కార్గిల్ విజయ్ దివస్ ర్యాలీ...
దేశవ్యాప్తంగా కార్గిల్ విజయ్ దివస్ నిర్వహణలో భాగంగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ జెండా ఊపి ప్రారంభించగా, న్యూఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం దగ్గర మొదలైన ‘శౌర్య విజయ్ యాత్ర’ ఈ నెల 26 ముగియనుంది. క్లాసిక్ లెజెండ్స్ ఆధ్వర్యంలో రైడర్లు జావా యెజ్డీ మోటార్‌సైకిళ్లపై 13 రోజుల పాటు కొనసాగే ఈ సాహస యాత్రను ‘వన్ రైడ్, వన్ నేషన్, వన్ సెల్యూట్’ అనే నినాదంతో చేపట్టారు. ఈ 1,900 కిలోమీటర్ల యాత్రలో, విధుల్లో ఉన్న పదవీ విరమణ పొందిన రక్షణ దళాల సిబ్బందితో పాటు, ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబ సభ్యులు సహా మొత్తం 28 మంది రైడర్లు పాల్గొంటున్నారు.
వీరు లడఖ్‌లోని ద్రాస్‌లో ఉన్న కార్గిల్ యుద్ధ స్మారక చిహ్నం దగ్గర ప్రయాణం ముగిస్తారు. కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు, అచంచల సంకల్పం, పరమ త్యాగం చేసిన భారత వీర జవాన్లకు ఘన నివాళిగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ యాత్ర చండీమందిర్, రెజాంగ్ లా, లేహ్ యుద్ధ స్మారకాలను సందర్శిస్తూ ప్రయాణించి, ఈనెల 26న కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద ముగుస్తుంది.
భారత దేశం చూసిన వివిధ తరాల యుద్ధ వీరుల వారసత్వ సమ్మేళనానికి ప్రతీకగా, ఈ యాత్రలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నం నుంచి తీసుకువచ్చిన పవిత్ర మట్టిని కార్గిల్‌కు తీసుకువెళుతున్నారు. ఈ సందర్భంగా క్లాసిక్ లెజెండ్స్ సహ–వ్యవస్థాపకుడు అనుపమ్ థరేజా మాట్లాడుతూ భారత వీర సైనికుల స్ఫూర్తిదాయక గాథలు, దేశానికి వారు చేసిన సేవలను సమాజానికి స్మరణీయంగా మార్చాలనే ఉద్దేశంతో జావా యెజ్డీ మోటార్‌సైకిల్స్ ఈ యాత్రకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.


