చాలామంది ఇన్వెస్టర్లు మిడ్, స్మాల్–క్యాప్ షేర్లలో పెట్టుబడుల ద్వారానే ఎక్కువ సంపదను సృష్టించుకోగలుగుతుంటారు. ఎందుకంటే, లార్జ్–క్యాప్‌లతో పోలిస్తే ఈ విభాగంలో పెట్టుబడి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. నిఫ్టీ 100 ఇండెక్స్ పరిధితో పోలిస్తే నిఫ్టీ మిడ్‌స్మాల్‌క్యాప్ 400 ఇండెక్స్‌లో ఎక్కువ రకాల రంగాలు అందుబాటులో ఉన్నాయి.
గత రికార్డులను చూసినా లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే వేగంగా వృద్ధి చెందాయి. 2020–25 ఆర్థిక సంవత్సరాల మధ్య లార్జ్–క్యాప్ కంపెనీల ఆదాయ వృద్ధి 74 శాతంగా ఉంటే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీల ఆదాయం దాదాపు 82 శాతం పెరిగింది. అలాగే లాభాల వృద్ధి విషయానికి వస్తే.. ఇదే కాలంలో లార్జ్–క్యాప్‌లో 211 శాతం వృద్ధి నమోదైతే, మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలు ఏకంగా 256 శాతం వృద్ధిని సాధించాయి.
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలోనూ వీటి హవా పెరిగింది. ఈ విభాగంలో ఉండే మిడ్–క్యాప్ కంపెనీల సంఖ్య 2021లో 63 ఉండగా, 2026 నాటికి 93కి చేరింది. అలాగే స్మాల్–క్యాప్ కంపెనీలు 5 నుంచి 25కి పెరిగాయి. గత 15 ఏళ్ల కాలంలో చూసుకుంటే, చాలా సందర్భాల్లో లార్జ్–క్యాప్ కంటే మిడ్, స్మాల్–క్యాప్ కంపెనీలే ఇన్వెస్టర్లకు మెరుగైన రిటర్న్స్ ఇచ్చాయి.
ప్రస్తుతం ఇన్వెస్టర్లకు మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్లలో పెట్టుబడి పెట్టడానికి ’స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్’ (IFS) మెరుగైన సాధనాలుగా నిలుస్తున్నాయి. ఇవి మ్యూచువల్ ఫండ్స్‌లాగే సెబీ నిబంధనల ప్రకారం పనిచేస్తాయి. కాకపోతే పోర్ట్‌ఫోలియో రూపకల్పనలో వీటికి పీఎంఎస్ తరహాలో ఎక్కువ స్వేచ్ఛ ఉంటుంది. ఈ ఫండ్స్ పరిధిలోని ’ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్’ వ్యూహం పెద్ద కంపెనీలను పక్కన పెట్టి, పూర్తిగా మిడ్, స్మాల్–క్యాప్ షేర్లపైనే దృష్టి పెడుతుంది. అందుకే ఇది ఇన్వెస్టర్లకు మెరుగైన సాధనంగా ఉంటుంది.
ప్రధానంగా నాలుగు సూత్రాలు..
ఇది ప్రధానంగా నాలుగు సూత్రాలపై నడుస్తుంది. కంపెనీల అకౌంటింగ్ పరిశీలన (ఫోరెన్సిక్స్), సముచిత ప్రైసింగ్, ఒకే ఇన్వెస్ట్‌మెంట్ శైలికి పరిమితం కాకపోవడం, బలమైన బిజినెస్ మోడల్స్ (కార్పొరేట్ గవర్నెన్స్) అనేవి ఈ సూత్రాలు. కేవలం వేగంగా పెరిగే కంపెనీలనే కాకుండా విశ్వసనీయమైన ప్రమాణాలు, వ్యాపారాన్ని విస్తరించే చాన్స్, స్థిరమైన సంపాదన ఉన్న కంపెనీలనే ఎంచుకుంటారు. అలాగే వాల్యూ ఇన్వెస్టింగ్ లేదా గ్రోత్ ఇన్వెస్టింగ్ అనే ఒకే రకమైన శైలికి కట్టుబడి ఉండకుండా, బిజినెస్ క్వాలిటీ, మీడియం–టర్మ్ లాభాల అవకాశాలను బట్టి పోర్ట్‌ఫోలియోను మారుస్తుంటారు.
ఇక్కడ అధిక లాభాలు సాధించడానికి ఫ్లెక్సిబిలిటీ, బలమైన నమ్మకమే కారణం. ఈ ఫండ్ ఒకే రంగానికి పరిమితం కాదు. ఇండెక్స్ రూల్స్ తో సంబంధం లేకుండా, ఎక్కడ మంచి అవకాశాలు ఉంటే అక్కడికి నిధులను మళ్లిస్తుంది. ఈ వ్యూహం ద్వారా దాదాపు 35 నుంచి 45 షేర్లతో కూడిన నిర్దిష్ట పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తారు. వీటిలో ప్రతి షేరును క్షుణ్ణంగా స్టడీ చేసిన తర్వాతే ఎంపిక చేస్తారు.
డబ్బులు ఇన్వెస్ట్ చేసే ముందే సదరు కంపెనీల అకౌంటింగ్ నాణ్యత, కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాలు, మేనేజ్‌మెంట్ ట్రాక్ రికార్డ్‌ను పూర్తిగా స్క్రీన్ చేయడం ఇక్కడ మరో కీలకమైన అంశం. ఇన్ఫర్మేషన్ గ్యాప్స్, బిజినెస్ రిసు్కలు ఎక్కువగా ఉండే మిడ్, స్మాల్–క్యాప్ సెగ్మెంట్‌లో ఈ ముందస్తు పరిశీలన చాలా ముఖ్యం. ఇది కేవలం వ్యాల్యుయేషన్‌పరంగానే కాకుండా, అదనపు రక్షణ పొరలా పనిచేస్తూ రిస్క్ మేనేజ్‌మెంట్‌ను మెరుగుపరుస్తుంది.
