ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు దగ్గర కార్గో నౌకపై దాడి జరిగింది. నలుగురు భారతీయులు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఉక్రెయిన్‌లోని ఒడెసా పోర్టు నుంచి కార్గో నౌకలో ధాన్యం తీసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిపై భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గినియా-బిస్సావు జెండాతో ప్రయాణిస్తున్న ఎంవీ గోల్డెన్ లియో నౌక జులై 19 సాయంత్రం ఒడెసా నుంచి బయలుదేరిన వెంటనే దాడికి గురైంది. ఆ నౌకలో మొత్తం 17 మంది సిబ్బంది ఉండగా, వారిలో ఐదుగురు భారతీయులు ఉన్నారు.
"ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం.. నలుగురు భారతీయులు దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయారు. మరో భారతీయుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉంది" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.
ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం అక్కడి అధికారులతో నిరంతరం సంప్రదింపులు సాగిస్తూ, బాధితులకు సాధ్యమైనంత సహాయం అందించే ప్రయత్నం చేస్తోందని భారత్ తెలిపింది. "మృతి చెందిన భారతీయుల కుటుంబాలకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. గాయపడిన భారతీయుడు త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నాం" అని మంత్రిత్వ శాఖ పేర్కొంది. నల్ల సముద్రం ప్రాంతంలో తాజాగా పెరిగిన యుద్ధ ఉద్రిక్తతల తర్వాత భారతీయ నావికులు ఎదుర్కొన్న అత్యంత ప్రాణాంతక ఘటనల్లో ఇది ఒకటి.
వాణిజ్య నౌకలపై దాడులు సరికాదు: భారత్
ఈ ఘటనపై స్పందించిన భారత్.. పౌర నౌకలపై దాడులను ఖండించింది. యుద్ధ పరిస్థితుల్లోనూ సముద్ర రాకపోకల స్వేచ్ఛకు రక్షణ ఉండాలని భారత్ మరోసారి స్పష్టం చేసింది. "వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం, అమాయక పౌర సిబ్బంది ప్రాణాలకు ముప్పు తేవడం, సముద్ర రాకపోకలు, వాణిజ్యానికి ఆటంకం కలిగించడం ఖండించదగ్గ విషయం. అలాంటి చర్యలు నివారించాలి" అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఆ ప్రకటనలో రష్యా పేరు నేరుగా ప్రస్తావించలేదు. అయితే ఈ దాడికి రష్యాదే బాధ్యతని ఉక్రెయిన్ అధికారులు ఆరోపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి చర్చలు, దౌత్య మార్గం ద్వారానే పరిష్కారం లభించాలని భారత్ పలుమార్లు పిలుపునిచ్చింది. అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలని, పౌరుల ప్రాణాలకు ముప్పు తెచ్చే దాడులు చేయవద్దని అన్ని పక్షాలను కోరింది.


