కొందామా.. మరికొన్నాళ్లు వేచి చూద్దామా..? కొనగానే ధరలు పడిపోతే..? పోనీ, ధైర్యం చేసి కొన్నా అనుకున్నంత వేగంగా అభివృద్ధి చెందకపోతే? ..ఏడాది కాలంగా హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో ఇలాంటి ఎన్నో సందేహాలు. ఏ నిర్ణయం తీసుకోకుండా తర్జన భర్జనలో పడేశాయి. 2025లో ఈ ఊగిసలాటకు తెరపడింది. స్థిరాస్తి మార్కెట్‌లో కొన్నాళ్లుగా నెలకొన్న అనిశ్చితి ఈ ఏడాదితో తొలగిపోవడంతో కొనుగోలుదారుల్లో అభివృద్ధిపై ఆశలు చిగురించాయి. కొనుగోళ్లు పెరగడంతో స్థిరాస్తి సంస్థలు నిర్మాణాలు పూర్తి చేయడంలో వేగం పెంచాయి. రాష్ట్ర ప్రభుత్వం మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ల కార్యాచరణలో వేగంగా అడుగులు వేయడంతో ఈ రంగంలో సానుకూల అడుగులు వేసేందుకు ప్రధానంగా ఊతమిచ్చాయి.
భూముల ధరలు పెరగడం తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుంటుంది. ఈ రంగంలోని అనుభవజ్ఞులు చెబుతున్న మాట ఇది. మరి అలాంటప్పుడు కొనడానికి ఎందుకు ఊగిసలాట అనే సందేహం సహజం. గతంలో కొన్ని ప్రాంతాల్లో అభివృద్ధిని అతిగా చూపించి వాస్తవ ధరకంటే ఎంతో ఎక్కువకు స్థలాలను విక్రయించారు.. ఇవి పెరగకపోగా.. అత్యవసరంగా అమ్ముకోవాల్సి వస్తే తక్కువ ధరకే విక్రయించి కొందరు నష్టపోయారు. సాధారణంగా కొనుగోలుదారుల మనస్తత్వం.. ధరలు పెరుగుతుంటే కొనేందుకు పోటీపడతారు. అదే తగ్గుతుందంటే మాత్రం ఎవరూ ముందుకురారు. ఇలాంటప్పుడే డిమాండ్ పడి ధరలు మరింత పతనమయ్యే
అవకాశాలు ఉంటాయి. ధరలు పెరగాలంటే అభివృద్ధి నిలకడగా ఉండటం, రాజకీయ సుస్థిరత వంటి అంశాలు ఇంధనంగా పనిచేస్తాయి.
రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాలను అవలంభిస్తోంది. నగరంలో ఐటీ, ఫార్మాలతో పాటు విమానయాన, ఎల్రక్టానిక్స్ తదితర రంగాలలో పరిశ్రమలు, సంస్థల ఏర్పాటుకు ముందుకొస్తున్నాయి. తద్వారా సహజంగానే ఇళ్ల నిర్మాణానికీ డిమాండ్ పెరుగుతోంది. కంపెనీల ఏర్పాటుతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన జరిగి చుట్టుపక్కల స్థిరాస్తి రంగం వృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతుంది.
నలువైపులా అభివృద్ధి..
నగరం ఒకవైపే అభివృద్ధి కాకుండా నలువైపులా విస్తరించేలా ఆధ్యాత్మిక, ఐటీ, ఉత్పత్తి, ఫార్మా కారిడార్ల ప్రణాళికలు నిర్మాణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రతికూల పరిస్థితుల నుంచి సానుకూల దిశగా స్థిరాస్తి మార్కెట్ అడుగులు పడేందుకు ఇవి దోహదం చేశాయి. కేంద్ర ప్రభుత్వం స్థిరాస్తి రంగంలో విదేశీ పెట్టుబడులపై నిబంధనలను సరళతరం చేసింది. నిధులు లేక సతమతమవుతున్న నిర్మాణ పరిశ్రమలో ఈ నిర్ణయంతో ఆశలు చిగురించాయి. పెద్ద ప్రాజెక్ట్‌లకే కాదు చిన్న ప్రాజెక్ట్‌లకూ ఆర్థిక అండ లభించింది. తద్వారా హైదరాబాద్ స్థిరాస్తి మార్కెట్‌లోకి మరిన్ని పెట్టుబడులతో పాటుగా అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకు అవకాశం ఏర్పడింది. టౌన్‌షిప్‌ల అభివృద్ధి, గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణానికి నిధులు సమకూరాయి.
ఇది చదివారా? ఇల్లు ఇలా కట్టు.. ఇది ఇంకో కొత్త టెక్నిక్కు..
రెరాతో జవాబుదారితనం..
స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లుతో మార్కెట్‌పై సామాన్యుల్లో భరోసా పెరిగింది. దీంతో డెవలపర్లు, కొనుగోలుదారుల్లో సానుకూలత ఏర్పడింది. నిర్మాణం పూర్తయ్యి కొనుగోలుదారులకు అప్పగించాక ఐదేళ్లలో ఏదైనా లోపాలుంటే నిర్మాణదారుడిదే బాధ్యత వహించాలనేది స్థిరాస్తి నియంత్రణ అభివృద్ధి బిల్లులోని మరో ముఖ్యమైన అంశం. నిర్మాణం మొదలుపెట్టాక ప్లాన్‌ను మార్చడానికి వీల్లేకుండా కొన్ని మంచి నిబంధనలలూ ఇందులో పొందుపరిచారు. వీటిని ఉల్లంఘిస్తే మూడేళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలతో స్థిరాస్తి మార్కెట్‌లో జవాబుదారితనం పెరిగింది.


