సాక్షి, చెన్నై: తమిళనాడులో విజయ్ అధికారం చేపట్టిన నాటి నుంచి అక్కడి ప్రతిపక్ష పార్టీలకు కంటిమీద కులుకు లేకుండా పోతుంది. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఎక్కడ టీవీకే తీర్థం పుచ్చుకుంటారా అని అక్కడి పార్టీలు హైరానా పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ మరో భారీ స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. అక్కడ ఒక పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు టీవీకేలో చేరేలా పావులు కదుపుతున్నట్లు జాతీయ మీడియా కథనాలు వార్తలు ప్రచురిస్తున్నాయి.
తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో టీవీకే సృష్టించిన ప్రభంజనం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన టీవీకే ఏకంగా 107 సీట్లు సాధించి రాష్ట్రంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ రిజల్ట్ చూసిన రాజకీయా విశ్లేషకులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. అయితే అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ఆ తర్వాత అధికారం కోసం జరిగిన హైడ్రామా సైతం సినిమా ఎపిసోడ్‌ను తలపించింది. అక్కడి కాంగ్రెస్‌తో పాటు ఇతర చిన్న చిన్న పార్టీల సహాకారంతో జోసెఫ్ విజయ్ ప్రమాణ స్వీకారం చేయడంతో సీఎం హైడ్రామాకు ఫులిస్టాప్ పడింది.
అయితే సీఎం కావడంలో ఎదుర్కొన్నఇబ్బందుల్ని సీఎం విజయ్ ఇంకా మర్చిపోనున్నట్లు తెలుస్తోంది. అందుకే టీవీకే స్వంతంగా మెజార్టీ మార్కు దాటేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఏఐడీఎంకేకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ఆ పార్టీకి రాజీనామా చేసి టీవీకేలో చేరేలా టీవీకే సన్నాహాలు చేస్తోందని ప్రచారం జరుగుతుంది. అంతేకాకుండా ఆగస్టు 15లోపు వీరు పార్టీలో చేరతారని అనంతరం టీవీకే తరపున ఉపఎన్నికల్లో పోటీ చేస్తారని కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నిటికీ "ఆపరేషన్ ఎల్" అని పేరు పెట్టినట్లు తెలుస్తోంది.
కాగా ఇదివరకే నలుగురు ఏఐడీఎంకే ఎమ్మెల్యేలు టీవీకేలో అధికారికంగా చేరారు. దానితో పాటు మే 13న జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో టీవీకేకు మద్ధతుగా ఏఐడీఎకే రెబల్ గ్రూప్‌కు చెందిన 25 మంది ఎమ్మెల్యేలు మద్దతుగా ఓటు వేశారు. ఈ నేపథ్యంలో మరో పదిమందిని పార్టీలో చేర్చుకొని ఉపఎన్నికలకు వెళ్లేలా విజయ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇదే జరిగితే తమిళనాట మరోసారి పొలిటికల్ హీట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


