ఫిబ్రవరిలో 27.1 బిలియన్ డాలర్లకు పరిమితం
స్వల్పంగా తగ్గిన ఎగుమతులు.. 36.61 బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: దేశం నుంచి గత నెలలో వివిధ వస్తువుల (మెర్కండైజ్) ఎగుమతులు వార్షికంగా 0.8 శాతం క్షీణించి 36.61 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతేకాకుండా ఫిబ్రవరిలో వాణిజ్య లోటు 27.1 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. అయితే పశ్చిమాసియా యుద్ధం ఫిబ్రవరి 28న ప్రారంభం కావడంతో ఈ ప్రభావం మార్చి నెల వాణిజ్య గణాంకాలపై కనిపించనుంది.
మార్చి గణాంకాలు మే నెల మధ్యలో విడుదలవుతాయి. కాగా.. రవాణాపై రాజకీయ, భౌగోళిక సవాళ్లు ప్రభావం చూపడంతో మార్చిలో ఎగుమతులు క్షీణించనున్నట్లు వాణిజ్య శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. కాగా.. ఫిబ్రవరిలో దిగుమతులు 24 శాతంపైగా ఎగసి 63.71 బిలియన్ డాలర్లను తాకాయి. ఇందుకు పసిడి, వెండి దిగుమతులు కారణమయ్యాయి.
గోల్డ్ షిప్‌మెంట్స్ 219 శాతం జంప్‌చేసి 7.44 బిలియన్ డాలర్లకు చేరగా.. సిల్వర్ దిగుమతులు 285 శాతంపైగా ఎగసి 1.66 బిలియన్ డాలర్లయ్యాయి. మరోపక్క ముడిచమురు దిగుమతులు 9 శాతం అధికమై 12.97 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే జనవరిలో నమోదైన 34.68 బిలియన్ డాలర్లతో పోలిస్తే గత నెలలో వాణిజ్య లోటు తగ్గింది. వార్షికంగా అంటే 2025 ఫిబ్రవరిలో నమోదైన 14.05 బిలియన్ డాలర్లతో చూస్తే భారీగా పెరిగింది.
11 నెలల్లో..: ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్– ఫిబ్రవరి కాలంలో దేశ ఎగుమతులు దాదాపు 2 శాతం పుంజుకుని 402.93 బిలియన్ డాలర్లను తాకాయి. ఇదే కాలంలో దిగుమతులు 8.5 శాతం పెరిగి 713.53 బిలియన్ డాలర్లకు చేరాయి. దీంతో ఈ ఏడాది(2025–26) తొలి 11 నెలల్లో వాణిజ్య లోటు 310.6 బిలియన్ డాలర్లుగా నమోదైంది. గతేడాది(2024–25) ఇదే కాలంలో ఈ లోటు 261.8 బిలియన్ డాలర్లు మాత్రమే.
అమెరికాకు ఎగుమతులు డౌన్
అధిక టారిఫ్‌ల భారం కారణంగా అమెరికాకు భారత్ నుంచి ఎగుమతులు ఫిబ్రవరిలో 6.88 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 12.88 శాతం తగ్గాయి. భారత్‌పై అమెరికా 50% పైగా సుంకాలు విధించడం, తర్వాత అక్కడి సుప్రీంకోర్టు వాటిని కొట్టివేయడంతో తిరిగి 150 రోజుల వ్యవధికి 10% విధించడం తెలిసిందే. సుంకాల తగ్గుదల ప్రభావం మార్చి ఎగుమతుల గణాంకాల్లో తెలియనుంది.
11 నెలల వ్యవధిలో..: ఇక ఈ ఆర్థిక సంవత్సరం 11 నెలల వ్యవధిలో అమెరికాకు ఎగుమతులు 3.84% పెరిగి 79.29 బి.డాలర్లకు, దిగుమతులు 15.65% పెరిగి 48.4 బి.డాలర్లకు చేరాయి. మరోవైపు, చైనాకు ఎగుమతులు 37.66% పెరిగి 17.54 బి. డాలర్లకు, దిగుమతులు 119.55 బి. డాలర్లకు ఎగిశాయి.