ఈ వ్యూహంలో భాగంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా 101 నుంచి 750 ర్యాంకుల మధ్య ఉన్న కంపెనీలకే 65 శాతానికి పైగా నిధులను కేటాయిస్తారు. దీనివల్ల ఫోకస్ అంతా మిడ్, స్మాల్–క్యాప్ పరిధిలోనే ఉంటుంది. మార్కెట్ పరిస్థితులను బట్టి మిడ్–క్యాప్, స్మాల్–క్యాప్‌ల మధ్య సమతుల్యత ఉండేలా ఎప్పటికప్పుడు పెట్టుబడుల విషయంలో మార్పులు, చేర్పులు చేస్తుంటారు.
నిర్దిష్టంగా చెప్పాలంటే .. ప్రస్తుత మార్కెట్ వాతావరణం ఎస్‌ఐఎఫ్ పెట్టుబడులకు రెండు విధాలుగా సానుకూలంగా ఉంటోంది. ఒకటి వ్యాల్యుయేషన్లు అందుబాటులోకి రావడం కాగా రెండోది వైవిధ్యమైన పెట్టుబడి అవకాశాలు ఉండడం. క్రమశిక్షణ, ఫ్లెక్సిబిలిటీ, స్పష్టమైన వ్యూహంతో ఈ మార్కెట్ హెచ్చుతగ్గులను ఎదుర్కొనే ఫండ్స్ మాత్రమే లాంగ్–టర్మ్‌లో ఇన్వెస్టర్లకు స్థిరమైన, అల్ఫా లాభాలను అందించగలవు.
ఇదే సరైన సమయం ఎందుకు అంటే
మిడ్, స్మాల్–క్యాప్ (ఎస్‌ఎంఐడీ) షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇదే సరైన సమయం అనడానికి ఒక స్పష్టమైన కారణం ఉంది. మార్కెట్లో వచ్చే కరెక్షన్లనేవి అంచనాలను, వ్యాల్యుయేషన్లను మళ్లీ దారికి తెస్తాయి. ఇటీవల మార్కెట్ కరెక్షన్ల వల్ల దాదాపు 75 శాతం మిడ్–క్యాప్ షేర్లు, అలాగే 82 శాతం స్మాల్–క్యాప్ షేర్లు వాటి 52 వారాల గరిష్టాల నుంచి 20 శాతానికి పైగా పతనమయ్యాయి. ఇలా మార్కెట్ పడటం అనేది కేవలం తాత్కాలిక ఒడిదొడుకు మాత్రమే కాదు, మార్కెట్ జోరులో ఓవర్ ప్రైస్ అయిన షేర్ల విలువను ఇది తగ్గిస్తుంది. స్వల్పకాలిక సెంటిమెంట్‌ను పక్కన పెట్టి ఆలోచించే ఇన్వెస్టర్లకు మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ఇది మంచి చాన్స్.
వ్యాల్యుయేషన్లు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. సెపె్టంబర్ 2024లో ఎస్‌ఎంఐడీ వ్యాల్యుయేషన్లు దాదాపు 39 రెట్లు పెరిగి పీక్ స్టేజ్‌కి చేరాయి. ఆ తర్వాత వచి్చన కరెక్షన్ల వల్ల ఇప్పుడు 25–30 రెట్ల మధ్యకు దిగివచ్చాయి. ఇదే గత ఐదేళ్ల యావరేజ్ కంటే తక్కువ స్థాయి. అంటే, వేగంగా ఎదుగుతున్న వ్యాపారాలలో భాగస్వామ్యం అయ్యే అవకాశాన్ని మార్కెట్ ఇప్పుడు చారిత్రక సగటు ధరలకే అందిస్తోంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. ఎందుకంటే ఈక్విటీల్లో రిటర్న్స్ అనేవి కంపెనీ సంపాదనతో పాటు, మనం ఎంత వ్యాల్యుయేషన్ వద్ద ఇన్వెస్ట్ చేశామనే దానిపై కూడా ఆధారపడి ఉంటాయి.
మార్కెట్ పెరిగినా, తగ్గినా లాభపడేలా (లాంగ్, షార్ట్ పొజిషన్ల కలయిక ద్వారా) మిడ్, స్మాల్–క్యాప్ అవకాశాలను అందిపుచ్చుకునే వ్యూహాలు ఇప్పుడు కీలకంగా మారుతాయి. అలాంటి వాటిలో ’అల్టీవా ఈక్విటీ ఎక్స్–టాప్ 100 లాంగ్–షార్ట్ ఫండ్’ ఒకటి. ఈ వ్యూహం ప్రకారం సాధారణంగా 65 శాతం నుంచి 100 శాతం పెట్టుబడులను మిడ్, స్మాల్–క్యాప్ రంగంలోనే ఇన్వెస్ట్ చేస్తారు. అవసరాన్ని బట్టి డెరివేటివ్స్, షార్ట్ పొజిషన్ల ద్వారా రిస్క్ ను తగ్గిస్తూ, రిటర్న్స్ పెంచుకునే వీలుంటుంది.
త్రిదీప్ భట్టాచార్య, ప్రెసిడెంట్–సీఐఓ (ఈక్విటీస్) ఎడెల్వీస్ అసెట్ మేనేజ్‌మెంట్


