ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ తీసుకొచ్చిన పెట్టుబడులు, ఆయన హయాంలో ఏర్పాటైన పారిశ్రామిక సంస్థల గురించి జరిగిన ప్రచారం ఒకటి.. అసలు వాస్తవం ఇంకోటి. ఐదేళ్ల పదవీ కాలంలో తొలి రెండేళ్లు కోవిడ్-19తోనే సరిపోయింది. రాష్ట్ర విభజన తరువాత వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఆంధ్రప్రదేశ్ ప్రస్థానం మొదలైన విషయం తెలిసిందే. అయితే ఈ కొరత కోవిడ్ బాధితులను ఆదుకునేందుకు అడ్డంకి కానే కాలేదు. అన్ని ఇబ్బందులను అధిగమించి కోవిడ్ బాధితులను ఆదుకోవడంలో అందరి ప్రశంసలు అందుకుంది జగన్ ప్రభుత్వం. అదే సమయంలో రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి జగన్ ఒక్కటొక్కటిగా పునాదులు వేస్తూ పోయారు. ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలు, వాటి ఫలితాల గురించి స్థూలంగా ఐదు ముక్కల్లో...
1. భారీ పెట్టుబడులు..
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ఐదేళ్ల కాలంలో ఆమోదం తెలిపిన పెట్టుబడులు ఏకంగా రూ.1.44 లక్షల కోట్లు. అంతేకాదు.. సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో 17.5 గిగావాట్ల విద్యుదుత్పత్తికి అనుమతులు ఇవ్వడం ద్వారా రికార్డు సృష్టించింది. మిగిలిన రాష్ట్రాలు సౌర, పవన విద్యుత్తులకు మాత్రమే పరిమితమైతే.. ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఆంధ్రప్రదేశ్‌లో పంప్డ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్రాజెక్టు ఏర్పాటైంది. గ్రీన్‌కో సంస్థ సుమారు రూ.28 వేల కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్రాజెక్టు సంప్రదాయేతర ఇంధన రంగంలో ఇతర రాష్ట్రాలకు మార్గదర్శకంగా నిలిచింది. కోల్ ఇండియా, ఏఎం గ్రీన్ వంటి సంస్థలతో భాగస్వామ్యం కారణంగా గ్రీన్ అల్యూమినియం, హైడ్రోజన్ ఉత్పత్తి ప్రాజెక్టులకు నిరంతర విద్యుత్తు సరఫరా సాధ్యమైంది. ఎకోరెన్ గ్రూపు రూ.11 వేల కోట్లు అకార్డ్ గ్రూపు రూ.పదివేల కోట్లు, సెంచురీ ప్లైబోర్డ్స్ రూ.2600 కోట్లతో, ఆంధ్ర పేపర్ మిల్లు రూ.3400 కోట్లు, ఎలక్ట్రోస్టీల్ క్యాస్టింగ్స్ రూ.1087 కోట్లు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో కొత్త ప్లాంట్ల ఏర్పాటు, విస్తరణలకు పెట్టుబడులుగా పెట్టింది కూడా జగన్ హయాంలోనే!
2. విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్..
2023లో విశాఖలో ఏర్పాటు చేసిన ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో 340 వరకూ పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. వీటి మొత్తం విలువ రూ.13 లక్షల కోట్లు. సుమారు 20 రంగాల్లో ఆరు లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే అవకాశం ఏర్పడింది. ఇదే సమ్మిట్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ వర్చువల్ పద్ధతిలో రూ.3841 కోట్ల విలువైన పరిశ్రమలను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిద్వారా సుమారు తొమ్మిదివేల ఉపాధి అవకాశాలు దక్కాయి. దేశ వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ (రిలయన్స్ ఇండస్ట్రీస్), కృష్ణ ఎల్లా (భారత్ బయోటెక్), జి.మోహన్ రావు (జీఎంఆర్ గ్రూపు), నవీన్ జిందల్ (జిందల్ స్టీల్ అండ్ పవర్), అదానీ గ్రూపు ప్రతినిధులు ఇతర అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు ఈ సమ్మిట్‌లో పాల్గొన్నారు. అప్పటికే ఆంధ్రప్రదేశ్ ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో నెంబర్ వన్ స్థానంలో ఉన్న విషయం గమనార్హం.
3. పోర్టులు.. ఇతర మౌలిక సదుపాయాలు..
సుమారు వెయ్యి కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని రాష్ట్రాభివృద్ధికి మెట్టుగా మార్చాలని వై.ఎస్.జగన్ సంకల్పించారు. ఇందుకు తగ్గట్టుగానే ఆయన హాయంలో మచలీపట్నం, రామాయపట్నం, భావనపాడు, కాకినాడ ఎస్‌ఈజెడ్ పోర్టుల నిర్మాణానికి శ్రీకారం పడింది. రికార్డు సమయంలో మచలీపట్నం పోర్టు పూర్తయ్యి 2023 మే నెలలో ప్రారంభమైంది కూడా. వీటితోపాటు అప్పటికే ఉన్న వైజాగ్, కృష్ణపట్నం, గంగవరం నౌకాశ్రయాల ఆధునికీకరణ, విస్తరణ కూడా చేపట్టారు. ఫలితంగా 2022లో ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో ఉన్నత స్థానానికి చేరుకోగలిగింది. ఆ ఏడాది దేశీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 38 శాతం! నౌకాశ్రయాల పరిస్థితి ఇలా ఉంటే.. రాష్ట్రంలో పలు పారిశ్రామిక కారిడార్ల నిర్మాణానికి కూడా వై.ఎస్.జగన్ శ్రీకారం చుట్టారు. పెట్రో కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ ఎగుమతులు కేంద్రంగా విశాఖ - చెన్నై కారిడార్ ఏర్పాటైతే.. ఆంధ్రప్రదేశ్ దక్షిణ జిల్లాలను బెంగళూరు- చెన్నై కారిడార్లతో కలిపే ప్రయత్నం జరిగింది.
4. పారిశ్రామిక విధానం..
సంక్షేమం పునాదిగా.. పారిశ్రమలే చోదక శక్తిగా జగన్ రాష్ట్ర పారిశ్రామిక విధానాన్ని రూపొందించారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 65 శాతానికి కారణమవుతున్న చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధిపై జగన్ తన ఐదేళ్ల పదవీ కాలంలో ఎన్నో చర్యలు తీసుకున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్స్, పెట్రోకెమికల్స్‌పై ప్రధానంగా దృష్టి పెట్టారు. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులు ఇచ్చేపద్ధతిని మొదలుపెట్టారు. వీటన్నింటి కారణంగానే ఆంధ్రప్రదేశ్ 2019-2024 మధ్యకాలంలో వరుసగా మూడేళ్లు ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’లో దేశంలోనే అగ్రస్థానానికి చేరుకోగలిగింది. సంక్షేమ పథకాలకు పారిశ్రామిక ప్రగతికి ముడిపెట్టిన జగన్ రాష్ట్రానికి వస్తున్న కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలు దక్కేలా చేసేందుకు పలు స్కిల డెవలప్‌మెంట్ కోర్సులను అమలు చేశారు. అపారెల్ పార్క్, ఆటో క్లస్టర్లను గ్రామీణ యువత, మహిళలకు నైపుణ్యాలను అందించే పథకాలకు జోడించారు. వీరిలో అత్యధికులు అమ్మ ఒడి, ఎస్‌హెచ్‌జీ గ్రూపు లబ్ధిదారులే.
5. పండుగలా వ్యవసాయం..
2019-204 మధ్యలో ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయం పండుగల మారింది. రైతు భరోసా ద్వారా రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ కింద ఏటా రూ.13,500 పంపిణీ చేయడం మాత్రమే కాదు.. ఉచిత బోర్‌వెల్స్, సాగునీటి ప్రాజెక్టులు, పంట బీమా పథకాలు రైతు కష్టాలను గణనీయంగా తగ్గించాయి. ఎప్పటికప్పుడు రైతు అవసరాలను గమనించి తీర్చేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా పదివేలకుపైగా రైతు విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటయ్యాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగావకాశాలు పెరిగాయి. వలసలు తగ్గాయి. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థలు కూడా రైతు పురోగతిలో తమ వంత పాత్ర పోషించాయి. పండ్లు, చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 2023-24 సంవత్సరానికి దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. 2022లో ఆంధ్రప్రదేశ్ నుంచి 774 కోట్ల డాలర్ల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.
:: గిళియారు గోపాలకృష్ణ మయ్యా


