డబ్బు సంపాదించడం ఒక కళ. ధనవంతులు అయ్యేందుకు చాలా మార్గాలు అనుసరించి లక్ష్యం చేరినా, దాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఎంతో కష్టపడి సంపాదించిన ధనం దేనికి ఖర్చు చేస్తున్నారో సరైన అవగాహన లేకుండానే చాలా మంది నష్టపోతున్నారు. ఇది కేవలం తక్కువ ఆదాయం ఉన్నవారికి మాత్రమే కాదు, అపార సంపద ఉన్నవారికి కూడా వర్తిస్తుంది. ఆర్థిక స్వేచ్ఛకు పునాదులు వేసుకోవడానికి బదులు, దారిద్ర్యం వైపు నడిపించే ప్రమాదకరమైన అలవాట్లు, ఆర్థిక నిర్ణయాలు ఏమిటో తెలుసుకోవడం అత్యవసరం.
అదుపులేని వినియోగం
‘నాకు ఇప్పుడే ఆ వస్తువు అవసరం లేదు, కానీ కొనాలి’ అనే భావన పేదరికానికి మొదటి మెట్టు. క్రెడిట్ కార్డులు లేదా వ్యక్తిగత రుణాలపై వస్తువులను కొనుగోలు చేయడం, వాటిపై భారీ వడ్డీ చెల్లించడం వల్ల ఆర్థిక భారం పెరుగుతుంది. తరచుగా కొత్త మోడల్ ఫోన్లు, కార్లు లేదా ఫ్యాషన్ వస్తువుల కోసం అధికంగా ఖర్చు చేయడం వంటి విధానాల ద్వారా డబ్బు కరిగిపోతుంది. కొనుగోలు చేసిన వస్తువుల విలువ కాలక్రమేణా తగ్గిపోతుంది. ఇతరులను అనుకరించడానికి లేదా సమాజంలో గొప్పగా కనిపించడానికి స్థోమతకు మించిన ఖర్చులు చేయకూడదు.
ఆర్థిక అవగాహన లేకపోవడం
డబ్బు సంపాదించడం గురించి తెలుసుకోవడమే కాదు, అది ఎలా పనిచేస్తుందో తెలియకపోవడం అతిపెద్ద లోపం. డబ్బును బ్యాంకులో ఉంచడం సురక్షితమని భావించి చాలా మంది దాని విలువ ద్రవ్యోల్బణం కారణంగా క్రమంగా తగ్గిపోతోందని గ్రహించడం లేదు. భవిష్యత్తు కోసం పొదుపు చేయడం ముఖ్యం. కానీ ఆ పొదుపును తెలివిగా పెట్టుబడి పెట్టకపోతే ఆర్థిక లక్ష్యాలు నెరవేరవు. పన్నుల విధానంపై సరైన అవగాహన లేకపోవడం వల్ల అనవసరంగా ఎక్కువ పన్నులు చెల్లించడం లేదా చట్టపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు.
అత్యవసర నిధి..
ఊహించని సంఘటనలకు (ఉద్యోగం కోల్పోవడం, అనారోగ్యం, ప్రమాదాలు) సిద్ధంగా లేకపోవడం వల్ల పేదరికం అంచుల్లోకి వెళుతారు. అత్యవసర సమయాల్లో డబ్బు లేకపోతే అధిక వడ్డీకి అప్పులు చేయక తప్పదు. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది. కనీసం ఆరు నెలల జీవన వ్యయాలకు సరిపడా డబ్బును పక్కన పెట్టుకోవాలి. ఏ చిన్న విపత్తు వచ్చినా తీవ్ర సంక్షోభం నుంచి కపాడుకోవడానికి ఇది తోడ్పడుతుంది.
ఒకే ఆదాయ మార్గంపై ఆధారపడటం
ఒకే ఉద్యోగం లేదా ఒకే వ్యాపారంపై పూర్తిగా ఆధారపడటం ఆర్థిక ప్రమాదానికి సంకేతం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎప్పుడు ఉద్యోగం పోతుందో చెప్పలేం. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలు లేకపోతే కుటుంబ పోషణ కష్టమవుతుంది. అదనపు ఆదాయ వనరుల ద్వారా సంపదను వేగంగా పెంచుకునే అవకాశం ఉంది. అన్ని గుడ్లను ఒకే బుట్టలో ఉంచడం మంచిది కాదనే సూత్రాన్ని గుర్తుంచుకోవాలి.
దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళిక..
రేపటి గురించే కాకుండా 20-30 సంవత్సరాల భవిష్యత్తు గురించి ఆలోచించకపోవడం వల్ల కూడా చాలామంది పేదరికంలోకి వెళ్తున్నారు. యువతలో రిటైర్‌మెంట్ గురించి ఆలోచించడం లేదు. దానికోసం పొదుపు/పెట్టుబడి పెట్టడం లేదు. దాంతో వృద్ధాప్యంలో ఇతరులపై ఆధారపడేలా చేస్తుంది. ఇల్లు కొనడం, పిల్లల విద్య వంటి స్పష్టమైన ఆర్థిక లక్ష్యాలు లేకుండా ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే పరిస్థితులు తారుమారవుతాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లభించే చక్రవడ్డీ శక్తిని గుర్తించాలి.
ఇదీ చదవండి: దొంగలించి ‘ట్రేడ్-ఇన్’ ద్వారా కొత్త ఫోన్!


