‘అపార్‌’ తల్లిదండ్రుల ఇష్టం  | Supreme Court to direct CBSE to implement APAAR changes across India | Sakshi
Sakshi News home page

‘అపార్‌’ తల్లిదండ్రుల ఇష్టం 

Jul 21 2026 12:43 AM | Updated on Jul 21 2026 12:46 AM

Supreme Court to direct CBSE to implement APAAR changes across India

సమ్మతి పత్రంలో ఆప్ట్–అవుట్‌ ఆప్షన్‌ ఉండాల్సిందే 

ఆ మేరకు సవరణలు చేపట్టాలి 

సీబీఎస్‌ఈకి ఆదేశాలు జారీ చేస్తామన్న సుప్రీంకోర్టు 

దేశవ్యాప్తంగా ఒడిశా హైకోర్టు తీర్పు అమలుకు నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: పాఠశాల విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ‘అపార్‌’(ఆటోమేటెడ్‌ పర్మనెంట్‌ అకడమిక్‌ అకౌంట్‌ రిజిస్ట్రీ) ఐడీల నమోదుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ పథకానికి సమ్మతిని నిరాకరించేందుకు, తప్పుకునేందుకు తల్లిదండ్రులకు అవకాశం కల్పించేలా సవరణలు చేపట్టాలంది. ఈ మేరకు సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ)కి మార్గదర్శకాలు జారీ చేస్తామంది.

 నూతన విద్యా విధానం–2020 ప్రకారం కేంద్రం ప్రారంభించిన అపార్‌ పథకం కింద విద్యార్థుల కోసం ఒక ప్రత్యేకమైన, జీవితకాల 12–అంకెల ’స్టూడెంట్‌ ఐడీ’ రూపొందిస్తారు. ఇది విద్యార్థుల అన్ని విద్యాపరమైన రికార్డులకు ఒక డిజిటల్‌ పాస్‌పోర్ట్‌లా పనిచేస్తుంది. ఇందులో మార్కుల జాబితాలు, డిగ్రీ సరి్టఫికెట్లు, ఇతర విజయాల వివరాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. 

బలవంతం, రాజ్యాంగ విరుద్ధం...  
అపార్‌ ఐడీల నమోదు స్వచ్ఛందమేనని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, ఆచరణలో దీనిని ఆధార్‌తో అనుసంధానించి విద్యార్థులను బలవంతం చేస్తున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జాయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఇందిరా జైసింగ్‌ వాదనలు వినిపిస్తూ.. బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులకు అపార్‌ ఐడీని తప్పనిసరి చేస్తున్నారని తెలిపారు. పరోక్షంగా విద్యార్థులను ఆధార్‌ కోసం బలవంత పెడుతున్నారన్నారు. కేవలం ఆధార్, అపార్‌ ఐడీలు లేవన్న కారణంతో విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం విద్యాహక్కు చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధమని వాదించారు. డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ చట్టం–2023 నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని తెలిపారు. 

కేంద్రం కూడా అభ్యంతరం తెలపలేదు. 
అపార్‌ సమ్మతి పత్రంలో ‘ఆప్ట్ –అవుట్‌’ఆప్షన్‌ స్పష్టంగా ఉండాలంటూ ఒడిశా హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ధర్మాసనం ఈ సందర్భంగా సమరి్థంచింది. ఆ తీర్పుపై కేంద్ర ప్రభుత్వం కూడా అభ్యంతరం తెలపలేదని గుర్తు చేసింది. అదే తీర్పును దేశవ్యాప్తంగా అమలు చేసేలా సీబీఎస్‌ఈకి మార్గదర్శకాలు జారీ చేస్తామని తెలిపింది. డేటా ప్రొటెక్షన్, సమ్మతి వంటి అంశాలపై అభ్యంతరాలను కూడా పరిశీలించాలని కోరుతామంది. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందంగానే ఉండాలని, సమ్మతి పత్రాల్లో తల్లిదండ్రులకు తిరస్కరించే అవకాశాన్ని తప్పనిసరిగా కల్పించాలని తేల్చిచెప్పింది. విద్యార్థుల డేటా గోప్యత, తదితర అభ్యంతరాలపై సమగ్ర పరిశీలన జరపాలని సీబీఎస్‌ఈని ఆదేశిస్తూ తదుపరి విచారణను వాయిదా వేసింది.

ప్రతి దాన్నీ అనుమానించొద్దు...
దేశంలో జరిగే ప్రతీ పరిణామాన్ని అనుమానపు దృష్టితో చూడొద్దని సుప్రీంకోర్టు హితవు పలికింది. విద్యార్థుల విద్యా ప్రణాళిక, రికార్డుల నిర్వహణ కోసం ఒకే విశిష్ట గుర్తింపు తీసుకురావడం మంచి పరిణామమేనని, దీనిని స్వాగతించాలని అభిప్రాయపడింది. దేశంలో డేటా భద్రతా చట్టం అమలులో ఉందని, ఎవరూ దానిని 
ఉల్లంఘించడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. అయితే, సేకరించిన విద్యార్థుల డేటాను ఏ ఉద్దేశం కోసం తీసుకున్నారో, ఆ విద్యా సంబంధిత అవసరాలకు మాత్రమే ఉపయోగించాలని స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement