న్యూఢిల్లీ: రిటైల్ రంగ దిగ్గజం ఎవెన్యూ సూపర్‌మార్ట్స్(డీమార్ట్) గత ఆర్థిక సంవత్సరం(2025–26) చివరి త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 19 శాతం ఎగసి రూ. 656 కోట్లను అధిగమించింది.
2024–25 ఇదే కాలంలో రూ. 551 కోట్లు మాత్రమే ఆర్జించింది. ఆదాయం సైతం 19 శాతం బలపడి రూ. 17,684 కోట్లకు చేరాయి. అంతక్రితం క్యూ4లో రూ. 14,872 కోట్ల అమ్మకాలు సాధించింది. మొత్తం వ్యయాలు 19 శాతం పెరిగి రూ. 16,798 కోట్లను తాకాయి. నికర లాభ మార్జిన్లు నిలకడను చూపుతూ 3.7 శాతంగా నమోదయ్యాయి.
మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి డీమార్ట్ స్టోర్ల దిగ్గజం నికర లాభం 10 శాతం వృద్ధితో రూ. 2,970 కోట్లయ్యింది. మొత్తం కన్సాలిడేటెడ్ ఆదాయం 16 శాతం పుంజుకుని రూ. 68,895 కోట్లను తాకింది. క్యూ4లో ప్రారంభించిన 58 కొత్త స్టోర్లతో కలిపి వీటి సంఖ్య 500 మైలురాయికి చేరినట్లు కంపెనీ వెల్లడించింది.


