భారత కార్యాలయ వసతుల లీజింగ్‌లో (ఆఫీస్ స్పేస్) అంతర్జాతీయ కంపెనీల ఆధిపత్యం అంతకంతకూ పెరుగుతోంది. 2025లో దేశ వ్యాప్తంగా టాప్–7 నగరాల్లో 58 శాతం మేర ఆఫీస్ వసతులను అంతర్జాతీయ కంపెనీలే లీజింగ్‌కు తీసుకున్నట్టు జేఎల్‌ఎల్ ఇండియా తెలిపింది. ఈ సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గతేడాది దేశవ్యాప్తంగా టాప్–7 నగారల్లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ అంతకుముందు ఏడాదితో పోలిస్తే 8 శాతం పెరిగి 83.3 మిలియన్ చదరపు అడుగులకు (ఎస్‌ఎఫ్‌టీ) చేరింది. ఇందులో 48.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని అంతర్జాతీయ కంపెనీలు తీసుకున్నాయి. 2024లో స్థూల ఆఫీస్ స్పేస్ లీజింగ్ 77.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది.
హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె, కోల్‌కతా నగరాల్లోని లీజింగ్‌ను విశ్లేషించిన అనంతరం జేఎల్‌ఎల్ ఇండియా ఈ వివరాలు విడుదల చేసింది. అంతర్జాతీయ అనిశ్చితుల్లోనూ వ్యూహాత్మక వ్యాపార కేంద్రంగా భారత్ స్థానం మరోసారి రుజువైనట్టు ఈ నివేదిక పేర్కొంది. ఇంగ్లిష్ నైపుణ్యాలున్న మానవ వనరుల లభ్యతకుతోడు ప్రముఖ నగరాల్లో అందుబాటు ధరలకే ప్రీమియం ఆఫీస్ స్పేస్ లభ్యత అంతర్జాతీయ కంపెనీలు భారత్‌లో పెట్టుబడుల దిశగా ఆకర్షిస్తున్నట్టు తెలిపింది.
60 శాతం జీసీసీల్లోనే..
అంతర్జాతీయ సంస్థలు భారత్‌లో గేతడాది 48.6 మిలియన్ చదరపు అడుగుల కార్యాలయ వసతులను అద్దెకు తీసుకుంటే.. అందులో 31.4 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాల్లోనే (జీసీసీలు) ఉండడం గమనార్హం. 7 నగరాల్లో గతేడాది మొత్తం ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో దేశీ సంస్థలు 34.7 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీని లీజుకు తీసుకున్నాయి. అంతర్జాతీయ సంస్థల వ్యాపార విస్తరణకు బెంగళూరు అత్యంత ప్రాధాన్య నగరంగా ఉంది. భారత ఆఫీస్ స్పేస్ లీజింగ్ మార్కెట్‌లో జీసీసీలు ప్రముఖ శక్తిగా ఉన్నట్టు జేఎల్‌ఎల్ భారత ఎండీ రాహుల్ అరోరా పేర్కొన్నారు. గతేడాది ఆఫీస్ స్పేస్ లీజింగ్‌లో కోవర్కింగ్ ఆపరేటర్లు కూడా కీలక పాత్ర పోషించినట్టు జేఎల్‌ఎల్ నివేదిక తెలిపింది. భవిష్యత్‌కు వీలైన పని ప్రదేశాలుగా, నిపుణుల లభ్యత, నిర్వహణ సౌలభ్యంతో జీసీసీలు కీలకంగా మారినట్టు భైవ్ వర్క్‌స్పేస్ సీఈవో శేష్ రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: సవాళ్లున్నా ముందుకే


