సాధారణంగా కార్పొరేట్ ఉద్యోగం అంటేనే టార్గెట్లు, డెడ్‌లైన్లు. ఒక రోజు లీవ్ కావాలన్నా వంద సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి. అలాంటిది, పది రోజుల సుదీర్ఘ సెలవు ముగించుకుని తిరిగి డ్యూటీలో జాయిన్ అవుతానని మెసేజ్ చేసిన ఉద్యోగికి.. ‘కంగారేం లేదు, పరిస్థితులు సర్దుకోవడానికి మరో రోజు సెలవు తీసుకో’ అంటూ ఓ బాస్ ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉద్యోగుల మానసిక పరిస్థితికి పెద్దపీట వేసే ఇలాంటి మేనేజర్లు కూడా ఉంటారా అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో ఒక సంస్థలో పని వాతావరణం, ఉద్యోగుల ప్రవర్తన, యాజమాన్యం తీరు ఎలా ఉండాలో ఈ కింది విధంగా విశ్లేషించవచ్చు.
యాజమాన్యం, మేనేజర్ల పాత్ర
ఈ సంఘటనలో మేనేజర్ చూపిన చొరవ కేవలం ఒక అదనపు సెలవు ఇవ్వడం మాత్రమే కాదు; అది ఉద్యోగి మానసిక ఆరోగ్యానికి ఇచ్చిన విలువ. యాజమాన్యం, నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు కింది విషయాలను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
మానవత్వంతో కూడిన నాయకత్వం: నియమ నిబంధనలను పక్కన పెట్టి ఉద్యోగి పరిస్థితిని అర్థం చేసుకోవడమే నిజమైన నాయకత్వం.
మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యత: ఉద్యోగులు శారీరకంగానే కాకుండా మానసికంగా ప్రశాంతంగా ఉన్నప్పుడే మెరుగైన ఫలితాలు ఇవ్వగలరు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత వచ్చే అలసటను గుర్తించి స్థిరపడటానికి సమయం ఇవ్వడం ద్వారా మేనేజర్ ఉద్యోగిపై ఉన్న ఒత్తిడిని పూర్తిగా తగ్గించగలిగారు.
నమ్మకాన్ని నిర్మించడం: నిరంతరం పర్యవేక్షించడం కంటే ఉద్యోగులపై నమ్మకం ఉంచడం వల్ల వారు సంస్థ పట్ల మరింత నిబద్ధతతో పనిచేస్తారు.
ఆరోగ్యకరమైన పని వాతావరణం అనేది సంస్థ విజయానికి పునాది. కంపెనీల పని వాతావరణం ఇలా మారాలో కూడా నిపుణులు చెబుతున్నారు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్: వ్యక్తిగత జీవితానికి, వృత్తిపరమైన జీవితానికి మధ్య సమతుల్యత ఉన్నప్పుడే ఉద్యోగి ఎక్కువ కాలం ఆ సంస్థలో కొనసాగుతాడు.
సహకార సంస్కృతి: ఒకరినొకరు వేధించుకునే వాతావరణం కాకుండా ఒకరికొకరు మద్దతుగా నిలిచే వాతావరణం ఉండాలి. నియమాలు ఉద్యోగులను నియంత్రించడానికి మాత్రమే కాదు, వారి పనిని సులభతరం చేయడానికి ఉపయోగపడాలి.
గౌరవప్రదమైన గుర్తింపు: కేవలం కంపెనీ రికార్డుల్లో ఐడీ నంబర్‌గా కాకుండా ప్రతి ఉద్యోగికి ఒక ప్రత్యేక గుర్తింపు, విలువ ఉన్నాయనే భావన కల్పించాలి.
ఉద్యోగుల బాధ్యత ఇదే..
యాజమాన్యం లేదా మేనేజర్లు ఉదారంగా ఉన్నప్పుడు ఉద్యోగులపై కూడా అంతే బాధ్యత పెరుగుతుంది. మేనేజర్ చూపిన చొరవను ఆసరాగా తీసుకుని బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించకూడదు. లభించిన స్వేచ్ఛను సద్వినియోగం చేసుకోవాలి. ‘ఇలాంటి మేనేజర్ల నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి కష్టపడి పనిచేయాలి’ అని ఒక నెటిజన్లు చెబుతున్నారు. యాజమాన్యం పరిస్థితులను అర్థం చేసుకున్నప్పుడు సంస్థ వృద్ధి కోసం ఉద్యోగి తన శాయశక్తులా కృషి చేయాలి. తాము ఎప్పుడు వస్తున్నదీ, పని ఏ స్థితిలో ఉన్నదీ మేనేజర్‌కు ముందుగానే తెలియజేయడం ద్వారా ఉద్యోగులు కూడా తమ వృత్తిపరమైన బాధ్యతను చాటుకోవాలి.
ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు


