breaking news
infosys ceo and md
-
ఇన్ఫీ లాభం రూ.7,769 కోట్లు
న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ మిశ్రమ పనితీరును నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి క్వార్టర్ (2026–27, క్యూ1)లో రూ.7,769 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గతేడాది ఇదే క్వార్టర్లో రూ. 6,921 కోట్లతో పోలిస్తే లాభం 12.2% పెరిగింది. మొత్తం ఆదాయం 14% వృద్ధితో రూ. 48,211 కోట్లకు చేరింది. క్రితం ఏడాది క్యూ1లో ఆదాయం రూ. 42,279 కోట్లుగా ఉంది. సీక్వెన్షియల్‌గా.. ప్చ్ గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్ (2025–26, క్యూ4)లో నమోదైన లాభం రూ. 8,501 కోట్లతో పోలిస్తే సీక్వెన్షియల్‌గా ఈ ఏడాది క్యూ1లో 8.6 శాతం తగ్గింది. ఆదాయం మాత్రం స్వల్పంగా 3.9 శాతం వృద్ధి చెందింది. గతేడాది క్యూ4లో కంపెనీ రూ. 46,402 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. గైడెన్స్ కోత.. ప్రపంచవ్యాప్తంగా స్థూల ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితులు కొనసాగుతున్న నేపథ్యంలో 2026–27 పూర్తి ఏడాది ఆదాయం వృద్ధి అంచనాల్లో (గైడెన్స్) ఇన్ఫీ కోత విధించింది. ఆదాయ గైడెన్స్‌ను 1.5–3 శాతానికి తగ్గించింది. గతంలో ఆదాయ వృద్ధి 1.5–3.5 శాతంగా ఉండొచ్చని కంపెనీ అంచనా వేసింది. ఇతర ముఖ్యాంశాలివీ... → క్లయింట్ల కోసం కంపెనీలో 80,000 మంది సిబ్బంది ఏఐ కోడింగ్ టూల్స్ ఉపయోగిస్తున్నారని, వచ్చే కొన్నేళ్లలో 6,000 మంది ఏఐ ఫ్రాంటియర్ ఇంజినీర్ల టీమ్‌ను ఏర్పాటు చేస్తామని ఇన్ఫీ పేర్కొంది.→ జూన్ చివరినాటికి కంపెనీ మొత్తం ఉద్యోగులు సంఖ్య 3,28,062కు చేరింది. మార్చినాటికి సిబ్బంది సంఖ్య 3,28,594తో పోలిస్తే 532 మంది తగ్గారు. ఉద్యోగుల వలసల (అట్రిషన్) రేటు 13%గా నమోదైంది. → ఉద్యోగులకు వేతనాల పెంపు విషయానికొస్తే అక్టోబర్, జనవరి (సీనియర్లకు)లో రెండు విడతల్లో ఉంటుందని కంపెనీ తెలిపింది.→ క్యూ1లో 4,000 మందికి పైగా కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకున్నామని కంపెనీ వెల్లడించింది, గతేడాది మాదిరిగానే ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 20,000 మంది ఫ్రెషర్లకు ఉద్యోగాలిచ్చే ప్రణాళికల్లో ఉన్నామని వెల్లడించింది. → క్యూ1 ఆదాయంలో ఏఐ సర్వీసుల వాటా 8.5 శాతానికి పెరిగింది. → 3.6 బిలియన్ డాలర్ల విలువైన భారీ కాంట్రాక్టులు కుదుర్చుకుంది. ఇన్ఫోసిస్ షేరు ఫ్లాట్‌గా రూ.1,052 వద్ద క్లోజైంది. మార్కెట్ ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఇన్ఫీ ఏడీఆర్ 4 శాతం నష్టాల్లో ట్రేడవుతోంది.ఏఐ జోరు ఇప్పుడు ఆదాయం వనరుగా మారుతోంది. ఎంటర్ప్రైజ్ ఏఐని అమలు చేయడం ద్వారా ఇన్ఫోసిస్ స్థిరమైన మార్కెట్ వాటాను దక్కించుకుంటోంది. పటిష్టమైన భారీ డీల్స్ కుదరడం కంపెనీపై క్లయింట్ల నమ్మకానికి నిదర్శనం. దాదాపు అన్ని దిగ్గజ ఏఐ కంపెనీలతో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం, నవకల్పనల ఎకోసిస్టమ్‌ను అందించడం ద్వారా క్లయింట్లు తమ నిర్వహణ ఉత్పాదకతను పెంచుకోవడంలో, వృద్ధి అవకాశాలను అన్‌లాక్ చేయడంలో తోడ్పాటునందిస్తున్నాం.మా ఉద్యోగులందరికీ ఏఐ నైపుణ్యాలను పెంచడానికి కట్టుబడి ఉన్నాం. ఒక క్లయింట్ నిర్ణయం కారణంగా ఆదాయంపై అసాధారణ (వన్‌టైమ్) ప్రభావం పడింది. – సలీల్ పరేఖ్, ఇన్ఫోసిస్ సీఈఓ, ఎండీ -
ఇది ఓ సోలార్ సముద్రం!
సముద్రపు నీళ్లతో ఏం చేయగలమో తెలియదు గానీ.. ఈ సోలార్ సముద్రం మాత్రం కావల్సినంత విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. హైదరాబాద్ శివార్లలోని పోచారంలో ఉన్న ఇన్ఫోసిస్ క్యాంపస్‌లో 6.6 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆ సంస్థ సీఈవో, ఎండీ విశాల్ సిక్కా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సువిశాల ప్రదేశంలో ఏర్పాటుచేసిన సోలార్ ప్యానళ్ల వద్ద ఫొటో తీయించుకుని, ఇది పోచారంలోని తమ సోలార్ ప్యానళ్ల సముద్రమంటూ ట్వీట్ చేశారు. నీలి ఆకాశం నవ్వుతోందని కూడా చెప్పారు. ఇప్పటికే పోచారం క్యాంపస్‌లో 0.6 మెగావాట్ల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంటు ఉంది. దీంతో కలిపితే మొత్తం 7.2 మెగావాట్ల సామర్థ్యం ఉన్నట్లయింది. తమ క్యాంపస్ అవసరాలకు కావల్సిన మొత్తం విద్యుత్తు ఈ సోలార్ ప్లాంటు నుంచే వస్తుందని విశాల్ సిక్కా తెలిపారు. దీంతో.. ఇలా తమకు కావల్సిన విద్యుత్తు అంతటినీ పునరుత్పాదక ఇంధనవనరుల నుంచి పొందే మొట్టమొదటి కార్పొరేట్ క్యాంపస్‌గా పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ నిలిచింది. ఇక్కడి ప్లాంటును విజయవంతంగా గ్రిడ్‌తో అనుసంధానం చేశారు. ఏడాదికి 12 మిలియన్ల కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. తద్వారా కార్బన్ ఉద్గారాలను 9,200 టన్నుల మేర తగ్గించినట్లవుతుంది. దీంతో కలిపి దేశవ్యాప్తంగా ఇన్ఫోసిస్ 12 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లను నెలకొల్పినట్లయింది. రాబోయే రెండు నెలల్లో మరో 3 మెగావాట్ల ప్లాంట్లను పెడతామని చెబుతున్నారు. A sea of solar panels in our gorgeous @Infosys Hyderabad campus. Blue skies smiling at us... pic.twitter.com/iuVWI4ioGu — Vishal Sikka (@vsikka) December 28, 2015 The @Infosys Hyderabad campus is now 100% off the grid, thanks to our 7.2MW solar farm & our incomparable infra team https://t.co/iHsRwpaA13 — Vishal Sikka (@vsikka) December 28, 2015 Congrats Vishal https://t.co/B9hPx5Vmks — KTR (@KTRTRS) December 29, 2015


