ప్రొడక్టులలో ఏఐ వినియోగంపై దృష్టి
కన్జూమర్ ఫైనాన్స్ విభాగం విస్తరణ
న్యూఢిల్లీ: దేశీయంగా లిస్టింగ్ యోచన లేదని దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ ఎల్రక్టానిక్స్ తాజాగా స్పష్టం చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలియజేసింది. వివిధ ప్రొడక్టులలో ఏఐను మరింత వినియోగించనున్నట్లు పేర్కొంది. కంపెనీకి అత్యంత ముఖ్యమైన దేశీ మార్కెట్లో అమ్మకాలు పెంచుకునేందుకు వీలుగా కన్జూమర్ ఫైనాన్స్ విభాగాన్ని విస్తరించనున్నట్లు తెలియజేసింది.
భారత్‌లో తయారీ కార్యకలాపాలను మరింత లోతుగా విస్తరించే యోచనలో ఉన్నట్లు శాంసంగ్ నైరుతి ఆసియా ప్రెసిడెంట్, సీఈవో జేబీ పార్క్ తెలియజేశారు. దేశీయంగా మొబైల్ ఫోన్ డిస్‌ప్లేల తయారీపై ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకానికి(పీఎల్‌ఐ) దరఖాస్తు చేసినట్లు వెల్లడించింది. ప్రపంచంలోనే మొబైల్ ఫోన్ తయారీకి నోయిడాలో అతిపెద్ద ప్లాంటును నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలకాలంలో ఇది కీలక ఎగుమతుల కేంద్రంగా ఆవిర్భవించింది.
కాగా.. దేశీయంగా ఐపీవో చేపట్టడంపై స్పందిస్తూ పార్క్ ప్రస్తుతానికి అలాంటి ప్రణాళికలులేవని స్పష్టం చేశారు. అయితే ఇతర దక్షిణ కొరియా దిగ్గజాలు హ్యుందాయ్ మోటార్ ఇండియా, ఎల్‌జీ ఎల్రక్టానిక్స్ ఇటీవల పబ్లిక్ ఇష్యూతో నిధుల సమీకరణ చేపట్టడం ద్వారా దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన విషయం విదితమే. తద్వారా దేశీ కార్యకలాపాలను మరింత పటిష్ట పరచుకుంటున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి. వృద్ధికి అవసరమైన పెట్టుబడులను కలిగి ఉన్నట్లు పార్క్ తెలియజేశారు. అవసరమైతే కార్పొరేట్ బాండ్ల జారీ లేదా సంస్థాగత రుణాలు తదితర మార్గాలలో నిధులు సమకూర్చుకోనున్నట్లు వివరించారు.


