అరెస్టైన ప్రధాని, సీఎంను తొలగించే బిల్లు.. భారీ ట్విస్ట్ | Questions raised on clause removing PM CM bill | Sakshi
Sakshi News home page

అరెస్టైన ప్రధాని, సీఎంను తొలగించే బిల్లు.. భారీ ట్విస్ట్

Jul 12 2026 8:31 PM | Updated on Jul 12 2026 8:48 PM

 Questions raised on clause removing PM CM bill

న్యూఢిల్లీ: రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు-2025కు వచ్చిన సూచనలను స్వీకరించే ప్రక్రియను పార్లమెంటరీ కమిటీ ప్రారంభించింది. కమిటీ ముసాయిదా నివేదిక ప్రకారం.. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వరుసగా 30 రోజుల పాటు కస్టడీలో ఉంటే వారిని పదవి నుంచి తొలగించే నిబంధన రాజ్యాంగానికి అనుగుణంగా లేదని చాలా మంది పేర్కొన్నారు. ఎందుకంటే కోర్టు దోషిగా తేల్చిన తీర్పుతో ఈ నిబంధనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.

ముసాయిదా నివేదికలో మరో సూచన కూడా ఉంది. బిల్లులో "సన్‌సెట్" లేదా "ఆటోమేటిక్ రివర్సల్" నిబంధన చేర్చాలని సూచించారు. దీని ప్రకారం.. ఒక వ్యక్తి నిర్దోషిగా విడుదలైతే లేదా నిర్ణయించిన గడువులోగా అభియోగ పక్షం కేసును ముందుకు తీసుకెళ్లలేకపోతే, పదవి చేపట్టడంపై ఉన్న నిషేధం ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది.

నిరూపించని ఆరోపణల ఆధారంగా పదవి నుంచి తొలగించడం శాశ్వత అనర్హతగా మారకుండా ఇది నిరోధిస్తుందని తెలిపారు. కమిటీలో ఎక్కువ మంది సభ్యుల మద్దతుతో ముసాయిదా నివేదికలో మార్పులు చేసే అవకాశం ఉంది. ఆమోదం పొందిన తర్వాత దీన్ని లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వం దీనిని చట్టంగా మార్చే అవకాశం పెరుగుతుంది.

ప్రతిపాదనలో పెద్ద మార్పులు లేవు 
ఈ 30 రోజుల అరెస్టు నిబంధనపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమైనా, ముసాయిదా నివేదికలో ప్రతిపాదనకు పెద్దగా మార్పులు చేయలేదు. అయితే అపకీర్తి లేదా దోషిగా భావించే పరిస్థితి రాకుండా ఉండేందుకు "తొలగింపు" అనే పదం బదులు "సస్పెన్షన్" అనే పదాన్ని వాడారు.

"సస్పెన్షన్" పదంపై అభ్యంతరం 
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన సమాధానంలో "సస్పెన్షన్" అనే పదంపై అభ్యంతరం తెలిపింది. ఆ పదం తాత్కాలిక పరిస్థితిని సూచిస్తుందని, ఆ సమయంలో వ్యక్తికి పదవిపై చట్టబద్ధ హక్కు, హోదా, స్థాయి కొనసాగినా, విధులు నిర్వహించకుండా మాత్రమే ఆపుతుందని పేర్కొంది. ముసాయిదా నివేదిక ప్రకారం 30 రోజుల కస్టడీ నిబంధనకు బదులుగా అభియోగాలు నమోదు చేసే దశనే ప్రమాణంగా తీసుకోవాలని అత్యధిక సూచనలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement