పోలీసుల దౌర్జన్యంపై ఫొటోలను చూపిస్తున్న కోవాలక్ష్మి, సబిత, సునీత
ఇది అసెంబ్లీనా?.. రౌడీ రాజ్యమా?
బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేల ఆగ్రహం
సీఎం ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని ఫైర్
రేవంత్‌రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ వద్ద సోమవారం జరిగిన ఘటన అత్యంత హేయమని, సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అతిగా ప్రవర్తించారని, చీరలు పట్టుకుని లాగారని బీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, కోవా లక్ష్మి ఆరోపించారు. మహిళల పట్ల ముఖ్యమంత్రికి గౌరవం లేదని విమర్శించారు.
పోలీసుల ముసుగులో కొందరు గూండాల్లా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా నేతలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది అసెంబ్లీనా?.. రౌడీ రాజ్యమా? అని ప్రశ్నించారు. సోమవారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడారు. పోలీసులు తన గొంతు, జుట్టు పట్టుకుని లాగారని, సునీతా లక్ష్మారెడ్డి చీర పట్టుకుని లాగారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ అడ్డుకోకుంటే తమను కిందపడేసి పోలీసులు తొక్కేవారని అన్నారు.
ప్రశ్నిస్తే గొంతు పిసికే పరిస్థితి
ప్రశ్నిస్తే గొంతు పట్టుకుని పిసికే పరిస్థితి రాష్ట్రంలో నెలకొందని సబిత విమర్శించారు. జరిగిన ఘటనను మహిళా మంత్రి సీతక్క ఖండించాల్సింది పోయి డ్రామాగా పేర్కొనడం సరికాదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అహంకారం పెరిగిపోయిందని, ఘటనపై ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి పదవికి సీఎం రాజీనామా చేయాలని మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
దేశ చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎన్నడూ జరగలేదని, మహిళా ఎమ్మెల్యేలమని చూడకుండా పోలీసులు గొంతులు నొక్కారని కంట తడిపెట్టారు. రాష్ట్రంలో దుశ్శాసన పర్వం కొనసాగుతోందన్నారు. తమ టీషర్టులపై ముఖ్యమంత్రి మాట్లాడే బూతు భాష లేదని, కేవలం హామీల అమలు కోరుతూ నినాదాలున్నాయని కోవా లక్ష్మి తెలిపారు. పోలీసులు కేటీఆర్ గొంతు పట్టుకుని లాగారని, హరీశ్‌రావు చొక్కా చించారని, జగదీశ్‌రెడ్డి స్పృహ తప్పి పడిపోయారని చెప్పారు.
ఇవి కూడా చదవండి: దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత


