అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ చెలరేగిన యుద్ధం వల్ల ప్రపంచ ఉద్రిక్తతలు మరోసారి తారస్థాయికి చేరుకున్నాయి. హార్మూజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ దేశాలన్నింటి ముందూ చమురు, సహజ వాయువు సంక్షోభం నెలకొనే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
మరోవైపు భారత్ విషయానికి వస్తే, పశ్చిమాసియా దేశాల్లో ఉద్రిక్తతల నడుమ చమురు దిగుమతులను వేర్వే దేశాల నుంచి చేసుకోవాలనే లక్ష్యంతో "ప్లాన్-బీ" కింద తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారీ ప్రయోజనాన్ని ఇస్తోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా భారత్ రష్యా నుంచి చమురు కొనుగోళ్లు కొనసాగిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం, జూన్ నెలలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు రికార్డు స్థాయికి చేరింది. ఇది మే నెలతో పోలిస్తే 34% పెరిగింది. దీంతో అమెరికాకు షాక్ తగిలినట్లయింది.
సీఆర్ఈఏ నివేదికలో కీలక వివరాలు
సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (సీఆర్ఈఏ) నివేదికలో వెల్లడైన వివరాల ప్రకారం.. రష్యా మొత్తం చమురు ఎగుమతుల ఆదాయం తగ్గినా కూడా, భారత్ రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు జూన్‌లో రికార్డు స్థాయికి చేరాయి. ఇది మే నెలతో పోలిస్తే 34% ఎక్కువ.
గణాంకాల ప్రకారం, జూన్‌లో భారత్ 4.5 బిలియన్ యూరోల విలువైన రష్యా ముడి చమురును కొనుగోలు చేసింది. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న మొత్తం 5.5 బిలియన్ యూరోల శిలాజ ఇంధన దిగుమతుల్లో ఇది 83% వాటా.
ఈ గణాంకాలతో రష్యా శిలాజ ఇంధనాన్ని అత్యధికంగా కొనుగోలు చేస్తున్న దేశాల్లో చైనా తర్వాత భారత్ రెండో స్థానంలో నిలిచింది. జూన్‌లో చైనా 7.3 బిలియన్ యూరోల విలువైన కొనుగోళ్లతో తొలి స్థానంలో నిలిచింది.
రిఫైనరీలకు పెరిగిన సరఫరా
భారత్ మొత్తం ముడి చమురు దిగుమతులు నెలవారీగా 5.4% పెరిగాయి. ప్రధాన రిఫైనరీలకు రష్యా సరఫరా పెరగడమే దీనికి ప్రధాన కారణం. రిలయన్స్ ఇండస్ట్రీస్ జామ్‌నగర్ రిఫైనరీకి జూన్‌లో రష్యా నుంచి సరఫరా మేతో పోలిస్తే 150% పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పారాదీప్ రిఫైనరీకి దిగుమతులు 126% పెరిగాయి. సీఆర్ఈఏ తెలిపిన వివరాల ప్రకారం, బీపీసీఎల్ కొచ్చి రిఫైనరీకి సరఫరా 82% పెరిగింది. నయారా ఎనర్జీ వడినార్ రిఫైనరీకి సరఫరా 45% పెరిగింది.
ఆ తర్వాత ఎగుమతులు..
రష్యా ముడి చమురుతో తయారైన ఇంధన ఉత్పత్తుల ప్రపంచ వాణిజ్యంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. రష్యా నుంచి ముడి చమురును దిగుమతి చేసుకున్న భారత్, టర్కీ, బ్రూనై, జార్జియా దేశాల రిఫైనరీలు జూన్‌లో రష్యాపై ఆంక్షలు విధించిన దేశాలకే పెద్ద ఎత్తున చమురు ఉత్పత్తులను ఎగుమతి చేశాయి.
యూరోపియన్ యూనియన్, ఆస్ట్రేలియా, అమెరికాకు 814 మిలియన్ యూరోల విలువైన చమురు ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. అమెరికాకు జరిగిన ఎగుమతుల్లో భారత్ జామ్‌నగర్ రిఫైనరీ, టర్కీలోని సోకార్ యాజమాన్యంలోని స్టార్ రిఫైనరీ, టుప్రాస్ ఇజ్మిట్ రిఫైనరీ ముందంజలో ఉన్నాయి.
సీఆర్ఈఏ గణాంకాల ప్రకారం, గత 3 నెలల్లో టుప్రాస్ ఇజ్మిట్ రిఫైనరీ వాడిన ముడి చమురులో 60% రష్యా నుంచే వచ్చింది. జామ్‌నగర్ రిఫైనరీ వాడిన ముడి చమురులో 27% రష్యా నుంచే వచ్చింది. ఈ ముడి చమురుతో తయారైన ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేశారు.


