ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం! | AI Was Meant to Make Work Easier but Developers Say It Is Making Work Harder | Sakshi
Sakshi News home page

ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం!

Aug 18 2026 1:01 PM | Updated on Aug 18 2026 1:16 PM

AI Was Meant to Make Work Easier but Developers Say It Is Making Work Harder

ఏఐ వస్తే ఉద్యోగుల పని తగ్గిపోతుందని.. రోజుకు గంటల తరబడి చేసే రొటీన్‌ పనుల నుంచి విముక్తి లభిస్తుందని టెక్‌ ప్రపంచం ఊదరగొట్టింది. కానీ కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు చెబుతున్నారు. పని వేగంగా పూర్తవుతున్నా.. అదే సమయంలో మరింత పని అప్పగిస్తున్నారని, ఏఐ వల్ల పని గంటలు తగ్గకపోగా ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.

2023లో మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌.. భవిష్యత్తులో ఏఐ, యంత్రాల సాయంతో వారానికి మూడు రోజులే పని చేసే పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. సిలికాన్‌ వ్యాలీలోనూ ఇదే తరహా ఆశావహ అంచనాలు వినిపించాయి. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లు ఏఐ సాయంతో రొటీన్‌ పనులను త్వరగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని సృజనాత్మక, కీలకమైన పనులకు కేటాయించవచ్చని ప్రచారం జరిగింది.

కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఏఐతో పని త్వరగా పూర్తవుతున్న కొద్దీ.. ఉద్యోగుల నుంచి అంతకంటే ఎక్కువ పని చేయాలని సంస్థలు ఆశిస్తున్నాయని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. అంటే పని తగ్గించాల్సిన ఏఐ.. అదే సమయంలో పనిని పెంచే సాధనంగా మారిపోయిందన్నమాట.

‘అదే 9 గంటలు.. కానీ పని ఎక్కువ’
ఓ ప్రముఖ టెక్‌ కంపెనీలో పనిచేస్తున్న శుభమ్‌ మాట్లాడుతూ.. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పని గంటలు మాత్రం తగ్గడం లేదని చెప్పారు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతున్నందున.. అదే వ్యవధిలో మరిన్ని పనులు అప్పగిస్తున్నారని తెలిపారు.

బెంగళూరుకు చెందిన సీనియర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ అంకిత అనుభవం మరింత భిన్నంగా ఉంది. ఏఐ వల్ల ఒక పని సగం సమయంలో పూర్తవుతుందని మేనేజ్‌మెంట్‌ భావిస్తోందని.. దీంతో పని తగ్గడానికి బదులుగా లక్ష్యాలు పెరుగుతున్నాయని ఆమె చెబుతున్నారు. “ఏఐ ఉంటే పని 30 శాతం సమయంలోనే పూర్తవ్వాలి. కాబట్టి అదే సమయంలో మరింత పని చేయాలని మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది” అని ఆమె వివరించారు.

15-16 గంటల పని..
ఏఐ వల్ల తన పని భారం గతంలో కంటే పెరిగిందని అంకిత చెబుతున్నారు. గత మూడు నెలలుగా రోజుకు 15-16 గంటలు పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి తోడు సంస్థలో ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లకు హాజరుకావాల్సి వస్తోందని చెప్పారు.

అంటే.. ఏఐని ఉపయోగించడం నేర్చుకోవడానికి కూడా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత మిగిలిన సమయంలో సాధారణ పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అంటున్నారు.

ఏఐ వాడండి.. కానీ టోకెన్లు పరిమితమే!
మరో విచిత్రమైన పరిస్థితి కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని మేనేజ్‌మెంట్లు కోరుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు ఏఐ టూల్స్‌ వినియోగానికి పరిమితులు విధిస్తున్నాయి.

అంకిత పనిచేసే సంస్థలో నెలకు 250 డాలర్ల విలువైన ఏఐ టోకెన్లను మాత్రమే అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. నెల మధ్యలోనే ఆ పరిమితి పూర్తయిపోతే.. ఏఐ సరిగా పనిచేయలేదని మేనేజ్‌మెంట్‌ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏఐతో ఎక్కువ పని చేయాలి.. కానీ దానికి అవసరమైన ఏఐ వనరులు మాత్రం పరిమితమే అనే పరిస్థితి ఉద్యోగులకు కొత్త తలనొప్పిగా మారింది.

ఏఐ చేసిన పని.. మళ్లీ మనమే సరిచేయాలి!
ఏఐ కేవలం సాఫ్ట్‌వేర్‌ రంగానికే పరిమితం కాలేదు. గ్రాఫిక్‌ డిజైనర్ల వంటి ఇతర రంగాల్లోనూ దీని వినియోగం పెరిగింది. అయితే ఏఐ ఇచ్చిన ఫలితం ప్రతిసారీ కచ్చితంగా ఉండదని డిజైనర్లు చెబుతున్నారు. ఏఐతో పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ.. తప్పులు వస్తే వాటిని గుర్తించి మాన్యువల్‌గా సరిచేయాల్సి వస్తోంది. దీంతో ఏఐ పని తగ్గించిందా? లేక పని చేసే విధానాన్ని మాత్రమే మార్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అమెజాన్‌ లాజిస్టిక్స్‌లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఓ ఉద్యోగి తెలిపారు. దెబ్బతిన్న ప్యాకేజీలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉన్న ప్యాకేజీగా చూపిస్తోందని.. అప్పుడు మనుషులే మళ్లీ తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు.

అయితే ఏఐ నిజంగా పనికిరాదా?
అలా అని అందరూ ఏఐని వ్యతిరేకించడం లేదు. తెలివిగా ఉపయోగించగలిగితే ఏఐతో పని భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు ఉద్యోగులు అంటున్నారు. అయితే ఏఐనే మొత్తం పనిని చేసేస్తుందని భావిస్తే.. తప్పులను సరిచేయడం, ఫలితాలను తనిఖీ చేయడం వంటి అదనపు పనులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇదంతా చూస్తే.. ఏఐపై మొదట్లో చేసిన ‘తక్కువ పని.. ఎక్కువ విశ్రాంతి’ అంచనాలు ఇప్పటివరకు నిజం కాలేదనే చెప్పాలి. పైగా ఏఐతో ఉత్పాదకత పెరిగే కొద్దీ ఉద్యోగులపై సంస్థల అంచనాలు కూడా పెరుగుతున్నాయి.

మూడు రోజుల వర్క్‌వీక్‌ ఎక్కడ?
ఏఐ కారణంగా భవిష్యత్తులో వారానికి మూడు రోజులే పనిచేసే పరిస్థితి రావచ్చన్న బిల్‌గేట్స్‌ అంచనాలకు భిన్నంగా.. ఏఐ యుగంలో మనుషులు మరింత బిజీగా మారొచ్చని ఓపెన్‌ఏఐ సీఈవో సామ్‌ ఆల్ట్‌మన్‌ ఇటీవల వ్యాఖ్యానించారు.

సూపర్‌ ఇంటెలిజెన్స్‌ వచ్చిన తర్వాత కూడా మనుషులు మరింత బిజీగా ఉంటారని.. ఎందుకంటే ఏఐతో సామర్థ్యం పెరిగే కొద్దీ మన అంచనాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. ప్రస్తుత పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ పని తగ్గిస్తుందని వచ్చింది.. కానీ పని చేసే వేగాన్ని పెంచి, చేయాల్సిన పనినే మరింత పెంచేసిందన్నమాట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement