ఈ ఐటీ కంపెనీలో జీతాల పెంపునకు కొత్త ఫార్ములా.. | Accenture new Salary Hike Policy base pay Bonus | Sakshi
Sakshi News home page

ఈ ఐటీ కంపెనీలో జీతాల పెంపునకు కొత్త ఫార్ములా..

Jun 12 2026 9:40 PM | Updated on Jun 12 2026 9:49 PM

Accenture new Salary Hike Policy base pay Bonus

ప్రపంచ ఐటీ దిగ్గజం యాక్సెంచర్‌ (Accenture) తన ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు చేసింది. ఇకపై వేతన పెంపు మొత్తం బేసిక్‌ పేలో కలపకుండా, దానిని రెండు భాగాలుగా విభజించి అందించనుంది. ఒక భాగం శాశ్వత బేస్‌ పే పెంపుగా ఉండగా, మిగిలిన భాగాన్ని జూన్‌లో ఒకేసారి చెల్లించే లంప్‌సమ్‌ బోనస్‌గా ఇవ్వనుంది. ఈ విధానం ద్వారా ఉద్యోగులకు తక్షణ నగదు ప్రయోజనం కల్పించడంతో పాటు కంపెనీ తన స్థిర వేతన వ్యయాలను నియంత్రించగలదని సంస్థ భావిస్తోంది.

కంపెనీ అంతర్గత సమాచారం ప్రకారం.. ఒక ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే అందులో 1.5 శాతం మాత్రమే బేస్‌ పేలో చేరుతుంది. మిగిలిన 1.5 శాతం జూన్‌లో ఒకసారి చెల్లించే బోనస్‌గా అందుతుంది. అయితే ప్రమోషన్‌ పొందిన ఉద్యోగులకు వర్తించే పెంపు మాత్రం పూర్తిగా బేస్‌ పేలోనే జమ అవుతుంది. అలాగే జూన్‌ లంప్‌సమ్‌ చెల్లింపు డిసెంబరులో ఇచ్చే వార్షిక పనితీరు బోనస్‌కు పూర్తిగా వేరుగా ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది.

యాక్సెంచర్‌లో జూన్‌ నెలే ప్రమోషన్లు, వేతన సవరణలకు ప్రధాన చక్రంగా కొనసాగుతోంది. గత ఏడాది పరిమిత సంఖ్యలో మాత్రమే ‘స్టే-అట్-లెవల్’ ఉద్యోగులకు పెంపు లభించగా, ఈసారి మరింత పెద్ద సంఖ్యలో ఉద్యోగులను పెంపు పరిధిలోకి తీసుకురావాలని సంస్థ నిర్ణయించింది. దీంతో ఎక్కువ మంది ఉద్యోగులు కనీసం కొంత మేర వేతన ప్రయోజనం పొందే అవకాశం ఏర్పడింది.

ఈ నిర్ణయం వెనుక ప్రపంచ ఆర్థిక మందగమనం, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఐటీ సేవల రంగంలో కొనసాగుతున్న ఒత్తిళ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. స్థిర ఖర్చులను అదుపులో ఉంచుతూ ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలబెట్టుకోవడమే లక్ష్యంగా యాక్సెంచర్ ఈ హైబ్రిడ్‌ వేతన విధానాన్ని అమలు చేస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. వేతన నిర్ణయాలు ఉద్యోగుల నైపుణ్యాలు, పనితీరు, వ్యాపారంపై చూపిన ప్రభావం, ప్రవర్తనా ప్రమాణాల ఆధారంగానే కొనసాగుతాయని సంస్థ తెలిపింది.

భారత్‌లో యాక్సెంచర్‌కు సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ఈ కొత్త విధానం వారి వేతన నిర్మాణంపై ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. కొంతమంది ఉద్యోగులు తక్షణ నగదు లాభాన్ని స్వాగతిస్తున్నప్పటికీ, బేస్‌ పే పెరుగుదల పరిమితంగా ఉండటం వల్ల భవిష్యత్‌ వేతన వృద్ధిపై ప్రభావం పడొచ్చనే ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement