
న్యూఢిల్లీ: డీమార్ట్ పేరుతో సూపర్ మార్కెట్లు నిర్వహించే అవెన్యూ సూపర్‌మార్ట్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఈ క్యూ2లో కన్సాలిడేషన్ ప్రాతిపదికన రూ.684.85 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గతేడాది రెండో త్రైమాసికంలో నమోదు చేసిన రూ.659.44 కోట్లతో పోలిస్తే ఇది 4% అధికం.
ఇదే క్యూ2లో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 15% పెరిగి రూ.14,444.50 కోట్ల నుంచి 16,218.79 కోట్లకు చేరింది. మొత్తం వ్యయాలు 16% వృద్ధి చెంది రూ.15,751.08 కోట్లుగా నమోదయ్యాయి. ఇతర ఆదాయాలతో కలిపి మొత్తం ఆదాయం 15.3% పెరిగి రూ.16,695.87 కోట్లకు చేరింది.
‘‘అవసరమైన చోట్ల ధరలు తగ్గిస్తూ జీఎస్‌టీ క్రమబద్ధీకరణ ఫలాలు కస్టమర్లకు అందిస్తున్నాము. ఈ క్వార్టర్‌లో 8 కొత్త స్టోర్లను ప్రారంభించడంతో 2025 సెప్టెంబర్ 30 నాటికి మొత్తం స్టోర్ల సంఖ్య 432కి చేరింది. ప్రస్తుతం మాకున్న మార్కెట్లలో 10 ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేశాము’’ అని సీఈవో అన్షుల్ అసావా తెలిపారు.