ఫాల్ సెమిస్టర్‌లో పరేషాన్.. ఐ–20 పత్రాల జారీలో వర్సిటీల జాప్యం.. విద్యార్థుల సామాజిక ఖాతాల పరిశీలన తప్పనిసరి
గ్రేస్ పీరియడ్ తగ్గింపుతో మరిన్ని కష్టాలు.. వీసా స్లాట్ల తగ్గింపుతోనూ సమస్యలు.. స్లాట్ల కోసం 70 వేల మంది ఎదురుచూపు
సాక్షి, హైదరాబాద్: యూఎస్ వీసాలు అందక అమెరికా వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థులు అష్టకష్టాలు పడుతున్నారు. విద్యార్థి వీసాల జారీలో యూఎస్ ముప్పు తిప్పలు పెడుతోంది. కొన్ని యూనివర్సిటీలు ఒక వైపున ఐ–20 జారీ చేయడం లేదు. మరోవైపు సెప్టెంబర్ 15లోగా అడ్మిషన్లు పూర్తి చేస్తామని హెచ్చరిస్తున్నాయి. దీంతో విద్యార్థుల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఇంకోవైపు వర్సిటీల నుంచి ఐ–20 లెటర్లు వచి్చన 70 వేల మంది విద్యార్థులకు ఇంత వరకూ వీసా స్లాట్లు బుక్ అవ్వలేదని ఢిల్లీకి చెందిన ఓ కన్సల్టెన్సీ సంస్థ నిర్వాహకుడు తెలిపారు.
స్లాట్లు ఇచ్చి వీసాకు పిలిచినా చిన్నచిన్న కారణాలతోనే వీసా తిరస్కరిస్తున్నారని విద్యార్థులు చెబుతున్నారు. భారత్ నుంచి ఏటా 3.20 లక్షల మంది అమెరికా వెళ్తుంటారు. వీరిలో 1.90 వేల మంది విదేశీ విద్య కోసం వెళ్లేవారే. ఈ సెప్టెంబర్ నుంచి అమెరికాలో ఫాల్ సీజన్ మొదలవుతుంది. ఆగస్టు నుంచే అక్కడ వర్సిటీలు ప్రవేశాలు మొదలుపెడతాయి. విద్యార్థులు ఆరు నెలల ముందే వీసా కోసం సిద్ధమవుతుంటారు.
ఎందుకీ పరిస్థితి?
విద్య కోసం వెళ్లే విద్యార్థులకు అమెరికా ఎఫ్–1 వీసా ఇస్తుంది. ఇది పొందాలంటే ముందుగా యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ లెటర్ ఇవ్వాలి. ఇక్కడే అసలు సమస్య ఎదురవుతోంది. వర్సిటీలపై అమెరికా ప్రభుత్వం రెండేళ్లుగా నిఘా పెంచింది. సవాలక్ష నిబంధనలు తీసుకొచ్చింది. విద్యార్థి నేపథ్యం తెలియకుండా ప్రవేశం కలి్పంచినా, ఆ విద్యార్థి అమెరికా దృష్టిలో చెప్పబడే అసాంఘిక శక్తులతో సంబంధం ఉన్నట్టు తేలినా వర్సిటీపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. దీంతోపాటే చదవు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉండే గ్రేస్ పీరియడ్‌ను 60 నుంచి 30 రోజులకు తగ్గించింది.
నాలుగేళ్ల పీహెచ్‌డీ కోర్సుకు అదనపు అనుమతులు కావాలనే షరతు పెట్టారు. పీహెచ్‌డీ అనుకున్న కాల వ్యవధిలో పూర్తి చేస్తామనే భరోసా తీసుకోవాలనే నిబంధన విధించారు. దీంతో వర్సిటీలు కూడా జాగ్రత్త పడాల్సి వస్తోంది. విద్యార్థులకు సంబంధించిన రికార్డులన్నీ పరిశీలించిన తర్వాతే ఐ–20 పత్రాలు ఇస్తున్నాయి. వీసాలకు ఇది ప్రధాన అడ్డంకిగా మారింది. మరోవైపు వర్సిటీల ప్రవేశాలపై కూడా ఇవన్నీ ప్రభావం చూపుతున్నాయి.
