ఒక అసెస్సీకి ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు ఉండవచ్చు. ఎవరి దాకానో ఎందుకు మన రాంబాబు గారి సంగతే తీసుకోండి. ఉద్యోగంలో చేరిన కొత్తల్లో ఆఫీసు నిబంధనల ప్రకారం వారు నిర్దేశించిన బ్యాంకులో అకౌంటు తెరిచారు. ఇందులో కేవలం జీతం మాత్రమే క్రెడిట్ అవుతుంది. పెళ్లయ్యాక, మావగారి ప్రోద్బలంతో, కట్టుకున్న భార్యతో మరో అకౌంటు.. ఇది జాయింట్ అకౌంటు. మామగారు, బావమరుదులు ఇచ్చిన మొత్తాలను ఇందులో డిపాజిట్ చేస్తున్నారు. ఇంటి లోన్ కోసం బ్యాంకుకు వెళ్తే, వాళ్లు లోన్ ఇచ్చారు కానీ, మరో అకౌంటును ఆ బ్యాంకులో తెరవమన్నారు.
ఆ తర్వాత ఎదిగిన పిల్లలు, వారి చదువులు, విద్యా రుణం నిమిత్తం బ్యాంకులో అకౌంటు, పిల్లల అవసరాలరీత్యా పంపే నెలసరి మొత్తానికి అబ్బాయికి అనువైన బ్యాంకు అకౌంటు, విదేశీ చదువుల కోసం అప్పు.. ఫలితంగా ఒక బ్యాంకు అకౌంటులు, షేర్లలో పెట్టుబడుల కోసం మొదటి నుంచి ప్రత్యేకంగా షేర్ల క్రయవిక్రయాల కోసం ఒక అకౌంటు.. ఇంట్లో అద్దెకు ఉన్నాయన బ్యాంకరు కావడంతో మొహమాటానికి ఆ బ్యాంకులో ఓ అకౌంటు.. ఈలోపల రిటైర్మెంటుతో ఇంటి పక్కనే ఉన్న బ్యాంకులో అకౌంటు.. ఇలా ఒక రాంబాబుకే పది బ్యాంకు అకౌంట్లు ఏర్పడ్డాయి. అన్నట్లు ఫిక్స్‌డ్ డిపాజిట్ల కోసం ఓపెన్ చేసిన అకౌంటు.. ఈ జాబితాలో కలపలేదండోయ్.
ఇలా ఎన్నెన్నో బ్యాంకు అకౌంట్లు.. ప్రతి అకౌంటులో ఎంతో కొంత మొత్తం ఉండటం, దాని మీద వడ్డీ ఆయా బ్యాంకుల్లోనే జమ కావడం.. అయితే ఒకటి రెండు అకౌంట్లు మినహా మిగతా అన్నింటిలోనూ చిన్న చిన్న మొత్తాలే.
రెండు, మూడు ఖాతాలకే పరిమితం..
అవగాహన లోపమే అనుకోండి.. ఆచరణాత్మక విషయమే అనుకోండి. అశ్రద్ధ..బద్ధకం.. అవసరం లేకపోవడం.. ఇలా ఏదైనా అనుకోండి.. కానీ రెండు మూడు అకౌంట్లలో వ్యవహారాలకు మాత్రమే రాంబాబు పరిమితమైపోయాడు. మిగతా అకౌంట్లను పట్టించుకోలేదు. ఫారం 15 కొన్నింటికి ఇవ్వలేదు. ఇవ్వని వాళ్లు .. ఇచ్చిన వాళ్లు టీడీఎస్ చేశారు. కొందరితో ఎటువంటి టచ్ లేకపోవడం వల్ల ఏం జరిగిందో తెలియదు.
‘‘టీడీఎస్ ఉంటేనే ఆదాయం చెప్పు .. లేదంటే గప్‌చుప్,’’ అని ‘‘ఫారం 16ఏ ఇచ్చిన వాడే కరెక్టు వాడు,’’ అని ఇలాంటి ఎన్నెన్నో పిచ్చి సలహాలు వచ్చాయి రాంబాబుకి. అవి తప్పు. గుర్తు పెట్టుకోండి. టీడీఎస్ చేయడం, రికవర్ చేసిన మొత్తాన్ని గవర్నమెంటు ఖజానాలో జమ చేయడం ఇవన్నీ బ్యాంకు వారి డ్యూటీలు. చేయకపోతే వాటి మీద పెనాల్టీ విధిస్తారు. కానీ వడ్డీ మనదే. అది ట్యాక్సబుల్. టీడీఎస్ ఉన్నా లేకపోయినా వడ్డీని ఆదాయంగా గుర్తించాలి. మీ మొత్తం ఆదాయం ట్యాక్సబుల్ ఇన్‌కం దాటితే మీరు పన్ను చెల్లించాలి. పన్ను చెల్లించేటప్పుడు టీడీఎస్ వరకు సర్దుబాటు చేస్తారు.
ఫారం 15 జీ/హెచ్ ఇవ్వడం, సీనియర్ సిటిజన్లకు కొంత వడ్డీ ఆదాయం దాటితేనే టీడీఎస్ అమలుపరచడం, ఇవన్నీ టీడీఎస్‌కి సంబంధించిన అంశాలు. మీ ఆదాయం ‘మినహాయింపు కాదు’. ప్రతి వడ్డీని, అది ఎంత చిన్న మొత్తమైనా, ఆదాయంలో లెక్క వేసుకోవాల్సిందే. అలా అన్నీ కలిపినా ట్యాక్సబుల్ ఇన్‌కం పరిధికి లోపే ఉంటే, పన్ను కట్టక్కర్లేదు.
ఫారం 16ఎ మీద ఆధారపడొద్దు..
ఫారం 16ని యజమాని ఇస్తాడు. మిగతా అందరూ 16ఎ ఇస్తారు. 16లో జీతం ఒకటే ఉంటుంది. 16ఎలో ఇతర ఆదాయాలూ వస్తాయి. అయితే, అన్ని వడ్డీలు రాకపోవచ్చు కాబట్టి 16, 16ఎ మీద ఆధారపడొద్దు.
డిడక్షన్లు – డిస్‌క్లోజర్లు..
80 టీటీఏ, 80– టీటీబీ ప్రకారం వచ్చిన డిడక్షన్ క్లెయిమ్ చెయ్యాలంటే, ముందుగా వాటి గురించి డిస్‌క్లోజ్ చేయాలి. డిస్‌క్లోజ్ చేయకుండా డిడక్షన్ చెయ్యకూడదు. డిడక్షన్లు వస్తాయని డిస్‌క్లోజ్ మానకూడదు. అది లాజిక్. ఈ లాజిక్ మిస్సయి చాలా మంది వితండ వాదాలు చేస్తారు.
మీరేం తెలుసుకోవాలి..
‘నో టీడీఎస్’ అంటే ‘నో ట్యాక్స్’ కాదు
ఫారం 16/16 ఎ అనేది ఫూల్ ప్రూఫ్ కాదు.
డిస్‌క్లోజ్ చేసిన తర్వాత డిడక్షన్ చేయాలి
ఫారం ఏఐఎస్, 26ఏఎస్‌లలో పడకపోయినా అన్ని ఎంట్రీలు తీసుకోండి.
మీరేం చేయాలి..
ఎస్‌బీ, ఎఫ్‌డీ, ఆర్‌డీ, అన్ని రకాల బ్యాంకు అకౌంట్లు, జాయింట్ అకౌంట్లు, ఖాతాలు మూసినవి, ఇలా అన్నింటి పద్దులు వేసుకోండి. అన్నీ అప్‌డేట్ చేయండి. జ్ఞాపకం తెచ్చుకోండి. మీ రికార్డులు అప్‌డేట్ చేసుకున్న తర్వాత ఫారం 26ఏఎస్, ఏఐఎస్‌లో తప్పులుంటే సర్దుబాటు చేయొచ్చు. స్థూలంగా చెప్పాలంటే, అన్ని బ్యాంకు అకౌంట్లలోనూ వచ్చిన/ఉన్న వడ్డీలు ఆదాయమే!

- డా. కందాళ సత్యనారాయణ మూర్తి, ట్యాక్సేషన్ నిపుణులు

- కె.వి.ఎన్. లావణ్య, ట్యాక్సేషన్ నిపుణులు


