72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల ప్రకటన
9 పురస్కారాలతో తెలుగు చిత్రాల విజయ భేరి
ఉత్తమ చిత్రం (ఆర్టికల్ 370) ఏ ఉత్తమ నటులు మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ ఏ ఉత్తమ నటి యామీ గౌతమ్
ఉత్తమ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియస్వామి ఏ ఉత్తమ తెలుగు చిత్రం (కమిటీ కుర్రోళ్లు)
ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (కల్కి 2898 ఎ.డి.)
బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే సుకుమార్ (పుష్ప–2)
ఉత్తమ డైలాగ్ రైటర్ వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్) ఏ ఉత్తమ బాలల చిత్రం (35– చిన్నకథ కాదు)
దేశంలో ప్రతిష్ఠాత్మక సినీ పురస్కారాలైన 72వ జాతీయ చలనచిత్ర అవార్డులను శనివారం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఆదిత్య సుహాస్ జంభలే దర్శకత్వం వహించిన హిందీ చిత్రం ‘ఆర్టికల్ 370’ ఉత్తమ చిత్రంగా నిలిచి, స్వర్ణ కమలం సాధించింది. మలయాళ అగ్రనటుడు మమ్ముట్టి (భ్రమయుగం), బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ (చందు ఛాంపియన్) ఉత్తమ నటులుగా రజత కమలం పురస్కారాలకు ఎంపికయ్యారు.
‘ఆర్టికల్ 370’ చిత్రంలో నటనకు యామీ గౌతమ్ ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్నారు. తమిళ చిత్రం ‘అమరన్’ని తెరకెక్కించిన రాజ్‌కుమార్ పెరియస్వామిని ఉత్తమ దర్శకుడి పురస్కారం వరించింది. ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో తెలుగు సినిమా సత్తా చాటుకుంది. ‘కల్కి 2898 ఎ.డి., పుష్ప–2, లక్కీ భాస్కర్, కమిటీ కుర్రోళ్లు, 35–చిన్న కథ కాదు’ చిత్రాలు వివిధ విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టాయి. ప్రముఖ మలయాళ దర్శకుడు జయరాజ్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన ఫీచర్ ఫిల్మ్స్ జ్యూరీ సెంట్రల్ ప్యానెల్ ఈ అవార్డుల విజేతలను ఎంపిక చేసింది.
జాతీయ అవార్డుల్లో పలు తెలుగుæచిత్రాలు కీలక పురస్కారాలను అందుకున్నాయి. మొత్తం తొమ్మిది అవార్డులు దక్కాయి. పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 ఎ.డి.’ ఉత్తమ ప్రజాదరణ పొందిన (హోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్) చిత్రంగా నిలిచి, స్వర్ణ కమలాన్ని సాధించింది. ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ సింగిరెడ్డి దర్శకత్వం వహించారు. ఇదే సినిమాకు పని చేసిన నితిన్ జిహాని చౌదరిని బెస్ట్ ప్రొడక్షన్ డిజైనింగ్ అవార్డు వరించింది. అలాగే ‘పుష్ప 2–ది రూల్’ చిత్రదర్శకుడు బండ్రెడ్డి సుకుమార్ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే రచయితగా పురస్కారం పొందారు.
ఇదే చిత్రానికి దీపాలి నూర్, శీతల్ శర్మలను బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్స్ అవార్డు వరించింది. ‘లక్కీ భాస్కర్’ చిత్రానికి వెంకీ అట్లూరి ఉత్తమ డైలాగ్ రైటర్‌గా జాతీయ పురస్కారం కైవసం చేసుకున్నారు. యదు వంశీ దర్శకత్వం వహించిన ‘కమిటీ కుర్రోళ్లు’ ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపికైంది. ఈ సినిమాకు మేకప్ అందించిన పి. రవికుమార్‌కు బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అవార్డు లభించింది. అదే విధంగా నంద కిశోర్ ఈమని దర్శకత్వం వహించిన ‘35–చిన్న కథ కాదు’ ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికైంది. ఇందులో నటించిన అరుణ్ దేవ్ పోతుల ఉత్తమ బాల నటుడి అవార్డుకు ఎంపికయ్యాడు.
సంగీతం, సాంకేతిక విభాగాలు...
‘ఆర్టికల్ 370’ చిత్రానికి శాశ్వత్ సచ్‌దేవ్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, ‘అమరన్’ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పురస్కారాలు సాధించారు. మరాఠీ చిత్రం ‘ఘరత్ గణపతి’లోని పాటకు అభయ్ జోధ్‌పుర్కర్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా, మలయాళ చిత్రం ‘ఏఆర్‌ఎం’ పాటకు వైకోమ్ విజయలక్ష్మి ఉత్తమ గాయనిగా నిలిచారు. ‘మైదాన్’ (హిందీ) చిత్రంలో పాటకు మనోజ్ ముంతాషిర్‌కు బెస్ట్ లిరిక్స్ అవార్డు లభించింది. ‘స్త్రీ 2’ సినిమాకు విజయ్ గంగూలీ ఉత్తమ నృత్యదర్శకుడిగా ఎంపికయ్యారు. ‘మహారాజ’ సినిమాకు అనల్ అరసు బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ (యాక్షన్) అవార్డు సాధించారు. ‘భ్రమయుగం’ చిత్రానికి షెహనాద్ జలాల్ ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌గా, ‘అమరన్’ చిత్రానికి ఆర్. కలైవానన్ బెస్ట్ ఎడిటర్‌గా, ‘భూల్ భులయ్యా 3’ చిత్రానికి మానస్ చౌదరి బెస్ట్ సౌండ్ డిజైనర్‌గా అవార్డులు పొందారు.
ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలు
రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్ ప్రకారం ప్రకటించిన ఉత్తమ ప్రాంతీయ చిత్రాల జాబితాలో హిందీ చిత్రం ‘శ్రీకాంత్’, తెలుగు ‘కమిటీ కుర్రోళ్లు’ తమిళ ‘రాయన్’, మలయాళ ‘ఫెమినిచీ ఫాతిమా’, కన్నడ ‘మిథ్య’ చిత్రాలు అవార్డులు దక్కించుకున్నాయి. బెంగాలీ ‘చలచిత్ర ఎఖోన్’, ఒడియా ‘లహరి’, గుజరాతీ ‘మారన్’, మరాఠీ ‘ముక్కం పోస్ట్ బొంబిల్వాడి’, అస్సామీ ‘జుయ్ ఫూల్’ ఆయా భాషల్లో ఉత్తమ చిత్రాలుగా ఎంపికయ్యాయి.
నాన్–ఫీచర్ ఫిల్మ్స్, సినిమా రచనలు...
నాన్–ఫీచర్ ఫిల్మ్స్ విభాగంలో మరాఠీ, ఆంగ్ల భాషల్లో రూపొందిన ‘భంగార్’ ఉత్తమ చిత్రంగా స్వర్ణ కమలం గెలుచుకుంది. ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – ఏక్తా కా ప్రతీక్’ (హిందీ) చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ ఉత్తమ దర్శకుడిగా నిలిచారు. పర్యావరణ విలువల నాన్‌ఫీచర్ చిత్రంగా ‘పి΄్లాంట్రీ: ఏ టేల్ ఆఫ్ ఎకో ఫెమినిజం’ ఎంపికైంది. ‘ఎన్డీయే’ (హిందీ) చిత్రానికి మన్వీర్ జస్రోటియా ఉత్తమ ఎడిటర్‌గా పురస్కారం సాధించారు. రచనల విభాగంలో కన్నడ పుస్తకం ‘నానిరువు దేనిమగాగి నాదిరువుదే ననగాగి’ కెంచనూరు ప్రదీప్ కుమార్ శెట్టికి బెస్ట్ బుక్ ఆన్ సినిమా అవార్డు దక్కింది. సంజీవ్ శ్రీవాస్తవ ఉత్తమ ఫిల్మ్ క్రిటిక్‌గా ఎంపికయ్యారు. నాన్–ఫీచర్ ఫిల్మ్స్ జ్యూరీ చైర్‌పర్సన్‌గా అసీమ్ సిన్హా, బెస్ట్ రైటింగ్ ఆన్ సినిమా జ్యూరీ చైర్‌పర్సన్‌గా ఎ. చంద్రశేఖర్ వ్యవహరించారు.
ప్రధాన విభాగాల విజేతలు
ఉత్తమ సహాయ నటుడు
సంజయ్ మిశ్రా (భక్షక్ – హిందీ).
ఉత్తమ సహాయ నటి
సచన నమిదాస్ (మహారాజ – తమిళం)
రూపశ్రీ వర్కాడి (మిథ్య – కన్నడ).
ఉత్తమ తొలి చిత్రదర్శకుడు:
రణదీప్ హుడా
(స్వాతంత్య్ర వీర్ సావర్కర్ – హిందీ).
ఉత్తమ సామాజిక, పర్యావరణ విలువల చిత్రం:
‘కెప్టెన్ మిల్లర్’ (తమిళం). ఇందులో నటనకు గాను ధనుష్‌కు ప్రత్యేక ప్రశంస దక్కింది.
‘కల్కి 1’లో 30 శాతమే చూశారు!
నాగీ (నాగ్ అశ్విన్) ఈ కథ చెప్పినప్పుడే ఒక అసాధారణమైన, అద్భుతమైన సినిమా అనిపించింది. నేను చేసిన హిందీ సినిమా ‘తుంబాడ్’ లైట్ బడ్జెట్. కానీ ‘కల్కి’ భారీ బడ్జెట్. నన్ను నమ్మి, ఈ సినిమాకి తీసుకున్నారు నాగీ. ఒక దశలో ఈ కథ మొత్తం ఒక్క సినిమాలోనే సరిపోతుందా? అనిపించింది. చివరికి రెండు భాగాలుగా మారింది. కాశీ, శంబాల, కురుక్షేత్ర, కాంప్లెక్స్... ఇలా ఈ సినిమా కోసం చాలా సెట్స్ వేశాం. పేపర్ వర్క్ బాగా చేయడంతో సెట్స్ రూపొందించడం సులువైంది. ఇక సినిమాలో ప్రభాస్ వాడిన బుజ్జి (కారు)కి చాలా ఎఫర్ట్ పెట్టాం. ఈ కారుకి వాడిన టైర్లు లాంటివి నిజంగా లేవు. కొత్తగా తయారు చేశాం. ఈ కారు తయారు చేయడానికి దాదాపు 200 డిజైన్లు అనుకున్నాం.
ఎందుకంటే సినిమాలో అది కారు మాత్రమే కాదు... ‘సపోర్టింగ్ క్యారెక్టర్’. అలాగే ఈ మూవీలో వాడిన ఇతర వాహనాలు, ఆయుధాలు... ఇవన్నీ కూడా ‘ఇండియన్ లుక్’లో కనిపించడం చాలా ముఖ్యం. అందుకే చాలా కసరత్తులు చేశాం. సినిమా షూటింగ్ ఆరంభించక ముందు దాదాపు ఏడాదిన్నర వర్క్ చేశాం. ప్రతిదీ ఊహించుకుని చేయడమే కాబట్టి ప్రతి రోజూ సవాల్‌గా అనిపించేది. నాగీని ప్రత్యేకంగా ప్రశంసించాల్సిందే. అలాగే టెక్నికల్ టీమ్ హార్డ్ వర్క్ చాలా ఉంది. ఇలాంటి సినిమాలు చేసినప్పుడు ‘పర్ఫెక్షన్’ మీద మాత్రమే ధ్యాస ఉంటుంది... అవార్డుల గురించి ఆలోచించం. కానీ మనసు పెట్టి చేసే ఏ పనికైనా అవార్డులు వస్తాయి. మా ‘కల్కి’కి వచ్చిన అవార్డులు అందుకు ఓ నిదర్శనం. ‘కల్కి 2898 ఎ.డి.’లో మీరు చూసింది 30 శాతం మాత్రమే. రెండో భాగం మరిన్ని సెట్స్‌తో, మరింత లార్జ్‌స్కేల్‌తో ఉంటుంది.
– ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాన్ చౌదరి
భవిష్యత్‌లో భూమి మీదున్న వనరులన్నీ కనుమరుగైపోయి పవిత్ర కాశీ నగరం ఎడారిలా మారిపోతుంది. సుప్రీం యాస్కిన్ అనే క్రూరుడు కాంప్లెక్స్ పేరిట ఓ ఆకాశ నగరాన్ని నిర్మించుకుని, అందులో సకల సౌకర్యాలను ఏర్పాటు చేసుకుంటాడు. జనంలో ఒకడైన భైరవ ఎలాగైనా కాంప్లెక్స్‌లోకి వెళ్లాలని ఆశపడతాడు. కాంప్లెక్స్‌లో సుమతి అనే అమ్మాయికి కల్కి అవతారం బిడ్డగా పుడతాడని తెలుసుకున్న అశ్వత్థామ ఆమెను రక్షించాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో భైరవ కాంప్లెక్స్‌లోకి వెళ్లాడా లేదా? సుమతి ఎవరు? సుప్రీం యాస్కిన్ తన లక్ష్యం కోసం ఏం చేశాడన్నది ‘కల్కి 2898 ఎ.డి’ కథ. భవిష్యత్తుని ఊహించి, అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ విజువల్ వండర్‌ని తెరకెక్కించారు. అశ్వినీదత్ నిర్మించారు.
– ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం (కల్కి 2898 ఎ.డి.)
పనిమీద నిబద్ధత,నిజాయతీ ఉండాలి
మేకప్ ఆర్టిస్ట్‌గా 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నాను. నేను అందుకున్న తొలి జాతీయ అవార్డు ఇది. మాటల్లో చెప్పలేనంత హ్యాపీగా ఉంది. నిర్మాత నిహారికగారితో పాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మన్యం రమేశ్‌గారి ప్రోత్సాహంతో ఇదంతా జరిగింది. నేను అవార్డుకి ఎంపిక అయినట్లు ముందు నా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పారు. వెంటనే నిహారికగారు కూడా విషయాన్ని చెప్పి, హ్యాపీ మూమెంట్‌ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఆఫీసుకి రమ్మన్నారు. నేనెప్పుడూ అవార్డుల గురించి ఆలోచించలేదు. పింక్ ఎలిఫెంట్‌లోని తొలి సినిమా కాబట్టి జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరించాలని నాకున్న అనుభవంతో జాగ్రత్తగా పని చేశాను. ఆ పని, ఆ నిజాయతీ ఈ రోజు నాకు అవార్డు తెచ్చిపెట్టింది. నాకు అవార్డు రావడంతో మా కుటుంబ సభ్యులందరూ హ్యాపీగా ఉన్నారు. పని మీద నిబద్ధత, నిజాయతీ.. ఈ రెండూ ఉంటే ఆటోమేటిక్‌గా అవార్డులనేవి వస్తాయని నమ్ముతాను.
– ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ పి. రవికుమార్
పశ్చిమ గోదావరి జిల్లాలోని ఓ గ్రామంలో జాతరను సజావుగా చేయాలని గ్రామస్తులు కొందరు యువకులతో కమిటీ ఏర్పాటు చేస్తారు. జాతర తర్వాత వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి, గెలవాలని అదే గ్రామంలోని రెండు వర్గాలు తీర్మానిస్తాయి. అయితే రాజకీయాల కారణంగా కమిటీలోని యువకుల మధ్య కుల వివక్ష వల్ల మనస్పర్థలు వచ్చి విడిపోతారు. కొంతకాలం తర్వాత విడిపోయిన ఆ స్నేహితులు మళ్లీ ఎలా కలిశారన్న భావోద్వేగ కథాంశంతో దర్శకుడు యదు వంశీ తెరకెక్కించిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు.
– ప్రాంతీయ ఉత్తమ చిత్రం (కమిటీ కుర్రోళ్లు)
ఆర్టికల్ 370 రద్దు అమలుకు కొద్ది రోజుల ముందు కశ్మీర్ లోయలో సంఘర్షణలు, అక్కడి పరిస్థితులు, ఉగ్రవాదం తదితర అంశాలను డీల్ చేసేందుకు అసైన్ చేయబడ్డ ఫీల్డ్ ఆఫీసర్ జూనీ హక్సర్, అలాగే ఈ పరిస్థితులను పరిశీలించే పీఎంఓ సెక్రటరీ రాజేశ్వరి స్వామినాథన్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నారు? శాంతి భద్రతలను ఎలా కాపాడారన్నది ‘ఆర్టికల్ 370’ చిత్రకథ. జాతీయ ఉత్తమ చిత్రం అవార్డు సాధించిన ఈ చిత్రానికి ఆదిత్య సుహాస్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో ఎన్‌ఐఎ ఏజెంట్ జూనీ హక్సర్ పాత్రలో ఒదిగిపోయిన యామీ గౌతమ్ జాతీయ ఉత్తమ నటి అవార్డు సాధించారు.
– జాతీయ ఉత్తమ చిత్రం (ఆర్టికల్ 370)
ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది
ఈరోజు ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘లక్కీ భాస్కర్’ సినిమాకి బెస్ట్ స్క్రీన్‌ప్లే డైలాగ్ రైటర్‌గా నేను ఎంపికయ్యాను. ఇందుకు నేను నిజంగా చాలామందికి ధన్యవాదాలు చెప్పాలి. ముఖ్యంగా నాతో కలిసి పని చేసిన టీమ్‌కి. నన్ను నమ్మిన నిర్మాత నాగవంశీగారికి, హీరో దుల్కర్ సల్మాన్‌గారికి, హీరోయిన్ మీనాక్షీ చౌదరి, నటులు సాయికుమార్, రాంకీగార్లకు థ్యాంక్స్. అలాగే ఈ మూవీకి అద్భుతమైన సంగీతం ఇచ్చిన జీవీ ప్రకాశ్‌కుమార్‌కి, నాకు ఇష్టమైన ఎడిటర్ నవీన్ నూలికి ధన్యవాదాలు. టీమ్ అంతా మా సినిమా విజయానికి దోహదపడ్డారు. నేను రాసిన డైలాగ్స్‌కి కూడా ఇంత మంచి పేరు వచ్చిందంటే నటీనటుల వల్లే. వాళ్లు అద్భుతంగా చెప్పడం, నటించడం వల్లే ఈరోజు నేను ఈ అవార్డుకి ఎంపికయ్యాను.. వీళ్లందరికీ నేను కృతజ్ఞతలు చెబుతున్నాను. అలాగే ఈ అవార్డుకి నన్ను ఎంపిక చేసిన జాతీయ అవార్డు కమిటీ జ్యూరీకి కూడా థ్యాంక్స్. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది.
– ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్
వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
మన తెలుగు తేజం, ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్ ఇండస్ట్రీస్ అధినేత అయిన శ్రీకాంత్ బొల్లా జీవితంపై వచ్చిన చిత్రం ‘శ్రీకాంత్’. ఈ చిత్రంలో టైటిల్ రోల్‌ని రాజ్‌కుమార్ రావ్ పోషించారు. పుట్టుకతోనే కంటి చూపు లేకపోవడంతో శ్రీకాంత్ బాల్యంలో పడిన ఇబ్బందులు, చదువు కోసం పడ్డ అవస్థలు, ఆపై అంధత్వాన్ని జయించి, వ్యాపారవేత్తగా ఎదిగిన తీరుపై తీసిన స్ఫూర్తిదాయకమైన చిత్రం ఈ ‘శ్రీకాంత్’.
– ఉత్తమ హిందీ చిత్రం (శ్రీకాంత్)
ఆంధ్రా టు అమెరికా
ఈ ‘శ్రీకాంత్’ చిత్రానికి స్ఫూర్తిగా నిలిచిన శ్రీకాంత్ బొల్లా గురించి చెప్పాలంటే...
శ్రీకాంత్ బొల్లా సొంత ఊరు ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం. పుట్టుకతోనే అంధుడు. అయితే అతని తల్లిదండ్రులు కొడుకును పట్టుదలతో చదివించారు. ఆరేళ్ల వయసులో ప్రతి రోజూ కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ స్కూలుకు వెళ్లేవాడు శ్రీకాంత్. ఎనిమిదేళ్ల వయసులో అంధ విద్యార్థులు చదువుకునే బోర్డింగ్ స్కూలులో సీటు లభించింది. దీంతో హైదరాబాద్‌కి షిఫ్ట్ అయ్యాడు. ఇంజనీర్ కావాలన్నది తన కల. అది జరగాలంటే సైన్స్, మ్యాథ్స్ చదవాలి. కానీ, ఆ సబ్జెక్టులు తీసుకోవడానికి ఆయనకు అర్హత లేదంటూ స్కూల్ యాజమాన్యం అభ్యంతరం చెప్పింది. ఈ విషయంపై కోర్టుకెక్కి, అనుమతి సాధించారు. ఇంటర్మీడియట్ తర్వాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో శ్రీకాంత్ బొల్లా ఇంజినీరింగ్ చదవాలనుకున్నా... అంధుడైన కారణంగా అడ్మిషన్ దక్కలేదు. దీంతో అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసుకున్నారు. సీటు దక్కించుకుని, ఎంఐటీలో మేనేజ్మెంట్ సైన్స్‌లో ఆయన గ్రాడ్యుయేట్ అయ్యారు. జాబ్ వచ్చినా ఇండియాలోనే పని చేయాలనుకున్నారు. 2012లో హైదరాబాద్ చేరుకుని, ‘బొల్లాంట్ ఇండస్ట్రీస్’ స్థాపించారు. ప్యాకేజింగ్ మెటీరియల్ తయారు చేసే ఈ కంపెనీ తాటి ఆకులతో పర్యావరణ అనుకూల ఉత్పత్తులను రూపొందిస్తు్తంది. ఇందులో ఎక్కువమంది వికలాంగులే పని చేస్తున్నారు.
– ఆచార్య శరత్‌చంద్ర, సాక్షి, న్యూఢిల్లీ


