అంతర్జాతీయ ఐటీ, కన్సల్టింగ్ దిగ్గజం యాక్సెంచర్ తమ ఉద్యోగుల సెలవుల విధానంలో మార్పులు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి వ్యాపారాన్ని, అమ్మకాలను గణనీయంగా పెంచుకోవాలనే లక్ష్యంతో ఉద్యోగులు తమ వద్ద ఉపయోగించకుండా మిగిలివున్న సెలవులను తదుపరి ఆర్థిక సంవత్సరానికి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది.
సాధారణంగా సంస్థ నిబంధనల ప్రకారం ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేలోగా వాడని సెలవులు రద్దవుతాయి. అయితే, ఆగస్టు నెలాఖరుతో కంపెనీ 2026 ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఉద్యోగులు లీవ్‌ల రద్దు భయంతో సెలవులకు వెళ్లకుండా విధుల్లోనే కొనసాగి ప్రాజెక్టులపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించడానికి యాక్సెంచర్ ఈ నిర్ణయం తీసుకుంది.
క్యూ3 దెబ్బకు సీఈఓ హెచ్చరిక
మూడో త్రైమాసికం ఆర్థిక ఫలితాలు అంచనాలను అందుకోలేకపోవడం, దాంతో షేరు విలువ దాదాపు 20 శాతం మేర పడిపోవడమే ఈ వ్యూహాత్మక అడుగుకి ప్రధాన కారణం. ఈ నేపథ్యంలో సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జూలీ స్వీట్ ఉద్యోగులకు పంపిన అంతర్గత మెమోలో కీలక విషయాలను వెల్లడించారు. ‘నాలుగో త్రైమాసికంలో బలమైన ఆర్థిక ఫలితాలను సాధించడంపైనే వాటాదారుల నమ్మకం ఆధారపడి ఉంది. చిన్నవి, పెద్దవి, మెగా డీల్స్ అని తేడా లేకుండా క్లయింట్ల నుంచి నూతన వ్యాపారాన్ని రాబట్టేందుకు ప్రతి ఒక్కరూ శ్రమించాలి’ అని ఆమె పిలుపునిచ్చారు.
కార్పొరేట్ విశ్లేషణ
సాధారణంగా ఆగస్టు చివరి వారాల్లో వేలాది మంది ఉద్యోగులు వార్షిక సెలవులను వాడుకోవడానికి లీవ్‌లో ఉంటారు. ఈ నయా పాలసీతో ఉద్యోగులకు లీవ్‌లను తర్వాత వాడుకునే సడలింపు లభించడంతోపాటు విధులకు హాజరై సేల్స్ పెంచే వాతావరణం ఏర్పడింది. అంతర్జాతీయంగా ఐటీ వ్యయాలపై క్లయింట్లు ఆచితూచి అడుగులు వేస్తున్న తరుణంలో నిర్దేశిత త్రైమాసిక లక్ష్యాలను చేరుకునేందుకు కంపెనీలు పక్కా ప్రణాళికలతో వ్యవహరిస్తున్నాయని యాక్సెంచర్ తాజా నిర్ణయం స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి: పెట్రోల్ వెనుక ఉన్న అసలు నిజాలు


