చిన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలతోపాటు కోట్ల రూపాయల వ్యాపారం సాగిస్తున్న ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల్లోనూ లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కంపెనీలో ఎన్ని ఏళ్లు పని చేశారని కాకుండా, చాలా కోణాల్లో ఆలోచించి సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపించేస్తున్నాయి. ఇటీవల మైక్రోసాఫ్ట్‌లో ఇరవై సంవత్సరాలకు పైగా పని చేసిన జోఫ్రెండ్(62) అనే ఉద్యోగి సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. తాను మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగాలనే ఉద్దేశంతో 65 ఏళ్ల వరకు కెరియర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నట్లు అందులో చెప్పారు. అయితే మే 2025లో కంపెనీ తీసుకున్న నిర్ణయం వల్ల తాను తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెప్పారు.
జోఫ్రెండ్ చేసిన పోస్ట్ ప్రకారం.. ‘మైక్రోసాఫ్ట్ కంపెనీలో 20 ఏళ్లకుపైగా పని చేశాను. మే 2025లో కంపెనీ లేఆఫ్స్ ప్రకటిస్తున్నట్లు చెప్పింది. నాకు పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. అయితే అందులో నా పేరు ఉన్నందుకు చాలా ఆందోళన చెందాను. కంపెనీలోని ఓ విభాగంలో తొమ్మిది మందితో కూడిన బృందాన్ని పర్యవేక్షించేవాడిని. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా విధులు నిర్వర్తించాను. నాతోపాటు 14 మంది సహోద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించారు. నేను ఉద్యోగంలో చేరిన కొద్ది రోజుల్లోనే మైక్రోసాఫ్ట్ సంస్థలో కొనసాగాలనే ఉద్దేశంతో 65 ఏళ్ల వరకు కెరియర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాను. కానీ కంపెనీ లేఆఫ్స్ ప్రకటన చాలా ఆందోళనకు గురిచేసింది’ అన్నారు.
‘ఉద్యోగ మార్కెట్‌లోకి వెంటనే తిరిగి వెళ్లే బదులు ఈ మార్పును జీవితంలో కొత్త అధ్యాయానికి నాందిగా చూస్తున్నాను. నేను ఇటీవల ఓ ఆర్థిక సలహాదారుడిని కలిశాను. ఈ వ్యవహారాన్ని ‘సెమీ-రిటైర్డ్’ అని భావించాలని సూచించారు. ప్రస్తుతం యువ వ్యవస్థాపకులకు మార్గనిర్దేశం చేయడంలో, వ్యాపారాన్ని నిర్మించడంలో అధిక సమయం గడుపుతున్నాను’ అని చెప్పారు.
ఇదీ చదవండి: ఎలాన్ మస్క్ టెస్లాకు బై..బై?


