న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ సిగ్నేచర్ గ్లోబల్ సెప్టెంబర్ త్రైమాసికంలో ఏకీకృత ప్రాతిపదికన రూ.46.86 నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం భారీ తగ్గడం ప్రతికూల ప్రభావాన్ని చూపినట్లు కంపెనీ తెలిపింది. గతేడాది క్యూ2లో రూ.4.15 కోట్ల నికర లాభాన్ని ప్రకటించడం విశేషం.
వార్షిక ప్రాతిపదికన మొత్తం ఆదాయం రూ.777.42 కోట్ల నుంచి రూ.372.51 కోట్లకు తగ్గింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో రూ.12.42 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించింది. అయితే, మొత్తం ఆదాయం మాత్రం స్వల్పంగా రూ.1,205.40 నుంచి రూ.1,270.86 కోట్లకు పెరిగింది.
గురుగ్రామ్ కేంద్రంగా పనిచేసే ఈ రియల్ ఎస్టేట్ సంస్థ గత ఆర్థిక సంవత్సరంలో రూ.10,290 కోట్ల ప్రాపర్టీస్ విక్రయించింది. దీంతో సేల్స్ పరంగా దేశంలో అయిదవ అతిపెద్ద లిస్టెడ్ రియల్టీ కంపెనీగా నిలిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.12,500 కోట్ల ముందస్తు బుకింగ్స్ లక్ష్యంగా పెట్టుకుంది.


