నిమజ్జనానికి హైదరాబాద్‌ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు! | Hyderabad Ganesh Nimajjanam Massive Arrangements Across Three Municipal Corporations | Sakshi
Sakshi News home page

నిమజ్జనానికి హైదరాబాద్‌ సిద్ధం.. 47 చెరువుల్లో ఏర్పాట్లు!

Sep 8 2026 5:35 AM | Updated on Sep 8 2026 5:35 AM

Hyderabad Ganesh Nimajjanam Massive Arrangements Across Three Municipal Corporations

క్రేన్లు..కొలనులు సిద్ధం

గ్రేటర్‌లో గణేష్‌ నిమజ్జనోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు  

ఎప్పటికప్పుడు వ్యర్థాల తొలగింపునకు జీఏటీ బృందాలు

నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్లు, రెస్క్యూ బృందాలు

విద్యుత్, వైద్య సేవలకు ప్రత్యేక ప్రణాళిక  

సాక్షి, హైదరాబాద్‌: వినాయక చవితి నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, సురక్షితంగా నిర్వహించేందుకు గ్రేటర్‌ పరిధిలోని మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు విస్తృత ఏర్పాట్లకు సిద్ధమవుతున్నాయి. భారీ విగ్రహాల నిమజ్జనం, లక్షలాది మంది భక్తుల రాక, ఊరేగింపు మార్గాల్లో ట్రాఫిక్‌ ఇబ్బందులు, చెత్త పేరుకుపోవడం వంటి సవాళ్లను దృష్టిలో  పెట్టుకుని అధికారులు వివిధ  విభాగాల సమన్వయంతో కార్యాచరణ రూపొందించారు. నిమజ్జన ప్రాంతాల వద్ద క్రేన్లు, ఈతగాళ్లు, పడవలు, వైద్య శిబిరాలు, మొబైల్‌ టాయిలెట్లు, పారిశుద్ధ్య బృందాలను  అందుబాటులో ఉంచనున్నారు.

జీహెచ్‌ఎంసీలో  47 చెరువులు..  
జీహెచ్‌ఎంసీ  పరిధిలో 47 సరస్సులు, చెరువుల వద్ద నిమజ్జనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిలో 17 సరస్సులు, 30 చెరువులు, కొలనులు ఉన్నాయి. వీటి వద్ద 110 క్రేన్లు కేటాయించే ప్రణాళిక సిద్ధమైంది. ఖైరతాబాద్, అంబర్‌పేట, జల్‌పల్లి, రాజేంద్రనగర్‌ తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఖైరతాబాద్‌ ప్రాంతంలో 41 క్రేన్లు,  ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ వద్ద 21 క్రేన్లు ఉంటాయి. నిమజ్జన ప్రాంతాల వద్ద 770 మంది పారిశుద్ధ్య సిబ్బంది మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహించనున్నారు.

సైబరాబాద్‌ పరిధిలో 54 నిమజ్జన కేంద్రాలు సిద్ధమవుతున్నాయి. వీటిలో 32 సరస్సులు, 13 బేబీ పాండ్లు, 7 తాత్కాలిక పాండ్లు, ఒక పోర్టబుల్‌ పాండ్, మరో పాండ్‌ ఉన్నాయి. 81 క్రేన్లు, 1,138 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 130 టాయిలెట్లు ఏర్పాటు చేస్తున్నారు. జీడిమెట్ల, చింతల్‌ ప్రాంతాల్లో కొత్త తాత్కాలిక నిమజ్జన పాండ్లను ప్రతిపాదించారు. దుర్గం చెరువు, అంబీర్‌ చెరువు, పరికి చెరువు, ఐడీఎల్‌ లేక్, ఊర చెరువు, పెద్ద చెరువు లతోపాటు  కొల్లూరు, అమీన్‌పూర్, మియాపూర్, శేరిలింగంపల్లి ప్రాంతాల్లోనూ విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో 1,138 మంది సిబ్బందిని వినియోగించనున్నారు.

కేబుళ్ల తొలగింపు..తాత్కాలిక లైట్లు 
నిమజ్జన కేంద్రాలు, ఊరేగింపు మార్గాల్లో ఫోకస్‌ లైట్లు, తాత్కాలిక విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు వేలాడుతున్న కేబుళ్లను తొలగించనున్నారు. చెట్ల కొమ్మల తొలగింపు, గుంతల పూడ్చివేత, రోడ్ల మరమ్మతులు, ఫుట్‌పాత్‌లకు రంగులు వేయడం వంటి పనులు  చేపట్టనున్నారు.

రంగంలో గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌  
నిమజ్జన ఊరేగింపు మార్గాల్లో చెత్త పేరుకుపోకుండా గణేశ్‌ యాక్షన్‌ టీమ్స్‌(జీఏటీ)ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.  ఆయా మార్గాల వారీగా పారిశుద్ధ్య  సిబ్బంది, శానిటరీ సూపర్‌వైజర్లు, ఫీల్డ్‌ అసిస్టెంట్లను కేటాయించి మూడు షిఫ్టుల్లో పనిచేసేలా ప్రణాళిక రూపొందించారు.  

నిరంతరంగా విద్యుత్‌ సరఫరా: సీఎండీ 
ఖైరతాబాద్‌: గణేష్‌ ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలకు నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా ఉంటుందని, అలాగే ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ జితేష్‌ వి. పాటిల్‌ పేర్కొన్నారు. ఈమేరకు ఆయన గణేష్‌ ఉత్సవాలపై సోమవారం విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ముఖ్యమైన మండపాలు, ఊరేగింపు మార్గాలు, నిమజ్జన కేంద్రాల వద్ద అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు స్టాండ్‌బై జనరేటర్లు ఏర్పాటు చేయాలని, నగరానికి విద్యుత్‌ సరఫరా అందించే 220 కేవీ, 132 కేవీ స్టేషన్లపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలన్నారు.

ఎంఎంసీలో 40 ప్రాంతాల్లో..
మల్కాజిగిరి  మున్సిపల్‌  కార్పొరేషన్‌   పరిధిలో 40 నిమజ్జన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. భారీ విగ్రహాల తరలింపు, నిమజ్జన ప్రక్రియ కోసం 84 క్రేన్లు, 1,356 మంది పారిశుద్ధ్య సిబ్బంది, 62 మొబైల్‌ టాయిలెట్లు సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా మూడు కార్పొరేషన్ల పరిధిలోనూ చెరువుల వద్ద క్రేన్లు..రోడ్లపై జీఏటీలు, వినాయకులను తరలించే మార్గాల్లో బారికేడ్లు.. అత్యవసర సేవలకు వైద్య, ఫైర్, రెస్క్యూ బృందాలు, విద్యుత్, తాగునీరు, ట్రాఫిక్‌ నియంత్రణకు ప్రత్యేక సిబ్బంది సిద్ధంగా ఉండనున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వహించేందుకు మూడు కార్పొరేషన్ల కమిషనర్లు కర్ణన్, సృజన, వినయ్‌కృష్ణారెడ్డి  భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: తెలంగాణకు ఇది చీకటి రోజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement