విద్యామంత్రి ప్రధాన్ రాజీనామా డిమాండ్‌తో పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులు, ఆందోళనకారులు
హోరువానను సైతం లెక్కచేయకుండా వేలాదిగా పార్లమెంట్ దిశగా కదలిన యువత
కాక్రోచ్ కార్యకర్తలను చెదరగొట్టేందుకు లాఠీచార్జ్ చేసిన పోలీసులు
బాష్పవాయుగోళాల ప్రయోగం.. పలువురికి తీవ్ర గాయాలు
118 మంది పోలీసులకూ గాయాలు
ఆమరణ దీక్షావేదికను పూర్తిగా తొలగించిన పోలీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ ఉదంతంలో నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ‘చలో సంసద్ ర్యాలీ’రణరంగాన్ని తలపించింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజే ఉభయసభల సాక్షిగా ఎంపీలను నిలదీసి విద్యార్థుల సమస్యలకు పరిష్కారం తేల్చుకుంటామంటూ వేలాది మంది కాక్రోచ్ పార్టీ కార్యకర్తలు, పరీక్షార్థుల తల్లిదండ్రులు సోమవారం పార్లమెంట్ దిశగా మొదలెట్టిన ర్యాలీ చివరకు ఉద్రిక్తంగా ముగిసింది.
ఆదివారం అర్ధరాత్రి నాటికే జంతర్‌మంతర్‌లోని దీక్షా స్థలికి వేలాదిగా మద్దతుదారులు, విద్యార్థులు చేరుకుని సోమవారం ఉదయం పార్లమెంట్ దిశగా ర్యాలీ మొదలుపెట్టగా పోలీసులు మొదట్లోనే అడ్డుకున్నారు. పార్లమెంట్, సెంట్రల్ విస్టా, కన్నాట్ ప్లేస్, సమీప ప్రాంతాల్లో 163వ సెక్షన్‌ను విధించారు. ర్యాలీకి అనుమతిలేనందున ఐదుగురికి మించి గుమికూడవద్దని హెచ్చరించారు. వదంతలు వ్యాపించకుండా ఉండేందుకు సెంట్రల్ ఢిల్లీ పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను కొన్ని గంటలపాటు పోలీసులు నిలిపేశారు.
ఉద్యమకారులున్న చోట్ల జామర్‌లను ఏర్పాటుచేశారు. అయినాసరే పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ మరింత మంది విద్యార్థులు, కార్యకర్తలు, మద్దతుదారులు బస్సులు, ఆటోలు, బైక్‌లలో వేర్వేరు దారుల్లో పార్లమెంట్ సమీపానికి చేరుకున్నారు. స్కూల్ యూనిఫామ్‌లో పాఠశాల విద్యార్థులు మొదలు కాలేజీ స్టూడెంట్స్, తల్లిదండ్రులు, విద్యావేత్తలు, వృద్ధులు, యోగేంద్ర యాదవ్ వంటి సామాజికవేత్తలు పెద్దసంఖ్యలో పార్లమెంట్ సమీప రోడ్లమీదకొచ్చారు. జాతీయజెండాలు చేతపట్టుకుని ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు.
భారత్ మాతాకీ జై, జై భీం, వందేమాతరం, ధర్మేంద్ర ప్రధాన్ దిగిపో నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగిపోయింది. వీళ్లు ముందుకెళ్లకుండా పోలీసులు బారికేడ్లను అడ్డుగా ఉంచారు. వాటినీ ఆందోళనకారులు తొలగించారు. దీంతో వీళ్లను అదుపుచేయడం కోసం పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పలువురు తీవ్రస్థాయిలో గాయపడ్డారు. పార్లమెంట్ స్ట్రీట్, పటేల్ చౌక్, కాన్‌స్టిట్యూషన్ క్లబ్, శాస్త్రీ భవన్, రైల్ భవన్ సమీప ప్రాంతాల్లో జనాన్ని చెదరగొట్టేందుకు బాష్పవాయుగోళాలు సైతం ప్రయోగించారు.
పోలీసులు ఇష్టమొచ్చినట్లు చితకబాదుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. తోటి కార్యకర్తలను కొడుతున్నాసరే ఇంకొందరు అలాగే రోడ్డు మీద బైఠాయించి ‘కొట్టండి సార్ కొట్టండి’అని తమ తీవ్రస్థాయి నిరసన తెలపడం ఒక వీడియోలో కన్పించింది. ‘‘పోలీసులు కొందరి తల పగలగొట్టారు. కిందపడ్డ విద్యార్థులనూ వదల్లేదు’’అని 55 ఏళ్ల హెలెన్ అనే మహిళ తెలిపారు. గాయపడిన వారిని తోటి విద్యార్థులు హుటాహుటిన సమీప ఆస్పత్రుల్లో చేర్పించారు. అయితే విద్యార్థుల నుంచి సైతం పోలీసులు తీవ్రస్థాయిలో ప్రతిఘటన ఎదుర్కొన్నట్లు పోలీసువర్గాలు తెలిపాయి.
ఈ తోపులాటలో 118 మంది పోలీసులు గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి. తమపై జనం రాళ్లు రువ్వడంతోనే లాఠీచార్జ్ చేయాల్సివచ్చిందని పోలీసులు తమ చర్యను సమరి్థంచుకున్నారు. ఈ ఘటనలో 100కుపైగా ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. వెరిఫికేషన్ ప్రక్రియ తర్వాత అందర్నీ విడిచిపెట్టే ఆస్కారముందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే సమీప రామ్‌మనోహర్ లోహియా ఆస్పత్రిలో 65 మెడికో లీగల్ కేసులు నమోదయ్యాయి. ర్యాలీలో లద్దాఖ్ సామాజికవేత్త, నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్‌చుక్ భార్య గీతాంజలిని పోలీసులు జుట్టు పట్టుకుని లాగి కొట్టారని వచ్చిన వార్త అవాస్తవమని ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మ స్పష్టం చేశారు.
మా డిమాండ్లు నెరవేర్చండి
నడ్డాతో సీజేపీ ప్రతినిధుల చర్చలు
విన్నపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానన్న మంత్రి
న్యూఢిల్లీ: దాదాపు మూడు వారాలుగా దీక్షపర్వంలో మునిగిపోయిన సీజేపీ కార్యకర్తలకు తొలిసారిగా ప్రభుత్వం నుంచి పిలుపొచ్చింది. దీంతో సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోష్ రంకా, సౌరవ్ దాస్‌లు సోమవారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తమ ప్రధాన డిమాండ్లను మంత్రికి వెల్లడించారు. ‘‘ఎలాంటి షరతుల్లేకుండా ఆస్పత్రి నుంచి సోనమ్ వాంగ్‌చుక్‌ను విడుదలచేయాలి. ఆయన ఒక వీడియో సందేశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకు అనుమతించాలి.
ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ పదవి నుంచి తప్పించాలి లేదా ఆయనతో రాజీనామా చేయించాలి. నీట్–యూజీ,2026 ప్రశ్నపత్రాలు లీక్ కావడంతో తీవ్ర నిరాశతో బలవన్మరణాలకు పాల్పడిన పరీక్షార్థులకు తలో రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ప్రభుత్వం తక్షణం ప్రకటించాలి. దీక్షాస్థలిని నాశనంచేసిన పోలీసులు ఇకపై కార్యకర్తల జోలికి వెళ్లకూడదు. శాంతియుత నిరసనను పోలీసులు ఉక్కుపాదంతో అణచివేసేందుకు యత్నించకూడదు’’అని నడ్డాకు అందజేసిన లేఖలో సీజేపీ ప్రతినిధులు పేర్కొన్నారు. సీజేపీ డిమాండ్లపై ప్రభుత్వ నాయకత్వం అంతర్గతంగా చర్చించేలా చేస్తానని ప్రతినిధులకు నడ్డా హామీ ఇచ్చారు.
సానుకూల వాతావరణంలో చర్చలు జరిగాయని తర్వాత నడ్డా మీడియాతో చెప్పారు. ‘‘మా షరతులను నడ్డాకు తెలిపాం. వీటిని తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన మాకు హామీ ఇచ్చారు’’అని తర్వాత అశుతోష్ రంకా తెలిపారు. సోమవారం ఉదయం 11.50 గంటలకు సీజేపీ ప్రతినిధులతో ఫోన్‌లో మంతనాలు జరిపామని, సాయంత్రం వాళ్లు స్వయంగా వచ్చి మెమోరాండం సమర్పించారని నడ్డా చెప్పారు. ఇప్పటికే ఈ మూడు డిమాండ్లపై ప్రభుత్వ పెద్దలు అంతర్గతంగా చర్చలు జరుపుతున్నారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
దీక్ష కొనసాగిస్తా వాంగ్‌చుక్
సంసద్ ర్యాలీలో పాల్గొనేందుకు తనను డిశ్చార్జ్ చేయాలని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్‌కు సోనమ్ వాంగ్‌చుక్ ఒక లేఖ రాశారు. ఆస్పత్రిలో తన ఆరోగ్యం బాగానే ఉందని, నిరసన ర్యాలీలో పాల్గొనేందుకు పంపించాలని కోరారు. తాను నిరాహార దీక్షను విరమించాలంటే ప్రభుత్వం మూడు షరతుల్ని ఒప్పుకోవాలని చెప్పారు.
‘‘పేపర్ లీకేజీ ఉదంతాలకు తమదే బాధ్యత అని ప్రభుత్వం తన తప్పు ఒప్పుకోవాలి. లేదంటే ర్యాలీగా పార్లమెంట్‌కు వచ్చిన సీజేపీ నాయకులతో ఉభయసభల ఎంపీలు మాట్లాడి ఈ అంశాన్ని పార్లమెంట్‌లో చర్చిస్తామని వెంటనే హామీ ఇవ్వాలి. లేదంటే అధికార కూటమి ఎంపీలు ఆస్పత్రికి వచ్చి ఇదే అంశంపై నాకు స్వయంగా హామీ ఇవ్వాలి’’అని వాంగ్‌చుక్ ఒక టిష్యూపేపర్ మీద షరతులు రాసి ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. కానీ ర్యాలీలో కార్యకర్తలతో పోలీసులు అమానుషంగా ప్రవర్తించిన కారణంగా తన దీక్షను ఇకమీదటా కొనసాగించాలని ఆయన ఆ తర్వాత నిర్ణయించుకున్నారు.
దీప్కేను నిర్బంధించిన పోలీసులు!
దీక్షా స్థలి నుంచి సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కేను పోలీసులు రహస్య ప్రదేశానికి తరలించారని సీజేపీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, అశుతోష్ ఆరోపించారు. సోమవారం సాయంత్రంకల్లా దీక్షా స్థలిలోని టెంట్లు, మైకులు, కార్పెట్లు, బ్యానర్లు, జెండాలను పోలీసులు తొలగించారు. అటువైపు ఎవరూ రాకుండా జంతర్‌మంతర్ వద్ద రోడ్డుకు రెండు వైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటుచేశారు. దీంతో దాదాపు 1,000 మంది ఉద్యమకారులు కొంతదూరంలోనే నిలిచిపోయారు. సమీపంలోని కేరళ హౌస్ సమీపంలో భైఠాయించి ఇక్కడి నుంచే ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఉద్యమనేతలు స్పష్టంచేశారు. అయితే దీప్కేను అరెస్ట్‌చేశామన్న వార్తల్లో నిజంలేదని ఢిల్లీ పోలీసులు స్పష్టంచేశారు.


