దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత | KTR Slams Revanth Reddy Over Attack On BRS Women Mlas | Sakshi
Sakshi News home page

దాడికి రేవంత్‌రెడ్డిదే బాధ్యత

Sep 8 2026 4:52 AM | Updated on Sep 8 2026 4:52 AM

KTR Slams Revanth Reddy Over Attack On BRS Women Mlas

నిమ్స్‌లో జగదీశ్‌రెడ్డిని పరామర్శిస్తున్న కేటీఆర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి తదితరులు

ఇదేనా ఇందిరమ్మ రాజ్యం?.. ఇదేనా ప్రజాపాలన?

రాహుల్‌కు ఒక రూలు.. మాకు ఒక రూలా?

దళిత, మహిళా వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్‌దే

ప్రజల దృష్టి మళ్లించేందుకే తాతా మధు వ్యాఖ్యల వక్రీకరణ

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, సీనియర్‌ ఎమ్మెల్యేలపై జరిగిన దాడికి ముఖ్యమంత్రి, రాష్ట్ర హోంమంత్రి హోదాలో రేవంత్‌రెడ్డే బాధ్యత వహించాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీ రామారావు డిమాండ్‌ చేశారు. ‘ఆడ బిడ్డల చీరలు లాగి.. గొంతులు పట్టి.. జుట్టు లాగుతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం? ఇదేనా ప్రజాపాలన?..’ అని నిలదీశారు. వెయ్యి రోజుల కాంగ్రెస్‌ పాలన వైఫల్యాలను అసెంబ్లీలో ఎండ­గడతామనే భయంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలను సభలోకి రాకుండా పోలీసులతో దాడులు చేయించారని ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్‌ భయపడుతోంది..
తప్పు చేయకుంటే ప్రజా సమస్యలను ఎజెండాలో పెట్టడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని కేటీఆర్‌ ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో తమకూ ఉందని అన్నారు. ‘రాహుల్‌గాంధీ నల్ల టీ షర్టు వేసుకుని, నినాదాలు చేస్తూ పార్లమెంట్‌కు వెళ్తే అడ్డుకోరు.. మేం అదే చేస్తే పోలీసులు అడ్డుకుంటారా?..’ అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి గతంలో నిరసన తెలిపే హక్కు ఏడో గ్యారంటీ అని చెప్పారని, ఇప్పుడు తమ నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు.

గతంలో మేం క్షమాపణ చెప్పాం..
సీఎం కూడా ఎమ్మెల్యేనే అని, స్పీకర్‌ పక్షపాత వైఖరి వీడి అందరికీ సమాన నిబంధనలు వర్తింపజేయాలని కేటీఆర్‌ కోరారు. తమ ఎమ్మెల్సీ తాతా మధుకు అనని మాటలను ఆపాదిస్తూ అసలు దాడి ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గతంలో డీకే అరుణకు మనస్తాపం కలిగినప్పుడు కేసీఆర్‌ ఆదేశాలతో తాము క్షమాపణ చెప్పా­మని, అదే తమ సంస్కారమని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఇప్పుడు సీఎం రేవంత్‌ క్షమాపణ చెప్పాలని, మహిళా ఎమ్మెల్యేలపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ మహిళా ఎమ్మెల్యేలపై దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

దళితులపై రేవంత్‌ కపట ప్రేమ
దళితులపై రేవంత్‌రెడ్డి కపట ప్రేమ చూపుతున్నారని కేటీఆర్‌ విమర్శించారు. చిత్తశుద్ధి ఉంటే దళిత, గిరిజన డిక్లరేషన్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్‌ విసిరారు. దళిత బంధును ఎత్తివేసి రూ.12 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క రూపాయి ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.6 లక్షలు, అసైన్డ్‌ భూములకు పట్టాలు, ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 30 శాతం వాటా వంటి హామీలను అమలు చేయలేదని విమర్శించారు. దళిత వ్యతిరేకి, మహిళా వ్యతిరేకి ముమ్మాటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని అన్నారు. తమ ఎమ్మెల్యేలపై దాడి ఘటనపై హైకోర్టును ఆశ్రయించామని, ఎస్సీ, ఎస్టీ, మహిళా, మానవ హక్కుల కమిషన్లను కూడా ఆశ్రయిస్తామని చెప్పారు.

జగదీశ్‌రెడ్డికి పరామర్శ
నిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని కేటీఆర్‌ సోమవారం సాయంత్రం పరామర్శించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య జరిగిన తోపులాటలో ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే నిమ్స్‌ ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన క్షేమ సమాచారాన్ని కేటీఆర్‌ వైద్యులనడిగి తెలుసుకున్నారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మండలిలో విపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు , ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement