ఔషధ రంగ కంపెనీ గ్లెన్‌మార్క్ ఫార్మాస్యూటికల్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 72 శాతం జంప్‌చేసి రూ. 610 కోట్లను అధిగమించింది. యాబ్‌వీతో లైసెన్సింగ్ డీల్ ఇందుకు సహకరించింది.
ఐఎస్‌బీ 2001 ఇన్వెస్టిగేషనల్ అసెట్‌కు సంబంధించి యాబ్‌వీతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం లాభాలకు దోహదపడినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 354 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 3,434 కోట్ల నుంచి రూ. 6,047 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 3,001 కోట్ల నుంచి రూ. 3,895 కోట్లకు పెరిగాయి.
లైసెన్సింగ్ దన్ను
యాబ్‌వీతో కుదిరిన 192 కోట్ల డాలర్ల విలువైన ఒప్పందంలో భాగంగా తాజా సమీక్షా కాలంలో 52.5 కోట్ల డాలర్ల ఆదాయం అందుకున్నట్లు గ్లెన్‌మార్క్ ఫార్మా వెల్లడించింది. కేన్సర్, ఆటోఇమ్యూన్ వ్యాధుల చికిత్స కోసం రూపొందిస్తోన్న ఐఎస్‌బీ 2001 కమర్షియలైజేషన్‌కు ఈ ఏడాది జూలైలో రెండు కంపెనీలు డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
దేశీయంగా ఫార్ములేషన్ల బిజినెస్ 87 శాతంపైగా పడిపోయి రూ. 165 కోట్లకు పరిమితంకాగా.. ఉత్తర అమెరికా ఆదాయం రూ. 741 కోట్ల నుంచి రూ. 4,466 కోట్లకు దూసుకెళ్లింది. ఇక యూరప్‌లో అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ. 746 కోట్లను తాకాయి. గత క్యూ2లో ఇవి రూ. 687 కోట్లుగా నమోదయ్యాయి.


