క్యూ2 లాభం రూ. 21,137 కోట్లు
వడ్డీ ఆదాయం రూ. 42,984 కోట్లు
మొత్తం బిజినెస్ రూ. 100 లక్షల కోట్లను తాకింది. ఆస్తుల రీత్యా ఎస్‌బీఐ ప్రపంచంలో 43వ ర్యాంకులో నిలుస్తోంది. వీటిలో ఎంఎస్‌ఎంఈ విభాగం రూ. 25 లక్షల కోట్లను ఆక్రమిస్తోంది. – సీఎస్ శెట్టి, చైర్మన్, ఎస్‌బీఐ
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) రెండో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జూలై– సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం వృద్ధితో రూ. 21,137 కోట్లను తాకింది. యస్ బ్యాంక్‌లో వాటా విక్రయం ద్వారా లభించిన రూ. 4,593 కోట్లు ఇందుకు దోహదపడ్డాయి. స్టాండెలోన్ నికర లాభం సైతం 10 శాతం ఎగసి రూ. 20,160 కోట్లకు చేరింది.
గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 18,331 కోట్లు ఆర్జించింది. కాగా.. రుణాల్లో 12.7 శాతం వృద్ధి నేపథ్యంలోనూ నికర వడ్డీ ఆదాయం 3 శాతమే పుంజుకుని రూ. 42,984 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్లు నామమాత్రంగా 0.17 శాతం బలహీనపడి 2.97 శాతాన్ని తాకాయి. అంచనాలకు అనుగుణంగా పూర్తి ఏడాదికి 3 శాతం మార్జిన్లు సాధించనున్నట్లు బ్యాంక్ చైర్మన్ శెట్టి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వడ్డీయేతర ఆదాయం 30 శాతం జంప్‌చేసి రూ. 19,919 కోట్లకు చేరగా.. మొత్తం ఆదాయం రూ. 1,29,141 కోట్ల నుంచి రూ. 1,34,979 కోట్లకు బలపడింది.
ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేరు బీఎస్‌ఈలో 0.7% లాభంతో రూ. 957 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో రూ. 959 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది.
రుణ నాణ్యత ఓకే
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎస్‌బీఐ స్థూల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు) 2.13 శాతం నుంచి 1.73 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు సైతం 0.53 శాతం నుంచి 0.42 శాతానికి దిగివచ్చాయి. ఇవి గత రెండు దశాబ్దాలలోనే కనిష్టమని శెట్టి వెల్లడించారు. అయితే తాజా స్లిప్పేజీలు రూ. 4,754 కోట్లకు పరిమితమైనప్పటికీ.. మొత్తం ప్రొవిజన్లు రూ. 4,505 కోట్ల నుంచి రూ. 5,400 కోట్లకు పెరిగాయి.
ప్రస్తుతం బ్యాంక్ బ్రాంచీల సంఖ్య 23,050కు చేరగా.. పూర్తి ఏడాదిలో మరో 500 జత చేసుకోనున్నట్లు శెట్టి తెలియజేశారు. జీఎస్‌టీ రేట్ల సవరణల తదుపరి రుణాలకు ప్రధానంగా ఆటో రంగంలో డిమాండ్ భారీగా పుంజుకున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ సెక్యూరిటీలలో రూ. 3.5 లక్షల కోట్ల మిగులు పెట్టుబడులున్నట్లు తెలియజేశారు. వీటికితోడు ఇటీవల సమీకరించిన రూ. 25,000 కోట్ల మూలధనంతో రూ. 12 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేసే వీలున్నట్లు వివరించారు.


