ఏపీలో 2024 ఎన్నికలకు ముందు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రచారం చేసిన విషయం ఒకటుంది. వైఎస్ జగన్ ప్రభుత్వం కొనసాగితే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోదు అని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆస్తుల విలువలు పెరగవని ప్రజలు, రైతులను బెదిరించారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను కప్పిపుచ్చి భూముల విలువలు పడిపోయాయంటూ ఎల్లోమీడియా కూడా తన కథనాలలో విషం చిమ్మింది. ఏదైతేనేం.. ఎన్నికల్లో ఈ కూటమి అధికారం దక్కించుకుంది. ఇంకేం.. మా భూములు బంగారమవుతాయని అందరూ ఆశించారు. ఇరవై నెలలు గడిచిపోయింది కానీ.. వీరి ఆశలు మాత్రం పెద్దగా నెరవేరలేదు. పైగా.. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే రియల్ ఎస్టేట్ లావాదేవీలు మెరుగ్గా సాగాయని గణాంకాలు చెబుతున్నాయి.
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వానికి స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా గణనీయమైన ఆదాయం సమకూరింది. 2023-24లో 22.25 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.9546 కోట్ల ఆదాయం సమకూరింది. చంద్రబాబు అధికారంలో ఉన్న 2024-25లో మాత్రం ఈ సంఖ్యలు పడిపోయాయి. ఆదాయం రూ.8843 కోట్లు మాత్రమే. 2025-26లో రూ.10169 కోట్ల లక్ష్యం పెట్టుకున్నా.. అక్టోబర్ నాటికి అయ్యింది రూ.ఏడు వేల కోట్లే. కూటమి ప్రభుత్వం 2024-25లోనూ రూ.11997 కోట్ల ఆదాయం లక్ష్యంగా పెట్టుకుంది కానీ.. ఈ ఏడాది దీన్ని రూ.10169 కోట్లకు తగ్గించుకుంది. ఏటా ఆయా పద్దుల కింద ఆదాయం పదిశాతం వరకూ పెరిగేలా ప్రభుత్వాలు లక్ష్యాలు పెట్టుకుని బడ్జెట్ తయారు చేస్తుంటాయి. ఏపీలో మాత్రం లక్ష్యాన్ని తగ్గించుకున్నారన్న మాట.
రాష్ట్రవ్యాప్తంగా భూముల విలువను ఏభై శాతం మేర పెంచినా ఆశించినంత ఆదాయం రాకపోవడం ఆందోళన కలిగించేదే. వేల కోట్లు అప్పు తెచ్చి మరీ రాజధాని అమరావతిలో ఖర్చు చేస్తున్నా ప్రజలలో నమ్మకం కలగడం లేదు. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడి తమ వెంచర్ల భవిష్యత్తు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. ఉద్యోగులు చాలామందికి నెలలకొద్దీ జీతాలు కూడా అందడం లేదని ఈ రంగంలో పని చేస్తున్న ఉద్యోగి ఒకరు చెప్పడం గమనార్హం. ఇల్లు కట్టుకుంటున్నాను అంటూ చంద్రబాబు హడావుడి చేసినా ఫలితం లేకపోయింది. ఇవన్నీ చూస్తుంటే.. కూటమి ప్రభుత్వం వస్తే భూముల విలువలు బాగా పెరుగుతాయన్న ప్రచారం రాజకీయ లబ్ది కోసం మాత్రమే చేసిన అబద్ద ప్రచారం అని స్పష్టమవుతుంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎంతో కొంత సాగేది. విశాఖపట్నం వంటి చోట్ల జోరుమీద ఉండేది కూడా. కానీ, చంద్రబాబు ప్రభుత్వం పరిశ్రమలకు 99 పైసలకే భూములు ఇచ్చేయడం మొదలుపెట్టడంతో పరిస్థితి మారిపోయింది. ఈ రకమైన చర్యలతో ప్రభుత్వం విశాఖ ఇమేజీని ప్రభుత్వం దెబ్బ తీస్తోందన్న భావన ఏర్పడింది అంటున్నారు. జగన్ ప్రభుత్వం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణం ప్రారంభించగానే ఆ చుట్టుపక్కల భూముల విలువలు బాగా పెరిగాయని అక్కడి రైతులు తెలిపారు. అయితే, ఏడాదిన్నరగా ఈ ప్రాజెక్టు వేగం మందగించింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ వ్యాపారమూ తగ్గిపోయే పరిస్థితి. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జగన్ టైమ్‌లో రోజుకు 150 రిజిస్ట్రేషన్లు జరిగితే, ప్రస్తుతం అవి 80 దాటడం లేదట. తూర్పు గోదావరి జిల్లాలో 2023-24లో సుమారు 129355 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కూటమి వచ్చాక ఏడాది కాలంలో ఇది 61597 డాక్యుమెంట్లకు పరిమితమైంది. కడపలో గతంలో రోజుకు 300 రిజిస్ట్రేషన్లు జరిగితే ఇప్పుడవి ఏభై - అరవై వరకే ఉంటున్నాయి.
రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటే అనేక అనుబంధ పరిశ్రమలు దెబ్బతిని ఉద్యోగవకాశాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. సిమెంట్, ఐరన్, కలప పెయింటింగ్, విద్యుత్, ప్లంబింగ్ తదితర రంగాల వారు ఇబ్బంది పడుతున్నారు. జగన్ టైమ్‌లో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపట్టడం, నాలుగు కొత్త పోర్టులు, పది ఫిషింగ్ హార్బర్లు, 31 లక్షల ఇళ్ల స్థలాలను పేదలకు కేటాయించి, సుమారు 21 లక్షల ఇళ్ల నిర్మాణం ఆరంభించడం ప్రతి గ్రామంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్ తదితర భవనాల నిర్మాణాలు చేపట్టారు. ఇవన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు కొనసాగడానికి ఉపకరించాయి. అయినా అప్పట్లో ఎల్లో మీడియా నెగిటివ్ ప్రచారాన్ని సాగించేది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఈ పనులు ఏవీ సజావుగా సాగడం లేదు. అమరావతి తప్ప మిగలిన రాష్ట్రంలో ఎక్కడా కొత్త నిర్మాణం చేపట్టినట్లు కనిపించదు. ఫలితంగా అనంతపురం సహా వివిధ జిల్లాలలో పేదలు, కూలీలు వలసలు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గిట్టుబాటు ధరలు లేక రైతుల పరిస్థితి కూడా అగమ్యగోచరంగా తయారైంది.
తెలంగాణలో కూడా రియల్ ఎస్టేట్ ఆశించిన రీతిలో పెరగలేదు. కానీ, భూముల వేలంపాటల్లో మంచి రేట్లు వస్తుండటంతో ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం సమకూరుతోంది. కోకాపేట పరిసరాలలో ఇటీవల జరిగిన వేలంపాటలో ప్రభుత్వానికి రూ.మూడు వేల కోట్లు వచ్చాయి. అలాగే కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డుకు చెందిన 300 ఎకరాల స్థలాల ద్వారా రూ.ఎనిమిది వేల కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తున్నారు. మరోవైపు విశాఖలో ప్రభుత్వ భూములను అణా, బేడాకు చంద్రబాబు ప్రభుత్వం పందారం చేస్తోంది. సత్వా అనే రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్‌లో 2020లో రూ.600 కోట్లు ఖర్చు చేసి 20 ఎకరాలు కొనుగోలు చేసింది. వేలం పాట ద్వారా ఎకరాకు రూ.150 కోట్లు పెట్టి మరీ కొనుక్కుంది. కానీ ఏపీకి వచ్చేసరికి సత్వా కంపెనీకి ఏభై కోట్ల విలువైన భూమిని రూ.1.5 కోట్లకే కట్టబెడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ చెబుతున్నారు. చంద్రబాబుకు సన్నిహితుడన్న పేరు ఉన్న యూసఫ్ అలీకి చెందిన లూలూ గ్రూపు అహ్మదాబాద్ లో సుమారు 16.35 ఎకరాల భూమిని రూ.519 కోట్లకు కొనుగోలు చేస్తే ఏపీ ప్రభుత్వం విజయవాడ, విశాఖల్లో నామమాత్రపు లీజుకు భూములు ఇచ్చేసింది.
అందువల్లే ఈ ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ఆదాయ అంచనాలు దారుణంగా బోల్తా పడ్డాయి. వేర్వేరు మార్గాల ద్వారా మొత్తం రూ.2.18 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తే.. నవంబర్ నాటికి కేంద్రం ఇచ్చే గ్రాంట్లతో కలిపి రూ.1.05 లక్షల కోట్లు మాత్రమే వచ్చింది. ఇందులో రియల్ ఎస్టేట్ ద్వారా అందిన రూ.7132 కోట్లు ఆశించిన మొత్తంలో 54 శాతమే కాగ్ వెల్లడించింది. రెవెన్యూ లోటు మాత్రం వేగంగా పెరుగుతూ 54వేల కోట్లకు చేరింది. ఈ అంశాలన్నిటిని పరిగణనలోకి తీసుకుంటే ఎపిలో రియల్ ఎస్టేట్ రంగం ఆశించిన రీతిలో పుంజుకోకపోవడానికి తన ప్రభుత్వ అసమర్థతే కారణం అని చంద్రబాబు అంగీకరిస్తారా?.
-కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


