పదేళ్లలో రెట్టింపు
90 శాతం ప్రభుత్వరంగంలోనే
న్యూఢిల్లీ: దేశంలో పెట్రోల్ బంక్‌లు నవంబర్ చివరికి 1,00,266 మార్క్‌ను చేరాయి. 2015లో ఉన్న 50,451 స్టేషన్ల నుంచి చూస్తే రెట్టింపైనట్టు ప్రభుత్వ డేటా తెలియజేస్తోంది. యూఎస్, చైనా తర్వాత అత్యధిక సంఖ్యలో పెట్రోల్ బంక్‌లు మనదేశంలో ఉండడం గమనార్హం. పీఎస్‌యూ చమురు మార్కెటింగ్ కంపెనీలు (ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్) మార్కెట్ వాటాను కాపాడుకునేందుకు విస్తరణ చేపడుతుండడంతో మారుమూల ప్రాంతాలకు సైతం పెట్రోల్ స్టేషన్లు చేరుతున్నాయి.
మొత్తం పెట్రోల్ పంపుల్లో 90% ఈ 3 సంస్థల నిర్వహణలోనే ఉన్నాయి. ఐవోసీ నిర్వహణలో 41,664 స్టేషన్లు ఉంటే, బీపీసీఎల్‌కు 24,605, హెచ్‌పీసీఎల్‌కు 24,118 స్టేషన్లున్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 29% ఉన్నాయి. రష్యా రోజ్‌నెఫ్ట్‌కు చెందిన ‘నయారా ఎనర్జీ’ 6,921 పెట్రోల్ అవుట్‌లెట్లతో ప్రైవేటు రంగంలో తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాత రిలయన్స్–బీపీ జేవీలో 2,114 స్టేషన్లు, షెల్ నిర్వహణలో 346 స్టేషన్లు ఉన్నాయి. మొదటిసారి 2004లో ప్రైవేటు రంగంలో పెట్రోల్ స్టేషన్ల ఏర్పాటయ్యాయి. యూఎస్‌లో 1,96,643 రిటైల్ గ్యాస్ స్టేషన్లు, చైనాలో 1,15,228 గ్యాస్ స్టేషన్లు ఉన్నట్టు అంచనా.


