ఏఎంఐ ల్యాబ్స్‌తో ఓఎక్స్‌ఎంఐక్యూ ల్యాబ్స్‌ జట్టు | OXMIQ Labs partners AM Group for AI compute platforms | Sakshi
Sakshi News home page

ఏఎంఐ ల్యాబ్స్‌తో ఓఎక్స్‌ఎంఐక్యూ ల్యాబ్స్‌ జట్టు

Mar 17 2026 3:44 AM | Updated on Mar 17 2026 7:55 AM

OXMIQ Labs partners AM Group for AI compute platforms

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: పునరుత్పాదక విద్యుత్‌తో నడిచే అతి పెద్ద ఏఐ ఆధారిత కంప్యూట్‌ ప్లాట్‌ఫాంను నిర్మించేందుకు ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌ (ఏఎంఐ)తో ఓఎక్స్‌ఎంఐక్యూ ల్యాబ్స్‌ జట్టు కట్టింది. ఈ ఒప్పందం ప్రకారం నోయిడాలో ప్రాథమికంగా 1 గిగావాట్‌ ఏఐ కంప్యూట్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తారు. 2030 నాటికి దీన్ని 2 గిగావాట్ల స్థాయికి విస్తరిస్తారు. దీని విద్యుత్‌ వ్యయాలు సంప్రదాయ డేటా సెంటర్‌ విద్యుత్‌ వ్యయాలతో పోలిస్తే 50–70 శాతం తక్కువగా ఉండనున్నాయి.

ఈ ఒప్పందం కింద కంప్యూట్‌ ప్లాట్‌ఫాంకి సంబంధించి ఆర్కిటెక్చర్, ఇంజినీరింగ్‌ భాగస్వామిగా ఓఎక్స్‌ఎంఐక్యూ వ్యవహరిస్తుంది. ఆర్కిటెక్చర్, హార్డ్‌వేర్‌ రోడ్‌మ్యాప్, సప్లై చెయిన్‌ వ్యూహాలను డిజైన్‌ చేయడంలో ఏఎంఐ ల్యాబ్స్‌తో కలిసి పని చేస్తుంది. ఇప్పటికే తొలి దశ పనులు ప్రారంభం కాగా, 2027 నాటికి ప్రాథమిక కంప్యూట్‌ సామర్థ్యం అందుబాటులోకి రానుంది.

పర్యావరణహిత విద్యుత్‌ దిగ్గజం గ్రీన్‌కో మాతృ సంస్థ ఏఎం గ్రూప్‌లో ఏఎంఐ ల్యాబ్స్‌ భాగంగా ఉంది. జీపీయూ ఆర్కిటెక్చర్, ఏఐ టెక్నాలజీ కంపెనీ అయిన ఓఎక్స్‌ఎంఐక్యూ ల్యాబ్స్‌ని రాజా కోడూరి ఏర్పాటు చేశారు.  సిలికాన్‌ వేలీ కంపెనీలకు సేవలందిస్తున్న ఓఎక్స్‌ఎంఐక్యూ అనుభవం తమకు ఉపకరిస్తుందని ఏఎం గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ చలమలశెట్టి తెలిపారు. ఏఎంఐ ల్యాబ్స్‌ తమకు సరైన భాగస్వామి అని రాజా కోడూరి తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement