సవాళ్లున్నా ముందుకే    | Economic Survey 2025-26 | Sakshi
Sakshi News home page

సవాళ్లున్నా ముందుకే   

Jan 30 2026 3:37 AM | Updated on Jan 30 2026 3:37 AM

Economic Survey 2025-26

2026–27 వృద్ధి అంచనా 6.8–7.2 శాతం 

4.4 శాతానికి తగ్గనున్న ద్రవ్యలోటు 

బంగారం, వెండి ధరల మంటలు కొనసాగొచ్చు 

టారిఫ్‌లను ఎదుర్కొనేందుకు పలు చర్యలు 

దేశీ వస్తు వినియోగం పెరగాలి 

వాణిజ్య అవరోధాలకు ఇదొక పరిష్కారం 

2025–26 ఆర్థిక సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వాణిజ్య అనిశ్చితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ ప్రపంచంలో వేగవంతమైన వృద్ధితో ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ప్రస్థానం కొనసాగుతుందని ఆర్థిక సర్వే విశ్వాసం వ్యక్తం చేసింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026–27) జీడీపీ 6.8–7.2 శాతం మధ్య వృద్ధి నమోదు చేస్తుందని అంచనా వేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి అంచనా 7.4 శాతం కంటే తగ్గించడం గమనార్హం. జీడీపీలో ద్రవ్యలోటు 2025–26లో 4.8 శాతం అంచనా కాగా, 2026–27లో 4.4 శాతానికి తగ్గొచ్చని పేర్కొంది. ‘‘ఇటీవలి సంవత్సరాల్లో తీసుకొచ్చిన విధానపరమైన సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్య కాల వృద్ధిని 7 శాతానికి చేర్చుతాయి.

కనుక ప్రపంచ అనిశ్చితుల మధ్య స్థిరమైన వృద్ధికి అవకాశం ఉంది. కావాల్సింది అప్రమత్తతే కానీ, నిరాశావాదం కాదు’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య రక్షణాత్మక పెట్టుబడుల ధోరణితో బంగారం, వెండి ధరల మంటలు ఇప్పుడప్పుడే చల్లారకపోవచ్చని అభిప్రాయపడింది. 739 పేజీలతో కూడిన 2025–26 ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటుకు సమర్పించారు. సందర్భానుసారం వేదాలు, ఇతిహాసాల్లోని సూక్తులను సైతం ప్రస్తావించడం విశేషం. ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌ బృందం దీన్ని రూపొందించింది. ఏటా బడ్జెట్‌కు ముందు ఆవిష్కరించే ఆర్థిక సర్వే నివేదిక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతోపాటు రానున్న రానున్న సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరు ఎలా ఉంటుందన్నది తెలియజేస్తుంది.

‘స్వదేశీ’ మంత్రం.. 
అంతర్జాతీయంగా వాణిజ్యం, ఇతర సమస్యల నుంచి గట్టెక్కేందుకు ‘స్వదేశీ’ మంత్రాన్ని ఆర్థిక సర్వే సూచించింది. ‘‘అన్నిరకాల దిగుమతులకు ప్రత్యామ్నాయం అన్నది ఆచరణ సాధ్యం కాబోదు. అలాగే, ఆమోదనీయం కూడా కాదు. అభివృద్ధి చెందిన దేశాలు ఎగుమతులపై నియంత్రణలు విధిస్తూ, టెక్నాలజీ బదిలీకి నిరాకరిస్తున్న తరుణంలో స్వదేశీ అన్నది తప్పనిసరే కాదు అవసరం కూడా’’అని ఆర్థిక సర్వే పేర్కొంది. ఐరోపాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం దేశ తయారీ రంగ పోటీతత్వాన్ని బలోపేతం చేస్తుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థతో అనుసంధానం పెంచడం, ఎగుమతులను ప్రోత్సహించడం, ఎగుమతుల పరంగా ఉన్న అవరోధాలను తొలగించడంపై దృష్టి సారించాలి.  

సర్వేలోని అంశాలు.. 
2026–27లో జీడీపీ వృద్ధి రేటు 6.8–7.2 శాతంగా ఉంటుంది. మధ్య కాలానికి జీడీపీ వృద్ధి 7 శాతంగా కొనసాగొచ్చు. 
2026–27లో ద్రవ్యలోటు 4.4 శాతానికి దిగొస్తుంది. ద్రవ్యోల్బణం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే ఎక్కువే ఉండొచ్చు. అయినప్పటికీ ఆర్‌బీఐ లకి్ష్యత స్థాయి 4 శాతం పరిధిలోనే ఉంటుంది. 

అమెరికాతో కొనసాగుతున్న వాణిజ్య చర్చలు ఈ ఏడాదిలో ముగుస్తాయి. దీంతో విదేశీ వాణిజ్యం పరంగా అనిశ్చితులు తగ్గుతాయి.  
కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు ట్రిలియన్‌ డాలర్లు కుమ్మరిస్తున్న నేపథ్యంలో.. ఈ పెట్టుబడులు ఆశించిన ప్రతిఫలం ఇవ్వకపోతే అది ఆర్థిక సంక్షోభానికి దారితీసే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితుల్లో అధిక విలువలు కలిగిన అసెట్స్‌లో దిద్దుబాటు చోటుచేసుకోవచ్చు. 

రూపాయి విలువ పటిష్టమైన దేశ ఆర్థిక మూలాలను ప్రతిఫలించడం లేదు. అమెరికా టారిఫ్‌లతో రూపాయి విలువ 5 శాతం పతనమైంది. అయినప్పటికీ కరెన్సీ విలువ క్షీణించడం వల్ల మన ఉత్పత్తులపై అమెరికా విధించిన టారిఫ్‌ల ప్రభావాన్ని కొంత వరకు తగ్గిస్తోంది. 
దేశ వృద్ధిలో సేవల ఎగుమతులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. వస్తు ఎగుమతులపై టారిఫ్‌ల అనిశ్చితుల ప్రభావాన్ని ఇవి భర్తీ చేస్తున్నాయి.  

ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయిలో ఉంది. కంపెనీలు, గృహాల పద్దులు ఆరోగ్యంగా ఉన్నాయి. వినియోగం కూడా బలంగా ఉంది.  
తదుపరి జీఎస్‌టీ సంస్కరణల్లో భాగంగా ఇ–వే బిల్లు వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించాలి. 

ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి రూ.8.1 లక్షల కోట్ల చెల్లింపుల్లో జాప్యం ఈ రంగం వృద్ధికి అవరోధంగా మారింది. నగదు ప్రవాహాల ఆధారితంగా రుణ సాయం అందించడం వంటి వినూత్నమైన చర్యలు అవసరం.  
ఎరువుల తయారీలోకి వినియోగించే ముడి పదార్థాలు, ఫార్మా ముడిసరుకులు (ఇంగ్రేడియెంట్స్‌), మ్యాగ్నెట్, బ్యాటరీ సెల్స్, నూనెలు, టెలికం ఎక్విప్‌మెంట్, వైద్య పరికరాల పరంగా స్వావలంబనను పెంచేందుకు బహుళ అంచల విధానం అవసరం.  

ప్రస్తుతం ఏదైనా కంపెనీలో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంటే దాన్ని ప్రభుత్వ సంస్థగా పేర్కొంటుండగా, దీన్ని 26 శాతానికి తగ్గించాలి. ప్రభుత్వరంగ సంస్థల్లో వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ రూపంలో 51 శాతం కంటే తక్కువకు తగ్గించుకోవచ్చు. పూర్తిగా వైదొలగొచ్చు.  
పీఎల్‌ఐ పథకం కింద రూ.13,759 కోట్ల ప్రోత్సాహకాలతో దేశంలో మొబైల్‌ ఫోన్ల తయారీ 2025 సెప్టెంబర్‌ నాటికి రూ.9.34 లక్షల కోట్లకు చేరింది. ఎగుమతులు రూ.5.12 లక్షల కోట్లుగా ఉన్నాయి.  

డిజిటల్‌ వ్యసనానికి చెక్‌ పెట్టేందుకు సోషల్‌ మీడియా యాప్‌ల వినియోగంలో వయసుల వారీ పరిమితులు తీసుకురావాలి. కరోనా సమయంలో మొదలైన ఆన్‌లైన్‌ బోధన టూల్స్‌పై ఆధారపడడాన్ని తగ్గించే చర్యలు అవసరం. పిల్లలకు బేసిక్‌ ఫోన్లు లేదా కంటెంట్‌ పరంగా ఫిల్టర్లతో విద్యా సంబంధిత సమాచారంతో కూడిన ట్యాబ్‌లను అనుమతించొచ్చు. 
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల మధ్య మీడియాలో అల్ట్రా ప్రాసెస్డ్‌ ఫుడ్స్‌పై ప్రచారాన్ని నిషేధించాలి. చంటి పిల్లలకు సంబంధించి పాలు, పానీయాల మార్కెటింగ్‌పై పరిమితులు విధించాలి. 

దేశంలో స్థూలకాయం పెరిగిపోతుండడం ప్రధాన ప్రజారోగ్య సవాలుగా మారింది. కనుక సరైన పోషకాహారం తీసుకోవడంపై దృష్టి సారించాలి. 2019–21 జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం మహిళల్లో 24 శాతం, పురుషుల్లో 23 శాతం అధిక బరువు సమస్యను ఎదుర్కొంటున్నారు.  
ఐటీ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉండొచ్చు. కొన్ని రకాల ఉద్యోగాలను ఏఐ భర్తీ చేస్తుంది. దీనిపై దృష్టి సారించేందుకు ఏఐ ఆర్థిక మండలిని ఏర్పాటు చేయాలి.

వికసిత్‌ భారత్‌కు మార్గసూచీ
భారతదేశ సంస్కరణల ప్రస్థానాన్ని ఆర్థిక సర్వే విశదీకరించింది.అంతర్జాతీయంగా సవాళ్లతో కూడిన వాతావరణం మధ్య స్థిరమైన పురోగతిని ప్రతిబింబించింది. బలమైన స్థూల ఆర్థిక పరిస్థితులు, స్థిరమైన వృద్ధితోపాటు దేశ నిర్మాణంలో ఆవిష్కరణలు, పారిశ్రామిక పాత్రను హైలైట్‌ చేస్తోంది. తయారీని బలోపేతం చేయడానికి, ఉత్పాదకతను పెంచడానికి, వికసిత్‌ భారత్‌ లక్ష్యం దిశగా మన ప్రయాణాన్ని వేగవంతం చేయడానికి ఈ సర్వే  కార్యాచరణను కూడా వివరించింది’’     – ప్రధాని నరేంద్ర మోదీ

పటిష్ట స్థితిలో భారత్‌ 
దేశ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంతకుముందెన్నడూ లేనంత బలంగా ఉన్నాయి. అంతర్జాతీయ సవాళ్లను విజయవంతంగా అధిగమించడం ద్వారా భారత్‌ను అధిక వృద్ధి పథంలో నిలిపాం. జీడీపీ వృద్ధి సామర్థ్యాన్ని 7 శాతానికి చేర్చాం. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక సంక్షోభం మధ్య భారత్‌ అంతర్జాతీయ ఆశాకిరణంగా నిలిచింది’’ – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌  

ఎగుమతులు, వ్యవసాయంలో లోపాలు.. 
పార్లమెంటు ముందుంచిన ఆర్థిక సర్వే 2025–26 దేశ ఎగుమతి విధానాలు.. ముఖ్యంగా వ్యవసాయ రంగం విషయంలో లోపాలను ఎత్తి చూపించింది. విలువ పరంగా ప్రపంచంలో రెండో అతిపెద్ద వ్యవసాయ దేశంగా ఉన్న భారత్‌ నుంచి.. వ్యవసాయం, సముద్ర ఉత్పత్తులు, ఆహారం, పానీయాల ఉత్పత్తుల ఎగుమతులు వచ్చే నాలుగేళ్ల కాలంలో 100 బిలియన్‌ డాలర్లకు (రూ.9.2 లక్షల కోట్లు) చేరుకుంటాయని అంచనా వేసింది.

2024–25లో ఇవి 51.1 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. అయితే విధానాల్లో తరచూ చేసే మార్పులతో సరఫరా వ్యవస్థలు దెబ్బతినొచ్చని, అనిశ్చితికి కారణమై.. విదేశీ కొనుగోలుదారులు ప్రత్యామ్నాయాలను ఆశ్రయించేందుకు దారితీయొచ్చంటూ హెచ్చరించింది. ఒక్కసారి ఎగుమతుల మార్కెట్లను కోల్పోతే తిరిగి పొందడం కష్టమవుతుందని పేర్కొంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement