ఇప్పటికే లోన్ ఉండి రెండో లోన్ కోసం చూస్తున్నారా? | Already Have A Loan? Know About How Banks Decide On Your Second Loan Approval, Here's What Banks Check | Sakshi
Sakshi News home page

ఇప్పటికే లోన్ ఉండి రెండో లోన్ కోసం చూస్తున్నారా?

Jul 13 2026 10:21 AM | Updated on Jul 13 2026 11:39 AM

Already Have a Loan How Banks Decide on Your Second Loan Approval

మారిన ఆర్థిక అవసరాలు, మారుతున్న జీవనశైలి కారణంగా ప్రస్తుత రోజుల్లో ఒకటి కంటే ఎక్కువ లోన్స్‌ తీసుకోవడం సాధారణం అయిపోయింది. ఇప్పటికే ఒక హోమ్ లోన్ లేదా కార్ లోన్ కోసం ప్రతినెలా ఈఎంఐ చెల్లిస్తున్న వారు అత్యవసర పరిస్థితుల్లో మరో కొత్త రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చా? ఇప్పటికే చెల్లిస్తున్న ఈఎంఐలు ఉంటే కొత్త లోన్ మంజూరు అవుతుందా? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి. అయితే, ఆర్థిక నిపుణుల విశ్లేషణల ప్రకారం, ఇప్పటికే రుణాలు ఉన్నప్పటికీ కొన్ని నిర్దిష్ట అర్హతలు, నిబంధనలను బట్టి బ్యాంకులు మరో లోన్ ఇచ్చేందుకు మొగ్గు చూపుతాయి. ఆ వివరాలు కింద చూద్దాం.

‘ఎఫ్ఓఐఆర్’ నిష్పత్తి

బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు కొత్త రుణం ఇచ్చేటప్పుడు ‘ఫిక్స్‌డ్ ఆబ్లిగేషన్ టు ఇన్‌కమ్ రేషియో’ (ఎఫ్‌ఓఐఆర్‌) లేదా డెట్-టు-ఇన్‌కమ్ రేషియోని లెక్కిస్తాయి. మీ మొత్తం నెలవారీ ఆదాయంలో ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, ఇతర స్థిర ఖర్చులు ఎంత శాతం ఉంటున్నాయో ఇది తెలియజేస్తుంది. సాధారణంగా బ్యాంకులు ఈ రేషియో 40% నుంచి 50% లోపు ఉండాలని కోరుకుంటాయి. అంటే, మీ జీతం రూ.1,00,000 అనుకుంటే, మీ ప్రస్తుత ఈఎంఐలు రూ.40,000 లోపు ఉంటే, మిగిలిన డిస్పోజబుల్ ఆదాయాన్ని (మిగిలిన జీతాన్ని) బట్టి కొత్త లోన్ పొందేందుకు మీకు అర్హత లభిస్తుంది.

సిబిల్ స్కోరు, క్రెడిట్ హిస్టరీ

ఇప్పటికే లోన్ ఉన్నప్పటికీ మీ పాత ఈఎంఐలను ప్రతి నెలా గడువు లోపు ఎలాంటి డిఫాల్ట్స్ లేకుండా క్రమశిక్షణతో చెల్లిస్తుంటే మీ సిబిల్ స్కోరు బలంగా (750 కంటే ఎక్కువ) ఉంటుంది. ఇది మీ ఆర్థిక బాధ్యతను సూచిస్తుంది. ఇలాంటి క్లీన్ రీపేమెంట్ హిస్టరీ ఉన్న కస్టమర్లకు కొత్త లోన్ ఇవ్వడానికి బ్యాంకులు పెద్దగా వెనుకాడవు.

టాప్-అప్ లోన్స్

ఒకవేళ మీరు కొత్తగా వేరే బ్యాంకులో లోన్ దరఖాస్తు చేసుకోకుండా ఇప్పటికే ఉన్న హోమ్ లోన్ లేదా పర్సనల్ లోన్‌పై టాప్-అప్ రుణం కోసం ప్రయత్నిస్తే అనుమతి సులభంగా లభిస్తుంది. దీనివల్ల డాక్యుమెంటేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి కావడమే కాకుండా వడ్డీ రేట్లు కూడా సాధారణ పర్సనల్ లోన్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది.

లోన్ కాలపరిమితిని పెంచుకోవడం

మీ నెలవారీ ఈఎంఐ భారాన్ని తగ్గించుకోవడానికి ప్రస్తుత లోన్ కాలపరిమితిని పొడిగించుకోవచ్చు. దీనివల్ల ప్రతినెలా కట్టే ఈఎంఐ మొత్తం తగ్గి మీ ఎఫ్ఓఐఆర్ మెరుగవుతుంది. ఫలితంగా కొత్త లోన్ అర్హత పెరిగే ఆస్కారం ఉంటుంది.

అత్యవసర సమయాల్లోనే..

ఒకటి కంటే ఎక్కువ రుణాలు తీసుకోవడం వల్ల ఆర్థిక వెసులుబాటు లభించినప్పటికీ మీ మొత్తం ఆదాయంలో 50 శాతం కంటే ఎక్కువ భాగం ఈఎంఐలకే పోకుండా చూసుకోవడం ముఖ్యం. ఆదాయ వనరులు స్థిరంగా ఉన్నప్పుడు, అత్యవసర సమయాల్లో మాత్రమే క్రెడిట్ పరిమితులను సద్వినియోగం చేసుకోవడం ఉత్తమమైన ఆర్థిక క్రమశిక్షణ అని గుర్తుంచుకోవాలి.

ఇదీ చదవండి: ఏఐ ఎందుకో వెనుకబడింది?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement