న్యూఢిల్లీ: ప్రస్తుతం దేశంలో పలు అంశాలపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా-ఇరాన్ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడంతో దీని ప్రభావం ఇంధన రవాణాపై మరోసారి పడే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. జూలై 19న ఈ సమావేశం జరగనుంది. ఇందులో ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉందన్న ఉత్కంఠ నెలకొంది. దేశంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకోనుందా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 20 నుంచి ప్రారంభం కానున్నాయి. వాటికి ఒక రోజు ముందు (జులై 19న) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోంది. వర్షాకాల సమావేశాల్లో ప్రాధాన్యం ఉన్న అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న బిల్లుల గురించి కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలకు వివరాలు తెలియజేయనుందని చెబుతున్నారు.
జులై 19 ఉదయం 11 గంటలకు అఖిలపక్ష సమావేశం జరగనుంది. వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందువల్ల వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎజెండాపై చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, వారి ప్రతినిధులకు ఆహ్వానం పంపుతోంది. ఈ సమావేశంలో ప్రతిపక్షాలు తమ ప్రశ్నలను కూడా ప్రభుత్వం ముందుంచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉంటే, ఈ వర్షాకాల సమావేశాల్లో దేశీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. చట్టం-శాంతిభద్రతల నుంచి సరిహద్దు భద్రత వరకు పలు అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం అంశంతో పాటు రామ మందిరంలో విరాళాల చోరీ అంశాన్ని కూడా ప్రతిపక్షాలు ప్రస్తావించే అవకాశం ఉంది.


