సన్ ఫార్మా లాభం అప్
దేశీ ప్రైవేట్ రంగ దిగ్గజం సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్ప(3 శాతం) వృద్ధితో రూ. 3,118 కోట్లను తాకింది. భారత్‌సహా వర్థ్ధమాన మార్కెట్లలో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 3,040 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 13,264 కోట్ల నుంచి రూ.14,405 కోట్లకు బలపడింది. దేశీయంగా ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతం వృద్ధితో రూ.4,736 కోట్లను తాకాయి. ఆదాయంలో ఇది 33 శాతంకాగా.. యూఎస్ ఫార్ములేషన్ల విక్రయాలు 4 శాతం నీరసించి 49.6 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి. వర్ధమాన మార్కెట్లలో ఫార్ములేషన్ల అమ్మకాలు 11 శాతం పుంజుకుని 32.5 కోట్ల డాలర్లకు చేరాయి. మిగిలిన ప్రపంచ దేశాల నుంచి 18 శాతం అధికంగా 23.4 కోట్ల డాలర్ల అమ్మకాలు సాధించింది. గ్లోబల్ ఇన్నోవేటివ్ ఔషధ విక్రయాలు 16 శాతం ఎగసి 33.3 కోట్ల డాలర్లను తాకాయి. అయితే ఏపీఐ అమ్మకాలు 20 శాతం క్షీణించి 430 కోట్ల డాలర్లకు పరిమితమయ్యాయి.
గ్రాసిమ్ లాభం హైజంప్
క్యూ2లో రూ. 1,498 కోట్లు
ఆదిత్య బిర్లా గ్రూప్ డైవర్సిఫైడ్ దిగ్గజం గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం 52 శాతం జంప్‌చేసి రూ. 1,498 కోట్లను అధిగమించింది. సిమెంట్, కెమికల్ బిజినెస్‌లో వృద్ధి ఇందుకు సహకరించింది. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 989 కోట్లు ఆర్జించింది. కార్యకలాపాల ఆదాయం 17 శాతం పుంజుకుని రూ. 39,900 కోట్లను తాకగా.. గత క్యూ2లో రూ. 34,223 కోట్ల ఆదాయం అందుకుంది. మొత్తం టర్నోవర్ 16% ఎగసి రూ. 40,245 కోట్లకు చేరింది. బిల్డింగ్ మెటీరియల్స్, కెమికల్స్ విభాగాలు ఇందుకు దోహదపడ్డాయి. అయితే మొత్తం వ్యయాలు 15 శాతం పెరిగి రూ. 37,796 కోట్లకు చేరాయి.
బ్లూ స్టార్ లాభం ప్లస్
క్యూ2లో రూ. 99 కోట్లు
ఏసీలు, కమర్షియల్ రిఫ్రిజిరేషన్ సిస్టమ్‌ల తయారీ దిగ్గజం బ్లూ స్టార్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం (2025–26) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై–సెపె్టంబర్(క్యూ2)లో నికర లాభం స్వల్ప (3%) వృద్ధితో రూ. 99 కోట్లను తాకింది. రుతుపవనాలు దీర్ఘకాలం కొనసాగడం, అమ్మకపు చానల్స్‌లో సవాళ్లు, జీఎస్‌టీ రేట్ల సవరణలు ప్రతికూల ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 96 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం 9% ఎగసి రూ. 2,422 కోట్లను అధిగమించింది. గత క్యూ2లో రూ. 2,216 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు సైతం 6% పెరిగి రూ. 2,299 కోట్లకు చేరాయి. ఇతర ఆదాయంతో కలసి మొత్తం టర్నోవర్ 6% పుంజుకుని రూ. 2,432 కోట్లను దాటింది.
ఇదీ చదవండి: జేబుకు తెలియకుండానే కన్నం వేస్తున్నారా?


