రిటైర్డ్‌ జడ్జీల సదుపాయాల్లో ఏకరూపకత ఉండాలి  | Uniform Facilities For High Court Judges | Sakshi
Sakshi News home page

రిటైర్డ్‌ జడ్జీల సదుపాయాల్లో ఏకరూపకత ఉండాలి 

Jul 21 2026 12:53 AM | Updated on Jul 21 2026 12:55 AM

Uniform Facilities For High Court Judges

మూడు నెలల్లోగా మార్గదర్శకాలను రూపొందించాలి 

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు

సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తులకు కల్పించే సదుపాయాలన్నీ ఒకే తరహాలో ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం రెండు వారాల్లోగా ఓ ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు రిటైర్డ్‌ జడ్జీలకు కల్పిస్తున్న భద్రత, ఇతర సదుపాయాలపై దాఖలైన పిటిషన్‌ను సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ సారథ్యంలోని ధర్మాసనం విచారించింది. పదవీ విరమణ తర్వాత జడ్జీలకు అందుతున్న వసతులు రాష్ట్రానికో తీరుగా ఉండటంపై ఈ సందర్భంగా ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

కొన్ని రాష్ట్రాలు భద్రత నిమిత్తం ఇస్తున్న ఆర్థిక సాయం ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ‘రూ.45 వేల నుంచి రూ.50 వేలతో ప్రస్తుత పరిస్థితుల్లో డ్రైవర్, సెక్యూరిటీ ఆఫీసర్‌ను నియమించుకోవడం సాధ్యమేనా?‘అని సీజేఐ సూర్యకాంత్‌ ప్రశ్నించారు. వసతి, వైద్య ఖర్చులు, డ్రైవర్, వంట మనుషులు, టెలిఫోన్‌ వంటి కనీస సదుపాయాల్లో హెచ్చుతగ్గులు ఉండటానికి వీల్లేదని, ఏ రాష్ట్రంలో సేవలందించారన్న దానితో సంబంధం లేకుండా దేశమంతటా ఒకే విధానం ఉండాలని స్పష్టం చేశారు. ఒక వేళ కేంద్రం స్పందించకుంటే తామే స్వయంగా కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. 

సానుకూలంగా స్పందించిన కేంద్రం  
ధర్మాసనం సూచనపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. కమిటీని ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా హామీ ఇచ్చారు. ఇది కచ్చితంగా పరిష్కరించాల్సిన సమస్యేనని, న్యాయస్థానం వ్యక్తం చేసిన ఆందోళనను పరిగణనలోకి తీసుకుని తగిన చర్యలు చేపడతామన్నారు. ఈ అంశంపై రెండు వారాల్లోగా నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని, మూడు నెలల్లోగా సిఫార్సులతో కూడిన నివేదికను కేంద్రంతో పాటు సుప్రీంకోర్టుకు సమర్పించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement