సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విపక్షాలకు కీలక విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై అర్థవంతమైన, ఫలవంతమైన చర్చలు జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
సోమవారం సంసద్ భవన్(పార్లమెంట్) ఆవరణలో మీడియా ద్వారా మాట్లాడిన ఆయన.. ‘‘గత నెల రోజులుగా దేశంలో ఎన్నో పరిణామాలు జరిగాయి. వాటిపై సభలో చర్చలు జరగాలి. ప్రజా సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ వేదిక కావాలి’’ అని అన్నారు. ఈ సందర్భంలో తాజా స్కైరూట్ విక్రమ్ ప్రయోగంపై ప్రశంసలు గుప్పించారు.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థ స్కైరూట్ సాధించిన విజయాన్ని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. అంతరిక్షంలో నవశకం మొదలైందని.. స్కైరూట్ సంస్థ విక్రమ్ రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి పంపడం దేశానికే గర్వకారణమని అన్నారు. ‘‘కేవలం 28 ఏళ్ల యువకులు ఈ ఘనత సాధించారు. ఇది భారత యువశక్తికి, కొత్త ఆలోచనలకు నిదర్శనం’’ అని మోదీ పేర్కొన్నారు.
56 ఏళ్ల యువకుడ్ని కాదు!
అయితే ఈ సందర్భంగా మోదీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. స్కైరూట్ బృందం సక్సెస్‌ను ప్రస్తావిస్తూ.. ‘‘నేను 56 ఏళ్ల యువకుడి గురించి మాట్లాడటం లేదు’’ అంటూ వ్యాఖ్యానించారాయన. రాహుల్ గాంధీ వయసు 56 ఏళ్లు కావడంతో.. మోదీ వ్యాఖ్యలు కాంగ్రెస్ నేతపై పరోక్ష సెటైర్‌గా భావిస్తున్నారు.
సభ సజావుగా సాగాలి..
పార్లమెంట్ సమావేశాలు రాజకీయ విభేదాలకు మాత్రమే పరిమితం కాకుండా.. దేశ ప్రయోజనాల కోసం ఉపయోగపడాలని ప్రధాని ఆకాంక్షించారు. ఎంపీలందరూ సహకరించి నిర్మాణాత్మక చర్చలకు అవకాశం కల్పించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో చర్చలు, వాదనలు సహజమని.. అయితే సభా సమయం వృథా కాకుండా ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
పశ్చిమాసియా యుద్ధం వల్ల ఇంధన సంక్షోభం ఏర్పడింది. అన్ని దేశాలు నష్టపోతున్నాయి అని ఆవేదన వ్యక్తం చేశారాయన. చమురు ధరలు అమాంతం పెరుగుతున్నాయి. అయినా ఆ సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాం అని అన్నారాయన. ఈ క్రమంలోనే హైడ్రోజన్‌తో నడిచే రైలును పరుగులు పెట్టించినట్లు మోదీ చెప్పారు.
ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి
వర్షాకాల సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చకు అవకాశం ఉండటంతో.. అధికార, ప్రతిపక్ష సభ్యులు సమన్వయంతో వ్యవహరించాలని ప్రధాని కోరారు.
Speaking at the start of the Monsoon Session of Parliament. May this session witness productive discussions that strengthen India's development journey. https://t.co/v25Vg62apy
— Narendra Modi (@narendramodi) July 20, 2026