వీసా దగ్గర తిప్పలే
స్టూడెంట్ వీసా తీసుకోవడం కష్టంగానే మారింది. ఐదేళ్లుగా విద్యార్థి ఉపయోగించిన సాషల్ ఖాతాలను ఇమ్మిగ్రేషన్ పరిశీలిస్తోంది. కొన్ని సందర్భాల్లో పబ్లిక్‌గా కనిపించే పోస్టులపైనా వాకబు చేస్తున్నారు. గతంలో కోర్సు పూర్తి చేసిన తర్వాత కొంతకాలం అమెరికాలో ఉండే అవకాశం ఉండేది. ఇలాంటి విద్యార్థులకు వర్సిటీలు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)కి అనుమతించేవి. ఇప్పుడా పరిస్థితి లేదు. దీనికి వర్సిటీలు భయపడుతున్నాయి. కోర్సు పూర్తయిన తర్వాత విద్యార్థి ఎలాంటి చర్యలకు పాల్పడినా వర్సిటీలే బాధ్యత వహించాలనే నిబంధన తెచ్చారు.
దీంతో వర్సిటీలు వెనక్కి తగ్గుతున్నాయి. వీసా సమయంలో ఆర్థిక పత్రాలన్నీ పరిశీలించడానికి ఎక్కువ సమయం పడుతోంది. ప్రతీ విద్యార్థి పత్రాలు క్షుణ్ణంగా పరిశీలించాల్సి రావడంతో వీసా స్లాట్ల సంఖ్య తగ్గిపోతోంది. అమెరికాలో చదువుకునే సమయం, ఆ తర్వాత గ్రేస్ పీరియడ్‌లో నివసించడానికి అవసరమైన మొత్తాన్ని బ్యాంక్ ఖాతాలో విద్యార్థులు చూపిస్తారు. ఈ మొత్తం ఎక్కడ్నుంచీ వచి్చందనేది లోతుగా పరిశీలించిన తర్వాతే వీసాలు ఇస్తున్నారు. మరోవైపు విద్యార్థి ఇంటర్వ్యూ సమయంలో ఏమాత్రం సరైన సమాధానం ఇవ్వలేదని భావించినా వీసా తిరస్కరిస్తున్నారు.
అన్నీ పంపాం.. ఇంకా లెటర్ ఇవ్వలేదు
ఎంఎస్ కోసం యూఎస్ వెళ్లాలని ఏడాదిగా ప్రయత్నాలు చేస్తున్నా. వీసాకు దరఖాస్తు చేశాను. వర్సిటీ ఇంకా ఐ–20 లెటర్ ఇవ్వలేదు. వారిని మెయిల్‌లో సంప్రదిస్తే ఇంకా పరిశీలనలో ఉందంటున్నారు. సెపె్టంబర్ నుంచే అకడమిక్ ఈయర్ మొదలువుతంది. ఆగస్టులో వెళ్తే తప్ప మేం అక్కడ అన్ని ఏర్పాట్లూ చూసుకోలేం.
– వీసం పల్లవి, హైదరాబాద్
రోజుకో సమాచారం అడుగుతున్నారు
అమెరికా యూనివర్సిటీ లెటర్ కూడా వచ్చింది. ఇమ్మిగ్రేషన్ అధికారులు రోజుకో లెటర్ అడుగుతున్నారు. సోషల్ ప్లాట్‌ఫాంలో పెట్టిన సాధారణ పోస్టులపైనా వివరాలు ఇవ్వమన్నారు. బ్యాంకు ఖాతాలోకి వచ్చిన డబ్బులు, మాకు అప్పు ఇచి్చన వారి వివరాలు కోరారు. వారి బ్యాంక్ ఖాతా స్టేట్‌మెంట్ అడిగారు. అప్పు ఇచ్చిన
వారు భయపడుతున్నారు. అసలు అమెరికా వెళ్లగలమా? లేదా? అనే ఆందోళనలో ఉన్నాం. – మహ్మద్ షరీఫ్, వరంగల్


