న్యూఢిల్లీ: గ్లోబల్ సెల్లింగ్ ప్రోగ్రాం ద్వారా 2015 నుంచి 2025 మధ్య కాలంలో మొత్తం 20 బిలియన్ డాలర్ల ఈ-కామర్స్ ఎగుమతులకు తోడ్పడినట్లు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. 2030 నాటికి 80 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకునే దిశగా ముందుకు సాగుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.
టారిఫ్‌లు, వాణిజ్య ప్రతికూలతలపై స్పందిస్తూ.. తమ నియంత్రణలో ఉన్న అంశాలపై మాత్రమే దృష్టి పెడుతున్నామని అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ఇండియా హెడ్ శ్రీనిధి కలవపూడి తెలిపారు. గత దశాబ్దకాలంలో భారతీయ ఎగుమతిదారులు 75 కోట్ల పైగా మేడిన్ ఇండియా ఉత్పత్తులను అమెజాన్ ప్లాట్‌ఫాం ద్వారా అంతర్జాతీయ కొనుగోలుదార్లకు విక్రయించినట్లు వివరించారు.
ఏడాది వ్యవధిలో ఎంట్రప్రెన్యూర్లు, చిన్న వ్యాపారాలు చేసే ఎగుమతిదారుల సంఖ్య 33 శాతం పెరిగి 2 లక్షలకు చేరిందని అమెజాన్ వివరించింది. ఢిల్లీ, రాజస్తాన్, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర, హర్యానాల్లో అత్యధిక సంఖ్యలో ఎగుమతిదార్లు ఉన్నట్లు పేర్కొంది. 2025 నాటికి భారత్ నుంచి 10 బిలియన్ డాలర్ల ఎగుమతులను అమెజాన్ లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత దాన్ని 20 బిలియన్ డాలర్లకు పెంచింది. ఆ టార్గెట్‌ని కూడా గడువుకన్నా ముందుగానే సాధించినట్లు సంస్థ తెలిపింది.
మరిన్ని విశేషాలు..
- పదేళ్ల వ్యవధిలో విభాగాలవారీగా వార్షిక వృద్ధి చూస్తే హెల్త్, పర్సనల్ కేర్ ఉత్పత్తులు (45 శాతం) అగ్రస్థానంలో ఉన్నాయి. బ్యూటీ (45 శాతం), ఆటబొమ్మలు (44 శాతం), దుస్తులు (37 శాతం), ఫర్నిచర్ (36 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
- దేశీయంగా 28 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 200 పైచిలుకు నగరాల నుంచి అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్ ప్లాట్‌ఫాంలో విక్రేతలు ఉన్నారు. చిన్న పట్టణాలు, నగరాల నుంచి ఈ సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
- అమెరికా, బ్రిటన్, యూఏఈ, సౌదీ అరేబియా, కెనడా, మెక్సికో, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ తదితర 18 గ్లోబల్ మార్కెట్‌ప్లేస్‌లో కోట్ల మంది కస్టమర్లకు విక్రయించడం ద్వారా అంతర్జాతీయ బ్రాండ్‌లుగా ఎదగడంలో ఎగుమతిదార్లకు అమెజాన్ సహాయపడుతోంది.


