భక్త విజయం
పూర్వం హైహయ వంశానికి చెందిన కృతవీర్యుడు అనే రాజు ఉండేవాడు. అతడు అమిత బలసంపన్నుడు, ధర్మపరాయణుడు. అతడి భార్య సుగంధి. సంపదలకు లోటు లేకున్నా, వారికి సంతానమే లేదు. సంతాన ప్రాప్తికి వారు చేయని వ్రత, దాన, యజ్ఞ యాగాలు లేవు. ఎన్ని చేసినా, పురాకృత పాపఫలితంగా వారికి సంతానం కలగలేదు.
సంతాన రాహిత్యంతో రాజదంపతులు నిరాశలో కూరుకుపోయారు. రాజ్యాన్ని, సంపదను అమాత్యులకు విడిచి, తపోనిష్ఠతో కాలం గడపడానికి అడవులకు బయలుదేరారు. అడవులలో వారు కఠిన నియమాలను పాటిస్తూ, తపోనిష్ఠలో కాలం గడపసాగారు. కేవలం చెట్ల నుంచి రాలిన ఆకులను మాత్రమే ఆహారంగా స్వీకరిస్తుండటంతో కృశించిపోయారు. వారు ధ్యానంలో ఉన్నప్పుడు వారి శరీరాలను క్రిమి కీటకాదులు తినేయసాగాయి. కొన్నాళ్లకు రాజదంపతులు శల్యావశిష్టులుగా మిగిలారు.
ఒకనాడు గగనమార్గాన పోతున్న త్రిలోక సంచారి నారద మహర్షి కృతవీర్య దంపతుల పరిస్థితిని గమనించాడు. ఆయన వెంటనే పితృలోకానికి చేరుకుని, అక్కడ కృతవీర్యుడి తండ్రి వద్దకు వెళ్లి, ‘మర్త్యలోకంలో నీ కొడుకు, కోడలు సంతానం కోసం అలమటిస్తూ, తపశ్చర్యలో నిమగ్నులై, శల్యావశిష్టులుగా మిగిలారు. వారి పరిస్థితి నేడో రేపో అన్నట్లుగా ఉంది.’ అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాడు.
దారిలో నారదుడికి ఒక దారుణ దృశ్యం కనబడింది. భృంశ మహర్షి తల్లిదండ్రులు, బంధువులు కుంభీపాక నరకంలో అధోముఖులై వేలాడుతూ, యమభటుల దండనలకు తాళలేక హాహాకారాలు చేస్తున్నారు. ఈ దృశ్యం చూసి, నారదుడు విచలితుడయ్యాడు. వెంటనే, భృంశుడి వద్దకు వెళ్లాడు. ‘మహర్షీ! నువ్వు సాక్షాత్తు సర్వజ్ఞుడవు. సాక్షాత్తు గణేశ సమానుడవు. కపిలాది మహర్షులు నీ దర్శనం కోరి వస్తుంటారు. అలాంటి నీ తల్లిదండ్రులు, బంధువులు నరకంలో యమబాధలు అనుభవిస్తుండటం బాధ కలిగిస్తోంది. నీ పూర్వుల నరక విమోచనం కోసం చేయదగిన పరిహారం ఏదైనా ఉంటే, నువ్వు ఉపేక్షించక దానిని వెంటనే ఆచరించు’ అని పలికాడు.
నారదుడి ద్వారా తన పితరుల బాధలు తెలుసుకున్న భృంశుడు చింతాక్రాంతుడై, కొద్దిసేపు ఆలోచించాడు. తాను ఏళ్లతరబడి ఆచరిస్తూ వచ్చిన సంకష్టహర చతుర్థి వ్రతఫలంలో ఒకరోజు వ్రతఫలాన్ని ససంకల్పితంగా తన పితరులకు ధారపోశాడు. అతడు తన వ్రతఫలాన్ని ధారపోసిన వెంటనే భృంశుడి పితరులందరూ నరక కూపం నుంచి విముక్తి పొందారు. దేవతలు తీసుకువచ్చిన దివ్యవిమానంలో వారందరూ స్వర్గానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, నారదుడి ద్వారా తన కుమారుడి పరిస్థితి తెలుసుకున్న కృతవీర్యుడి తండ్రి బ్రహ్మలోకానికి వెళ్లి, ‘బ్రహ్మదేవా! నా కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకపోవడం వల్ల తపోనిష్ఠలో శల్యావశిష్టుడిగా మిగిలాడు. నా కుమారుడి సంతానలేమికి కారణమేమిటి? అతడి పురాకృత పాపకర్మ నశించడానికి తగిన తరుణోపాయమేది? నువ్వే చెప్పాలి’ అని అడిగాడు.
‘నీకు నీ తనయుడి పూర్వజన్మ విశేషాలు చెబుతాను, విను. నీ రాజ్యంలోనే సామ అనే దుష్టుడు ఉండేవాడు. అతడు నిష్కారణంగా పన్నెండుమంది బ్రాహ్మణులను వధించి, వారి మృతదేహాలను ఒక కొండగుహలో పారవేశాడు. ఒకనాడు అతడికి పొద్దుగూకే వరకు ఎక్కడా తిండి, నీళ్లు దొరకలేదు. అలసి సొలసి పొద్దు గూకిన తర్వాత ఇంటికి చేరుకున్న మరుక్షణమే, తన కొడుకును ‘గణేశా! గణేశా!’ అని పిలిచాడు. కొడుకుతో కలసి భోజనం చేశాడు. సామకు తెలియకున్నా, ఆరోజు మాఘ కృష్ణ చతుర్థి. మరికొన్నాళ్లకు అదే తిథినాడు సామ కాలధర్మం చెందాడు. సంకష్టహర చతుర్థినాడు తెలియక చేసిన పుణ్యఫలితంగా మరణానంతరం స్వర్గానికి చేరుకున్నాడు. ఆ పుణ్యశేషం వల్లనే నీకు కొడుకుగా పుట్టాడు. పురాకృత పాపకర్మ మిగిలి ఉండటం వల్ల అతడికి సంతానం కలగలేదు’ అని బ్రహ్మదేవుడు చెప్పాడు.
‘విరించీ! పాపాకర్మ పరిహారానికి తరుణోపాయమేమిటో నువ్వే చెప్పు’ అడిగాడు కృతవీర్యుడి తండ్రి.
‘సంకష్టహర చతుర్థి వ్రతాన్ని నియమానుసారం ఆచరిస్తే, అతడికి పాప విముక్తి కలుగుతుంది’ అని చెప్పి, వ్రత విధానాన్ని వివరించాడు బ్రహ్మదేవుడు.
బ్రహ్మదేవుడి ద్వారా సంకష్టహర వ్రత విధానాన్ని తెలుసుకున్న అతడు తన కొడుకు వద్దకు చేరుకుని, ‘కృతవీర్యా! పురాకృత పాపకర్మ ఫలితంగానే నీకు సంతానం కలగలేదు. సంకష్టహర చతుర్థివ్రతం ఆచరించినట్లయితే, నీకు పాపవిమోచనం కలిగి, సంతానం కలుగుతుంది’ అని చెప్పి, బ్రహ్మదేవుడు చెప్పిన వ్రత విధానాన్ని బోధించాడు.
కృతవీర్యుడు పత్నీసహితంగా నియమానుసారంగా సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించాడు. అతడి పాపకర్మ నశించింది. కొన్నాళ్లకు కృతవీర్యుడి భార్య సుగంధి గర్భం దాల్చింది. నెలలు నిండాక ఆమెకు పండంటి కొడుకు పుట్టాడు. అయితే, అతడికి చేతులు లేవు. పెరిగి పెద్దయ్యాక అతడు తీవ్ర తపస్సుతో దత్తాత్రేయుడిని ప్రసన్నం చేసుకుని, సహస్రబాహువులు పొందాడు. సహస్రబాహు అర్జునుడిగా, కార్తవీర్యార్జునుడిగా పేరు పొందాడు.
- సాంఖ్యాయన
ఇవి చదవండి: ఒకనాటి ఆదివారం


