బ్లూకాలర్‌ బూమ్‌! | AI Adoption Boosts Demand for Skilled Blue-Collar Workers | Sakshi
Sakshi News home page

బ్లూకాలర్‌ బూమ్‌!

Aug 22 2026 5:33 AM | Updated on Aug 22 2026 5:33 AM

AI Adoption Boosts Demand for Skilled Blue-Collar Workers

ఏఐ దూకుడుతో వృత్తి నిపుణులకు బంగారు భవిష్యత్తు 

ఎల్రక్టీషియన్లు, రోబోటిక్స్‌ టెక్నీషియన్లకు భారీ డిమాండ్‌ 

2022–26 మధ్య బ్లూకాలర్‌ ఉద్యోగాల వృద్ధి 93 శాతం 

ఎంట్రీ లెవెల్‌ వైట్‌ కాలర్‌  ఉద్యోగాల కంటే వేగంగా పెరుగుతున్న వేతనాలు

ఒకప్పుడు డిగ్రీ ఉంటేనే భవిష్యత్‌ అనేవారు. ఇప్పుడు నైపుణ్యం ఉన్నవారికే భవిష్యత్‌ అనే కొత్త వాస్తవం రూపుదిద్దుకుంటోంది. ఏఐ యుగంలో ఉద్యోగాలు అంతరించిపోవడం కాదు, వాటి స్వరూపం మారుతోంది. కంప్యూటర్‌ను ఆదేశించే వ్యక్తికన్నా ఆ కంప్యూటర్‌ పనిచేసే వ్యవస్థను నిర్మించే, నిర్వహించే ఎలక్ట్రీషియన్, టెక్నీషియన్, రోబోటిక్స్‌ నిపుణులే రేపటి ఉద్యోగ మార్కెట్‌లో అత్యంత విలువైన వ్యక్తులుగా నిలవనున్నారు.     

కృత్రిమ మేధ (ఏఐ) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ మరో కీలక పరిణామం నిశ్శబ్దంగా చోటుచేసుకుంటోంది. కంప్యూటర్‌ ముందు కూర్చునే ఉద్యోగాలకంటే చేతివృత్తులు, సాంకేతిక నైపుణ్యాలున్న బ్లూకాలర్‌ ఉద్యోగాలకు ఇప్పుడు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. ఎల్రక్టీషియన్స్, ప్లంబర్లు, రోబోటిక్స్‌ టెక్నీషియన్లు, హెచ్‌వీఏసీ నిపుణులు, యంత్రాల నిర్వహణ సిబ్బంది వంటి వృత్తి నిపుణుల కోసం కంపెనీలు పోటీ పడుతున్నాయి. ఏఐ విప్లవం వెనక అసలు బలం మానవ నైపుణ్యాలేనని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. 

ఏఐకి వెన్నెముకగా బ్లూకాలర్‌ ఉద్యోగాలు 
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, డేటా సెంటర్లు, ఆటోమేటెడ్‌ ఫ్యాక్టరీలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఇవన్నీ సక్రమంగా పనిచేయాలంటే భారీ విద్యుత్‌ వ్యవస్థలు, శీతలీకరణ యంత్రాంగం, రోబోటిక్‌ పరికరాలు, నిర్వహణ సిబ్బంది అవసరం. అందుకే ఎల్రక్టీషియన్లు, మెకానిక్‌లు, వెల్డర్లు, ప్లంబర్లు, రోబోటిక్స్‌ నిపుణుల అవసరం ప్రపంచవ్యాప్తంగా గణనీయంగా పెరుగుతోంది. టాలెంట్‌ సంస్థ రాండ్‌స్టాడ్‌ విశ్లేషణ ప్రకారం 5 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను పరిశీలించి విశ్లేషించగా గత నాలుగేళ్లలో ఎలక్ట్రిషియన్ల డిమాండ్‌ 242%, హెచ్‌వీఏసీ టెక్నీషియన్ల డిమాండ్‌ 200%, రోబోటిక్స్‌ టెక్నీషియన్ల అవసరం గణనీయంగా పెరిగినట్లు తేలింది. 

93 శాతం ఉద్యోగాల పెరుగుదల 
2022 నుంచి 2026 మధ్య కాలంలో భారత దేశంలో బ్లూకాలర్‌ ఉద్యోగాల సంఖ్య 93% పెరిగింది. అదే సమయంలో వైట్‌ కాలర్‌ ఉద్యోగాల వృద్ధి 40% వద్దే నిలిచింది. ఇది దేశ కారి్మక మార్కెట్లో పెద్ద మార్పునకు సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటివరకు డిగ్రీ, ఐటీ ఉద్యోగాలకే ప్రాధాన్యం ఉండేది. కానీ ప్రస్తుతం పరిశ్రమలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, డేటా సెంటర్లు, సెమీకండక్టర్‌ యూనిట్లు, ఎలక్టిక్‌ వెహికిల్‌ (ఈవీ) తయారీ కేంద్రాలు పెరగడంతో సాంకేతిక నైపుణ్యాలున్న కార్మికుల అవసరం మరింత పెరిగింది. 

వేతనాల్లోనూ బ్లూకాలర్‌ ఆధిక్యం 
ఉద్యోగాల్లోనే కాదు వేతనాల్లో కూడా బ్లూకాలర్‌ ఉద్యోగులు ముందంజలో ఉన్నారు. బ్లూకాలర్‌ ఉద్యోగుల జీతాలు ఏటా సగటున 5.7 శాతం పెరుగుతున్నాయి. ఎంట్రీ లెవెల్‌ వైట్‌ కాలర్‌ ఉద్యోగాల్లో పెరుగుదల 4 శాతం మాత్రమే నమోదైంది. రోబోటిక్స్‌ నిర్వహణ, ప్రత్యేక యంత్రాల మెయింటినెన్స్‌ మెకానిక్‌ల వార్షిక వేతనం సగటున రూ. 8లక్షలకు పైగా ఉండగా ప్లాంట్‌ ఆపరేటర్లు రూ.7 లక్షలు, నిర్మాణ రంగ సిబ్బంది రూ.5 లక్షలు, ఎల్రక్టీషియన్లు సుమారు రూ.3 లక్షలకుపైగా సంపాదిస్తున్నారు. దీనికి విరుద్ధంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు, జూనియర్‌ అకౌంటింగ్‌ వంటి ఎంట్రీ లెవెల్‌ ఉద్యోగాల్లో వేతనాలు తక్కువగా ఉండడమే కాకుండా వారిపై ఆటోమేషన్‌ ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తోంది. 

భారత్‌కు డబుల్‌ ధమాకా 
అమెరికా, యూరప్‌ వంటి దేశాల్లోని కంపెనీల్లో కార్యాలయ ఉద్యోగాలు తగ్గుతున్నప్పటికీ భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. ఒకవైపు బ్లూకాలర్‌ ఉద్యోగాలు వేగంగా పెరుగుతుండగా, మరోవైపు వైట్‌ కాలర్‌ రంగంలోనూ 40 శాతం వృద్ధి నమోదవుతోంది.అయితే భవిష్యత్తులో డేటా ఎంట్రీ, ప్రాథమిక అకౌంటింగ్, సాధారణ పరిపాలనా ఉద్యోగాలపై మాత్రం ఏఐ ప్రభావం ఉండొచ్చని హెచ్చరికలు వినిపిస్తున్నాయి. రాండ్‌స్టాండ్‌ సీఈఓ విశ్వనాధ్‌ పీఎస్‌ అభిప్రాయం ప్రకారం ‘ ప్రతి ఏఐ ఆవిష్కరణ వెనక ఒక భౌతిక వ్యవస్థ ఉంటుంది. విద్యుత్‌ గ్రిడ్లు అప్‌ గ్రేడ్‌ కావాలి, కూలింగ్‌ సిస్టమ్‌లు నిర్మించాలి, ఫ్యాక్టరీలు ఆటోమేట్‌ కావాలి, ప్రతి స్మార్ట్‌ యంత్రం వెనక అత్యంత నైపుణ్యం కలిగిన మనుషులే ఉంటారు.

బ్లూకాలర్‌కి డిమాండ్‌ ఎందుకు? 
ఏఐ అంటే కేవలం సాఫ్ట్‌వేర్‌ మాత్రమే కాదు, దానికి భారీ మౌలిక సదుపాయాలు అవసరం. ఉదాహరణకు డేటా సెంటర్లకు అధిక విద్యుత్‌ సరఫరా అవసరం  సర్వర్లను చల్లబరిచేందుకు భారీ హెచ్‌వీఏసీ(హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్‌ కండిషన్‌) వ్యవస్థలు కావాలి. తయారీ రంగంలో రోబోట్ల వినియోగం పెరుగుతోంది. ఈవీ పరిశ్రమల్లో ఆటోమేటెడ్‌ అసెంబ్లీ లైన్లు విస్తరిస్తున్నాయి స్మార్ట్‌ ఫ్యాక్టరీ నిర్వహణకు ప్రత్యేక నైపుణ్యాలున్న వ్యక్తుల అవసరం విపరీతంగా పెరుగుతోంది.అందువల్ల ఏఐ ఎంత అభివృద్ధి చెందినా వాటిని నిర్మించే, నిర్వహించే, మరమ్మతులు చేసే మానవ నైపుణ్యం అవసరం అంతే స్థాయిలో పెరుగుతోందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement