ఈ బ్యాంకుల లాభాలు తగ్గాయ్‌.. | Kotak Mahindra and IDFC First Bank Q1 Profit down | Sakshi
Sakshi News home page

ఈ బ్యాంకుల లాభాలు తగ్గాయ్‌..

Jul 27 2025 10:00 AM | Updated on Jul 27 2025 10:54 AM

Kotak Mahindra and IDFC First Bank Q1 Profit down

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ నికర లాభం స్టాండెలోన్‌ ప్రాతిపదికన లాభం రూ. 3,282 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నమోదైన రూ. 3,520 కోట్లతో పోలిస్తే 7 శాతం క్షీణించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేట్లను తగ్గించడం, ఫీజు ఆదాయాల వృద్ధి నెమ్మదించడం, ప్రొవిజనింగ్‌ పెరగడం వంటి అంశాలు ఇందుకు కారణం.

వార్షికంగా చూస్తే మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ 109 శాతం ఎగిసి రూ. 1,208 కోట్లకు చేరింది. ఇక నికర వడ్డీ ఆదాయం 6 శాతం పెరిగి రూ. 7,259 కోట్లకు చేరగా, నికర వడ్డీ మార్జిన్‌ (నిమ్‌) 4.65 శాతంగా నమోదైంది. మరోవైపు, కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన బ్యాంక్‌ లాభం స్వల్పంగా 1 శాతం వృద్ధితో రూ. 4,472 కోట్లకు చేరింది. జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగం విక్రయానికి సంబంధించి రూ. 3,000 కోట్లు కూడా జత కావడంతో గత క్యూ1లో లాభం రూ. 7,448 కోట్లుగా నమోదైంది. తాజాగా నిర్వహణలోని మొత్తం ఆస్తుల పరిమాణం (ఏయూఎం) 18 శాతం పెరిగి రూ. 6,36,311 కోట్ల నుంచి రూ. 7,50,143 కోట్లకు పెరిగింది. స్థూల ఆర్థిక పరిస్థితులు ప్రతికూలంగా ఉండటంతో రిటైల్‌ కమర్షియల్‌ వాహన రుణాల పోర్ట్‌ఫోలియోలో ఒత్తిడి నెలకొన్నట్లు బ్యాంకు తెలిపింది.  

స్వల్పంగా పెరిగిన మొండిబాకీలు .. 
సమీక్షాకాలంలో అసెట్‌ క్వాలిటీ స్వల్పంగా క్షీణించింది. స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం (జీఎన్‌పీఏ) 1.39 శాతం నుంచి 1.48 శాతానికి పెరిగింది. నికర ఎన్‌పీఏలు స్థిరంగా 0.34 శాతంగా నమోదయ్యాయి. అటు కరెంట్‌ అకౌంట్‌ సేవింగ్స్‌ అకౌంట్‌ (కాసా) నిష్పత్తి 43.4 శాతం నుంచి 40.9 శాతానికి తగ్గింది. సగటున మొత్తం డిపాజిట్లు 13 శాతం వృద్ధితో రూ. 4,35,603 కోట్ల నుంచి రూ. 4,91,998 కోట్లకు, రుణాలు 14 శాతం పెరిగి రూ. 4,44,823 కోట్లకు చేరాయి. కరెంట్‌ డిపాజిట్లు 9 శాతం పెరిగి రూ. 62,200 కోట్ల నుంచి రూ. 67,809 కోట్లకు, సేవింగ్స్‌ డిపాజిట్లు 2 శాతం వృద్ధితో రూ. 1,22,105 కోట్ల నుంచి రూ. 1,24,186 కోట్లకు, టర్మ్‌ డిపాజిట్లు రూ. 2,1,298 కోట్ల నుంచి 19 శాతం వృద్ధితో రూ. 3,00,003 కోట్లకు చేరాయి. స్లిప్పేజీలు రూ. 1,318 కోట్ల నుంచి రూ. 1,812 కోట్లకు పెరిగాయి.

ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ లాభం 32% డౌన్‌ 
ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) రూ. 463 కోట్ల నికర లాభం ప్రకటించింది. గత క్యూ1లో నమోదైన రూ. 681 కోట్లతో పోలిస్తే ఏకంగా 32.07 శాతం క్షీణించింది. సమీక్షాకాలంలో అసెట్‌ క్వాలిటీ సైతం నెమ్మదించింది. స్థూల నిరర్థక ఆస్తుల (జీఎన్‌పీఏ) పరిమాణం 1.87 శాతం నుంచి 1.97 శాతానికి పెరిగింది. రూ. 4,433.5 కోట్ల నుంచి రూ. 4,867.5 కోట్లకు చేరింది. అలాగే నికర ఎన్‌పీఏలు శాతాలవారీగా 0.53 శాతం నుంచి 0.53 శాతానికి, రూ. 1,230 కోట్ల నుంచి రూ. 1,346 కోట్లకు పెరిగాయి.  

వడ్డీ ఆదాయం 5 శాతం అప్‌.. 
సమీక్షాకాలంలో నికర వడ్డీ ఆదాయం రూ. 4,695 కోట్ల నుంచి రూ. 4,933 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ మార్జిన్‌ త్రైమాసికాలవారీగా 24 బేసిస్‌ పాయింట్లు క్షీణించి 5.71 శాతం నుంచి 5.95 శాతానికి తగ్గింది. రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీ రేట్ల కోత ప్రభావం ఇందుకు కారణమని బ్యాంకు తెలిపింది. క్యూ1లో కస్టమర్ల డిపాజిట్లు 25.5 శాతం పెరిగినట్లు బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి. వైద్యనాథన్‌ తెలిపారు. అసెట్‌ క్వాలిటీ విషయానికొస్తే సూక్ష్మరుణాల విభాగం మినహా అన్ని వ్యాపారాలు మెరుగ్గా రాణించినట్లు వివరించారు. అర్హులైన రుణగ్రహీతలకు, రెపో రేట్ల తగ్గింపు ప్రయోజనాలను బదలాయించడం వల్ల మార్జిన్లు తగ్గినట్లు వైద్యనాథన్‌ చెప్పారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం నుంచి మార్జిన్లు మెరుగుపడొచ్చని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement