కృత్రిమ మేధ రంగంలో ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరు కోడింగ్, స్క్రిప్ట్ పరిధిని దాటి సంక్లిష్టమైన శాస్త్రీయ పరిశోధనల వైపు మళ్లింది. దశాబ్దాలుగా ప్రపంచ గణిత మేధావులకు కూడా సవాలుగా నిలిచిన 10 సంక్లిష్టమైన ఓపెన్ మాథ్స్ సమస్యలను తమ తదుపరి తరం మోడల్ అస్ట్రా (Astra) పూర్తిస్థాయిలో సాధించిందని ఓపెన్ ఏఐ సంచలన ప్రకటన చేసింది. అయితే ఈ వార్త వెలువడిన కొద్ది గంటల్లోనే పోటీ సంస్థ ఆంత్రోపిక్ స్పందిస్తూ తమ ‘క్లాడ్ ఫేబుల్’ మోడల్ ద్వారా వాటిలో ఐదు సమస్యలను కేవలం 24 గంటల్లోనే పరిష్కరించామని ప్రకటించి ఏఐ రేసును మరింత వేడెక్కించింది.
ఓపెన్-ఏఐ ప్రచురించిన 249 పేజీల సమగ్ర నివేదిక ప్రకారం.. ‘అస్ట్రా’ మోడల్ గ్రూప్ థియరీ, క్వాంటమ్ కాంప్లెక్సిటీ, ఎక్స్‌ట్రీమల్ కాంబినేటోరిక్స్, స్పియర్ ప్యాకింగ్ డెన్సిటీ వంటి విభాగాల్లో దశాబ్దాలుగా పరిష్కారం కాని 10 సమస్యలను ఛేదించింది.
1999లో మిఖాయిల్ గ్రోమోవ్ ప్రతిపాదించిన 'నాన్-సోఫిక్ గ్రూప్స్' ఉనికిని నిరూపించడంతో పాటు 'కానెస్ రిజిడిటీ కాంజెక్షన్'ను తిరస్కరించింది.
ప్రసిద్ధ గణిత శాస్త్రవేత్త పాల్ ఎర్డోస్ ప్రతిపాదించిన సమస్యలకు స్పష్టమైన ఆధారాలు అందించింది.
కంప్యూటర్ల ద్వారా లైన్-బై-లైన్ తనిఖీ చేయగల లీన్ 4 (Lean 4) డిజిటల్ సర్టిఫికేట్లతో సహా ఈ పరిష్కారాలను గిట్‌హబ్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ మొత్తం ప్రక్రియకు అయిన టోకెన్ కంప్యూటింగ్ వ్యయం కేవలం 2,000 డాలర్లు (సుమారు రూ.1.9 లక్షలు) కావడం గమనార్హం.
ధీటుగా ఆంత్రోపిక్ సవాలు
ఓపెన్-ఏఐ నివేదికపై ఆంత్రోపిక్ రీసెర్చర్ లీవెంట్ అల్పోజ్ స్పందిస్తూ.. ఇప్పటికే అందుబాటులో ఉన్న తమ క్లాడ్ ఫేబుల్ మోడల్ ఎటువంటి ఇంటర్నెట్ సహాయం లేకుండా స్వయంప్రతిపత్తితో ఆ 10 సమస్యల్లో ఐదు సమస్యలను 24 గంటల్లోనే ఛేదించిందని సోషల్ మీడియాలో ఆధారాలు ప్రదర్శించారు.
మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యమనుకున్న అబ్‌స్ట్రాక్ట్ రీజనింగ్ సామర్థ్యాన్ని పొందే దిశగా ఆటోమేటెడ్ ఏఐ ఏజెంట్లు వేగంగా అడుగులు వేస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ గణిత సమాజం ఈ ఆధారాలను పీర్-రివ్యూ ద్వారా అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ సాంకేతిక దిగ్గజాల మధ్య సాగుతున్న ఈ సైంటిఫిక్ పోటీ భవిష్యత్ పరిశోధనల వేగాన్ని సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఖాయమని కొందరు నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: నేటి యువత ఖర్చుల బాట..


