న్యూఢిల్లీ: రిటైల్ చెయిన్ డీమార్ట్ మాతృ సంస్థ ఎవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 860 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 773 కోట్లతో పోలిస్తే ఇది 11 శాతం అధికం. ఆదాయం రూ. 16,360 కోట్లతో పోలిస్తే 15 శాతం వృద్ధి చెంది రూ. 18,795 కోట్లకు చేరింది. లాభం మార్జిన్ 4.7 శాతం నుంచి 4.6 శాతానికి నెమ్మదించింది.
సమీక్షా కాలంలో కొత్తగా మూడు స్టోర్స్ ప్రారంభించడంతో మొత్తం స్టోర్స్ సంఖ్య 503కి చేరుకుందని సంస్థ ఎండీ (బ్రిక్ అండ్ మోరా్టర్ విభాగం) అన్షుల్ అసాావా తెలిపారు. మరోవైపు అంతగా ఆదాయంలేని ఏడు నగరాల్లో కార్యకలాపాలు నిలిపివేసినట్లు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం డీమార్ట్ రెడీ సీఈవో విక్రమ్ దాసు తెలిపారు. జూన్ 30 నాటికి 11 నగరాల్లో డీమార్ట్ రెడీ కార్యకలాపాలు సాగిస్తోంది.


