Real Estate: రిటైల్‌ పెట్టుబడులకు క్యూ.. | Indias retail boom to attract USD 3 5 billion next 3 years ANAROCK | Sakshi
Sakshi News home page

Real Estate: రిటైల్‌ పెట్టుబడులకు క్యూ..

Dec 20 2025 4:09 PM | Updated on Dec 20 2025 5:09 PM

Indias retail boom to attract USD 3 5 billion next 3 years ANAROCK

వచ్చే మూడేళ్లలో 3.5 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్స్‌

పొద్దున లేస్తే ఆన్‌లైన్‌లో ఒక్కసారైనా క్లిక్‌మనిపించాల్సిందే. షాపింగ్, ఫుడ్, లైఫ్‌స్టైల్‌.. ప్రతీది ఈ–కామర్స్‌లో కొనేందుకే నేటి యువత మొగ్గు చూపిస్తోంది. అయితే ఈ–కామర్స్‌ ఎంత పెరుగుతున్నా.. నేటికీ షాపింగ్‌ మాల్స్‌కు ఆదరణ మాత్రం అస్సలు తగ్గడం లేదు. పాశ్చాత్య దేశాల్లో రిటైల్‌ స్థలం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే.. మన దేశంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. ఇండియాలో మాల్స్‌ కేవలం షాపింగ్‌ కేంద్రాలే కాదు వినోదం, ఆహారం వంటి సామాజిక అవసరాలను కూడా తీర్చే కేంద్రాలుగా మారాయి. దీంతో మన దేశంలో ఏటేటా రిటైల్‌ స్పేస్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇండియాలో రిటైల్‌ రంగం వృద్ధిని సాధిస్తుంటే.. అమెరికాలో పతనం అవుతున్నాయి.

మన దేశంలో 600 కంటే ఎక్కువ ఆపరేషనల్‌ మాల్స్‌ ఉన్నాయి. అయితే ఇందులో వంద కంటే తక్కువ మాల్స్‌ మాత్రమే గ్లోబల్‌ ఫండ్స్‌ను ఆకర్షించే సంస్థాగత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయి. ఈ కొరతే ఇనిస్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు దేశీయ మాల్స్‌లో పెట్టుబడులకు ప్రధాన కారణం. అధిక రాబడి, యువ వినియోగదారుల డిమాండ్, సంస్థాగత పెట్టుబడిదారుల్లో విశ్వాసం కారణంగా భారత రిటైల్‌ రంగంలో జోరు పెరిగింది. పరిమిత స్థాయిలో వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్, సరళమైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) విధానాలు, విదేశీ బ్రాండ్లు, పెట్టుబడిదారులు రిటైల్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే మూడేళ్లలో దేశీయ రిటైల్‌ రంగం 3.5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తోందని అనరాక్‌ గ్రూప్‌ రీసెర్చ్‌ నివేదిక అంచనా వేసింది.

పాశ్చాత్య దేశాల్లో పతనం..  
పాశ్చాత్య దేశాలలో మాల్స్‌ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. కొత్త మాల్స్‌ స్టోర్లలో 78 శాతం పెరుగుదల ఉన్నప్పటికీ.. 2020 నుంచి నికర మాల్‌ స్టోర్‌ మూసివేతలు పెరుగుతున్నాయి. అమెరికాలో రికార్డ్‌ స్థాయిలో 1,200 మాల్స్‌ మూతపడ్డాయి. ఉన్న మాల్స్‌లో దాదాపు 40 శాతం ఖాళీలు ఉన్నాయి. అదే మన దేశంలో 2021 నుంచి ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల మధ్యకాలంలో 88కు పైగా విదేశీ బ్రాండ్లు భారత రిటైల్‌ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. గ్రేడ్‌–ఏ మాల్స్‌ కోసం మరిన్ని అన్వేషణలో ఉన్నాయి. దాదాపు పూర్తి ఆక్యుపెన్సీలో ఉన్న గ్రేడ్‌–ఏ మాల్స్‌లో 95–100 శాతం లీజులు పూర్తయ్యాయి. కీలక జోన్‌లో రిటైల్‌ స్థలం కోసం దుకాణదారులు ఎదురుచూస్తున్నారు.

తలసరి రిటైల్‌ స్పేస్‌.. 
మన దేశంలో తలసరి రిటైల్‌ స్టాక్‌ ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది. భారత తలసరి రిటైల్‌ స్టాక్‌ ప్రథమ శ్రేణి నగరాల్లో కేవలం 4–6 చదరపు అడుగులుగా ఉంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో 2–3 చ.అ.లుగా ఉంది. ఇక, గ్రేడ్‌–ఏ మాల్స్‌లో తలసరి స్థలం కేవలం 0.6 చ.అ.గా ఉంది. అదే అమెరికాలో సగటు తలసరి రిటైల్‌ స్థలం 23 చ.అ., చైనాలో 6 చ.అ.లుగా ఉన్నాయి.

రిటైల్‌లో రాబడి.. 
యువ జనాభా, పెరుగుతున్న ఆదాయాలు, వేగవంతమైన పట్టణ విస్తరణ కారణంగా భారతదేశం 2030 నాటికి 6 ట్రిలియన్‌ డాలర్ల వినియోగ స్థాయిని చేరుకునే దిశగా పయనిస్తోంది. దేశంలో గ్రేడ్‌–ఏ రిటైల్‌ ప్రాపర్టీలు ఏటా 14–18 శాతం రాబడి అందిస్తాయి. అదే పాశ్చాత్య దేశాలలో ఈ రాబడి దాదాపు రెట్టింపు స్థాయిలో ఉంటుంది. మన దేశంలో నాణ్యమైన రిటైల్‌ స్థలం కొరతే డిమాండ్‌కు ప్రధాన కారణం. మన దేశంలో రోజుకు మాల్స్‌ ఫుట్‌ఫాల్స్‌ సగటున 20 వేలకంటే ఎక్కువగా ఉంటాయి. వీకెండ్‌లో అయితే 40 వేల కంటే అధికంగా ఉంటాయి. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్, ఎంటర్‌టైన్‌మెంట్‌ స్పేస్‌లలో ఫుట్‌ ఫాల్స్‌ 30–35 శాతం వాటాలను కలిగి ఉంటాయి. దీంతో ఆన్‌లైన్‌ రిటైల్‌ ప్రభావం భౌతిక మాల్స్‌పై ప్రభావం లేదు.

ఫిజికల్‌ స్టోర్లు.. 
మన దేశంలో రిటైల్‌ స్టోర్లు ‘ఫిజికల్‌’గా మారుతున్నాయి. ఆఫ్‌లైన్‌ స్టోర్లు కస్టమర్లకు అనుభూతిని, విశ్వాసాన్ని పెంచే కేంద్రాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆన్‌లైన్‌ ఫ్లాట్‌ఫామ్‌లు డిమాండ్‌ను పెంచుతున్నాయి. మన దేశంలో ప్రముఖ డైరెక్ట్‌ టు కన్‌జ్యూమర్‌(డీ టూ సీ) బ్రాండ్లు ఆన్‌లైన్‌ కంటే ఆఫ్‌లైన్‌ విక్రయాలను అధికంగా చేస్తుండటమే ఇందుకు ఉదాహరణ. అయితే మన దేశంలో ఈ–కామర్స్‌ వాటా 8 శాతంగా ఉంది. అదే చైనా, అమెరికాలో 20 శాతం కంటే అధికం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement