నోస్టాల్జియా
హైదరాబాద్‌లో ఆదివారం కూడా ఒక ఆదివారమా? దాని ఆయుష్షు ఆరేడు గంటలకు మించి ఉండదు. బద్దకంగా లేచామా... స్విగ్గిలో ఆర్డర్ పెట్టామా... తిని చేయి కడిగి ఫోన్ చూసుకునేలోపు సోమవారం వచ్చేస్తుంది. ఆదివారం సాయంత్రం నుంచే సోమవారం వచ్చేస్తుంది. సాయంత్రపు చీకటి నుంచే మరుసటి రోజు గుబులు, దిగులు చుట్టుముడుతుంది. ఆదివారం మజా అంటే అదా?
అసలు ఒకప్పటి ఆదివారాలు ఎలా ఉండేవి? 1980ల కాలపు ఆదివారం... చిన్నప్పటి ఆదివారం... కేలండర్‌లో ఎర్ర రంగుతో ఊరించే ఆదివారం... అప్పట్లో ఒక్కో ఆదివారం 36 గంటల సేపైనా ఉండేది. వారానికి సరిపడా ఊపిరి పోసేది. పిల్లా జెల్లా ఊరు వాడా అందరూ ఆదివారం కోసం ఎదురుచూసే వారు. ఆదివారం వస్తే ఊరు బంద్. వినోదం విడుదల.
ఆదివారం వస్తే టీ కొట్లు, దోసెల బండ్లు కిటకిటలాడేవి. తీరుబడిగా పేపర్ చదువుతూ ఆ వారమంతా ఊళ్లో జరిగిన విశేషాలపై వ్యాఖ్యానాలు వినిపించేవి. మధ్యాహ్నం మటనో చికెనో వొండాలి కాబట్టి అమ్మకు టిఫిన్ బరువు వేయకుండా దోసెలు తెచ్చుకుంటే ఆ చట్నీకి స్వర్గం చచ్చుకుంటూ కనిపించేది. ఫలానా చోట వేట కోసి కువ్వలు పోస్తే కూరకు పోయేవాడొకడు. సైకిల్‌కి కోడిని కట్టేసి ఇంటికి పట్టుకుపోతూ ఒకడు. పేకాట ΄్లాన్‌లో ఉండే మగాళ్ల బాడీ లాంగ్వేజ్‌ను ఏ ఎక్స్‌పర్టూ కూడా కనిపెట్టలేడు. అల్లం వెల్లుల్లి మానవజాతి కోసం త్యాగం చేసే రోజు అది. పచ్చి కొబ్బరి నూరే శబ్దానికి మించి ఇళయరాజా ట్యూన్ ఉంటుందా? ఆ రోజు ఉదయం నుంచే రేడియోను ధారాళంగా పెట్టొచ్చు. సరే... టీవీలో భారతం రావడానికి టైమ్ ఉండనే ఉంది.
ఆదివారం రోజు పిల్లలందరూ ఎవరూ చెప్పకనే యోగాసనాలు వేసి హెల్త్‌ను బెటర్ చేసుకునేవారు. గోలీ ఆసనం, బొంగరం ఆసనం, కర్రాబిళ్ల ఆసనం, సైకిల్ తొక్కే ఆసనం, ఊరి నాలుగు దిక్కుల్లో ఉన్న నలుగురు బంధువుల దగ్గరకు నడకాసనం వేస్తూ వెళ్లి సాయంత్రం ఫస్ట్‌షోకు సరిపడా చిల్లర సమకూర్చుకునే ఆసనం.... పనులకు విరామం ఇచ్చి ఇళ్లల్లో ఉండే మగవాళ్లు సుష్టుగా భోం చేసి కునుకుకు ఉపక్రమిస్తే ఆడవాళ్లు బ్యాటరీ రేడియోతో పెరట్లో చేరి మధ్యాహ్నం మూడు గంటల నాటకాన్ని పేలు చూసుకుంటూ, గోరింటాకు పెట్టుకుంటూ, జ్యోతిచిత్రలో జయసుధ కట్టుకున్న చీరను పరీక్షిస్తూ వినేవారు.
సాయంత్రం ఐదుగంటలకు సైకిలేసుకొని బాబాయి వచ్చేవాడు. లేకపోతే రిక్షాలో మేనత్తా మేనమామ వచ్చేవారు. కాదంటే నడుచుకుంటూ పిన్ని వచ్చేసేది. మరి ఆదివారం వచ్చేది బంధువులు కలవడానికేగా. ఊళ్లు చిన్నవి. మనసులు పెద్దవి. దూరాలు కురచవి. మనుషులకు మాటలే మత్తు పదార్థాలుగా ఉండేవి. అందరి కాపురాల ప్రసారం ప్రతి ఒక్కరి రిపోర్టింగ్‌లో అందరికీ తెలిసేది.
కొట్లు మూసేసిన ఊరిలో సాయంత్రాలు పని లేకుండా నడవడం ఒక వింత. సినిమా హాళ్ల దగ్గర తప్ప ఇంకెక్కడా మనుషులుండరు. బాల్కనీ టికెట్లు ముందే తెచ్చుకున్న కుటుంబాలు స్నానాలు చేసి మంచి బట్టలు కట్టుకుని బింకంగా నడుచుకుంటూ పోతుంటే వాళ్లు సినిమాకు వెళుతున్నారని అందరికీ తెలిసిపోయేది. ‘ఎలా ఉంటే అలా’ అవతారాలతో దొరికిన సినిమాకు దూసుకెళ్లే శాల్తీల దూకుడూ స్పెషలే. ఇవన్నీ పట్టని వారికి సాయంత్రం టీవీలో పాత సినిమా చుక్కలు చుక్కలుగా వచ్చినా చక్కగా అర్థమయ్యేది.
ఆదివారం వస్తే పిల్లలు ఆడే ఆ ఎర్ర మట్టి వీధులు, మనుషుల రాకకై తెరిచి పెట్టే ఆకుపచ్చ తలుపులు, ఆ అరుగు కబుర్లు, ఆ యాంటెన్నా కోసం అరిచిన అరుపులు... వాటిలో తిప్పలు ఉన్నా జ్ఞాపకాలు ఉన్నాయి. ఇవాళ్టి ఆదివారాలు ఏ జ్ఞాపకాలు మిగల్చని శుష్కమైన ఆదివారాలు. జీవితంలో వెలుగులు పెరిగాయి, వసతులు పెరిగాయి, జీతాలు వేలల్లో నుంచి లక్షల్లోకి పెరిగాయి.
కానీ ఈ ఆదివారం భలే గడిచింది అనే మాట తక్కువగా వినిపిస్తోంది. గత కాలము మేలు వచ్చు కాలము కంటే అంటే ఇదేనా? ఓ ఆదివారమా... నువ్వు తెచ్చే విశ్రాంతికీ వినోదానికీ కూడా రాజీనామా చేసే బతుకును బతుకుతున్నామా?
అవును. పసిడి రెక్కలు విసిరి కాలం పారిపోయింది.


