స్ సంస్థ ప్రాప్ ఈక్విటీ అంచనా వేసింది. 2024 చివరి త్రైమాసికంలో విక్రయాలు 1,16,137 యూనిట్లతో పోలి్చతే 16 శాతం తక్కువ అని తెలిపింది. 2021 జూలై–సెపె్టంబర్ త్రైమాసికం తర్వాత ఇంత తక్కువ విక్రయాలు మళ్లీ ఇదేనని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న విక్రయ గణాంకాల ఆధారంగా డిసెంబర్ త్రైమాసికంపై తన అంచనాలతో ఒక నివేదికను విడుదల చేసింది.
నవీ ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్ మినహా మిగిలిన ఏడు నగరాల్లో అమ్మకాలు తగ్గినట్టు తెలిపింది. ఆయా నగరాల్లోని ప్రధాన నివాస ప్రాంతాలకు సంబంధించిన డేటా ఆధారంగా ప్రాప్ ఈక్విటీ ఈ అంచనాలు రూపొందించింది. ‘‘సంప్రదాయంగా అక్టోబర్–డిసెంబర్‌లో అమ్మకాలు బలంగా ఉంటుంటాయి. పండుగల సీజన్‌లో కొత్త ప్రాజెక్టుల ప్రారంభాలు కనిపిస్తుంటాయి. ఇటీవలి అమ్మకాల క్షీణత అన్నది మార్కెట్లో ప్రీమియమైజేషన్‌ను సూచిస్తోంది. దీంతో అమ్మకాలు తగ్గినప్పటికీ విలువలో వృద్ధి కనిపిస్తోంది’’ అని ప్రాప్ ఈక్విటీ వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ జసూజ తెలిపారు.
నగరాల వారీ అంచనాలు..
→ హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు డిసెంబర్ త్రైమాసికంలో క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 19 శాతం తగ్గి 11,323 యూనిట్లుగా ఉండొచ్చు.
→ చెన్నైలోనూ 3 శాతం తక్కువగా 4,542 యూనిట్లకు విక్రయాలు పరిమితం కావొచ్చు.
→ బెంగళూరులో అమ్మకాలు 15,603 యూనిట్లుగా ఉంటాయి. క్రితం ఏడాది ఇదే కాలంతో పోలి్చతే ఒక శాతం తక్కువ.
→ కోల్‌కతాలో 11 శాతం తక్కువగా 3,995 యూనిట్లుగా ఉంటాయి.
→ పుణెలో అమ్మకాలు ఏకంగా 31 శాతం తగ్గి 15,788 యూనిట్లకు పరిమితం అవుతాయి.
→ థానేలో అమ్మకాలు 26 శాతం తగ్గి 16,987 యూనిట్లుగా ఉంటాయి.
→ ముంబై మార్కెట్లోనూ 25 శాతం తక్కువగా 9,135 యూనిట్లకు విక్రయాలు పరిమితం అవుతాయి.
→ నవీ ముంబైలో మాత్రం 13 శాతం అధికంగా 8,434 యూనిట్లు అమ్ముడుపోవచ్చు.
→ ఢిల్లీ ఎన్‌సీఆర్ మార్కెట్లోనూ అమ్మకాలు 4 శాతం వృద్ధితో 12,212 యూనిట్లుగా ఉంటాయి.
→ ఇక ఈ నగరాల్లో కొత్త ఇళ్ల యూనిట్ల సరఫరా సైతం 10 శాతం తగ్గి 88,427 యూనిట్లుగా ఉంటాయన్నది ప్రాప్ ఈక్విటీ అంచనా.


